రెండో రోజూ అదే తీరు | indian athlets depression in rio olympics | Sakshi
Sakshi News home page

రెండో రోజూ అదే తీరు

Published Mon, Aug 8 2016 1:47 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

రెండో రోజూ అదే తీరు

రెండో రోజూ అదే తీరు

భారత అథ్లెట్లకు నిరాశ
రియో డీ జనీరో : ఒలింపిక్స్‌లో ఆదివారం భారత్‌కు పూర్తి నిరాశే మిగిలింది. మహిళల హాకీలో డ్రా మినహా పాల్గొన్న అన్ని ఈవెంట్లలోనూ మనోళ్లు తొలిరౌండ్లలోనే ఇంటిబాట పట్టారు. ఒలింపిక్ నుంచి భారత టీటీ జట్టు నిష్ర్కమించగా.. షూటింగ్‌లో వరుసగా రెండో రోజూ నిరాశే ఎదురయింది.

పోరాడి ‘డ్రా’చేసుకున్నారు
36 ఏళ్ల భారీ విరామం తర్వాత ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత మహిళల హాకీ జట్టు జపాన్‌తో జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో అద్భుతమైన పోరాట పటిమతో డ్రా చేసుకుంది. ఆట తొలి అర్ధం పూర్తయ్యేసరికి భారత్ 0-2తో వెనకబడింది. అయితే.. ద్వితీయార్ధంలో రాణి రాంపాల్, లిలిమా మింజ్ చెరో గోల్ చేయటంతో ఓటమి నుంచి గట్టెక్కింది. 2-2తో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.

టీటీ జట్టు నిష్ర్కమణ
టేబుల్ టెన్నిస్‌లో భారత ప్లేయర్లు మొదటి రౌండ్లోనే ఇంటిబాట పట్టారు. పురుషుల సింగిల్స్ ఈవెంట్లో రొమేనియన్ ఆడ్రియాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వెటరన్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్ 8-11, 12-14, 11-9, 6-11, 8-11 (1-4) తేడాతో ఓటమిపాలయ్యాడు. అంతకుముందు మౌమా దాస్, సౌమ్యజిత్ ఘోష్, మానిక కూడా తొలి రౌండ్లోనే చేతులెత్తేసిన సంగతి తెలిసిందే.

హీనా మిస్‌ఫైర్
ఒలింపిక్స్‌లో భారత షూటర్ల వైఫల్యం కొనసాగుతోంది. పతకంపై ఆశలు పెంచిన హీనా సిద్దు మహిళల ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్ రౌండ్లోనే ఇంటిబాట పట్టింది. మొత్తం 44 మంది పోటీదారుల్లో హీనా 14 స్థానంతో (380 పాయింట్లు) పరిపెట్టుకోవాల్సి వచ్చింది. మంగళవారం జరిగే 25మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

ట్రాప్‌లోనూ క్లిష్టమే...
పురుషుల ట్రాప్ తొలి క్వాలిఫయింగ్‌లో భారత షూటర్లు మానవ్‌జిత్ సింగ్ సంధు, కేనాన్ షెనాయ్ నిరాశ పరిచారు. 33 మంది షూటర్లు పాల్గొన్న ఈవెంట్‌లో వరుసగా 17, 19 స్థానాల్లో నిలిచారు. ఇటలీ షూటర్ ఫాబ్రిజీ మసీమో 75 పాయింట్ల రికార్డు స్కోరుతో మొదటి స్థానంలో నిలిచారు. అయితే సోమవారం జరిగే రెండు క్వాలిఫయింగ్ రౌండ్లలో వీరు పాల్గొంటారు.

సానియా జోడి ఔట్
మహిళల డబుల్స్ టెన్నిస్‌లో భారత జోడి సానియా మీర్జా, ప్రార్థన తోంబ్రేల జోడీ 1-2తేడాతో ఓటమిపాలైంది. చైనా జంట షువాయ్ ఝాంగ్, షువాయ్ పెంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7-6 (8-6), 5-7, 5-7తో పరాజయం పాలైంది. ప్రార్థన తోంబ్రే అనుభవరాహిత్యం మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. ప్రార్థన సర్వీస్‌ను చైనా ప్లేయర్లు చక్కగా వినియోగించుకున్నారు. తొలి సెట్ హోరాహోరీగా జరిగినా.. రెండు, మూడు సెట్లలో సానియాకు ప్రార్థన నుంచి సరైన సహకారం లభించలేదు. దీంతో ప్రపంచ నెంబర్ వన్ డబుల్స్ ప్లేయర్ సానియా మీర్జా మహిళల డబుల్స్ తొలి రౌండ్లోనే నిష్ర్కమించక తప్పలేదు. మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా-బోపన్న జోడీపైనే ఆశలు మిగిలాయి.

 మీరాబాయ్ వైఫల్యం
సైకోమ్ మీరాబాయి చానూ మహిళల 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో తీవ్ర నిరాశ మిగిల్చింది. స్నాచ్ విభాగంలో రెండు (మొత్తం మూడు) అవకాశాల్లో, క్లీన్ అండ్ జెర్క్ సెక్షన్‌లోని మూడు ప్రయత్నాల్లోనూ కనీస బరువునెత్తడంలో ఈమె దారుణంగా విఫలమైంది. మొదటి ప్రయత్నంలో 104కిలోగ్రాములు ఎత్తటంలో తడబడ్డ చానూ.. తర్వాతి రెండు ప్రయత్నాల్లోనూ చేతులెత్తేసింది.  క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో చానూ వ్యక్తిగత ఉత్తమ ప్రతిభ 107 కేజీలు కావటం విశేషం.

ఆర్చరీలో మళ్లీ నిరాశ
ఒత్తిడిలో మరోసారి తడబడిన భారత మహిళల ఆర్చరీ జట్టు రియో ఒలింపిక్స్‌లో నిరాశ పరిచింది. క్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయి పతకం రేసు నుంచి నిష్ర్కమించింది. రష్యా జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో దీపిక కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణిలతో కూడిన భారత జట్టు 4-5తో రెండో సీడ్ రష్యా చేతిలో పరాజయం పాలైంది. నిర్ణీత నాలుగు సిరీస్‌ల తర్వాత భారత్, రష్యా 4-4తో సమంగా నిలువడంతో ఫలితం తేలడానికి ‘షూట్ ఆఫ్’ను నిర్వహించారు. రెండు జట్లకు మూడేసి బాణాలు సంధించే అవకాశాన్ని ఇచ్చారు. భారత్ 23 పాయింట్లు స్కోరు చేయగా... రష్యా 25 పాయింట్లు సాధించి విజయాన్ని దక్కించుకుంది. భారీ ఆశలు పెట్టుకున్న స్టార్ ఆర్చర్ దీపిక కుమారి కీలకదశలో గురి తప్పడం, లక్ష్మీరాణి కూడా అంతగా రాణించకపోవడం భారత విజయావకాశాలను దెబ్బతీసింది. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్ 5-3తో కొలంబియాను ఓడించింది. లండన్ ఒలింపిక్స్‌లో భారత్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది.

 వాల్ట్ ఫైనల్లో దీపా కర్మాకర్
భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ వాల్ట్ ఈవెంట్‌లో ఫైనల్లోకి ప్రవేశించి పతకం రేసులో నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల క్వాలిఫయింగ్‌లో దీపా వాల్ట్ విభాగంలో 14.850 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. ఆల్ ఆరౌండ్ విభాగంలో దీపా కర్మాకర్ ఓవరాల్‌గా 51.665 పాయింట్లు సాధించి 27వ స్థానంలో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement