నడిరోడ్డుపై దారుణహత్య
ప్రొద్దుటూరులో వేట కొడవళ్లతో వెంటాడి చంపిన ప్రత్యర్థులు
ప్రొద్దుటూరు క్రైం: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో కోర్టు వాయిదాకు వచ్చిన ఓ యువకుడిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. పట్టపగలు నడిరోడ్డులో వేట కొడవళ్లు చేత బట్టుకుని వెంటాడి నరికి చంపిన సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామానికి చెందిన బోరెడ్డి మారుతీప్రసాద్‌రెడ్డి (34) డిగ్రీ చదువుకున్నాడు. మూడేళ్ల కిందట విజయవాడకు చెందిన మహిళతో వివాహం కాగా ఇటీవలే విడాకులు తీసుకున్నాడు. తండ్రి చనిపోవడంతో కొంతకాలం ఇంటివద్దే ఉండి పొలం పనులు చూసుకున్న అతడు తర్వాత సింగపూర్ వెళ్లి కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మూడేళ్ల క్రితం తన సోదరిని తిట్టిందనే కోపంతో నిర్మలమ్మ అనే మహిళను ఆమె ఇంటికెళ్లి బెదిరించాడనే ఆరోపణలపై రూరల్ పోలీస్‌స్టేషన్‌లో మారుతీప్రసాద్‌రెడ్డిపై కేసు నమోదైంది. అయితే చాలాకాలంగా కోర్టు వాయిదాలకు హాజరుకాలేదు.
నెలరోజుల కిందట సింగపూర్ నుంచి వచ్చిన అతను గురువారం వాయిదా ఉండటంతో ప్రొద్దుటూరు కోర్టుకు వచ్చాడు. అతడిపై ఫిర్యాదు చేసిన నిర్మలమ్మ, ఆమె బంధువులు కూడా వచ్చారు. కోర్టు వద్ద మారుతీప్రసాద్‌రెడ్డితో వారు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలోనే తమ వద్ద ఉన్న వేటకొడవళ్లతో అతడిపై దాడికి ప్రయత్నించారు. దీంతో అతను జమ్మలమడుగు రోడ్డువైపు పరుగెత్తాడు. నలుగురు వ్యక్తులు వేట కొడవళ్లతో అతని వెంటపడ్డారు. రెండు కత్తిపోట్లు తగలడంతో మార్కెట్ యార్డు వద్ద కిందపడిన మారుతీప్రసాద్‌రెడ్డిని నిర్మలమ్మ సోదరులు శ్రీనివాసులరెడ్డి, రఘునాథరెడ్డిలు అందరూ చూస్తుండగానే కత్తులతో విచక్షణారహితంగా నరికి హత్యచేశారు. అనంతరం ఇద్దరు నిందితులను త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.