సీఎం అయ్యేందుకు ఏ అర్హత ఉంది?
చెన్నై: తమిళనాడులో అధికార అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ముఖ్యమంత్రి అయ్యేందుకు ఏ అర్హత ఉందని ప్రతిపక్ష డీఎంకే నాయకులు విమర్శించారు. శశికళకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదని, కనీసం ఎమ్మెల్యే కూడా కాదని, ఆమె విధానాలు ఏంటో తెలియవని, ఆమె ముఖ్యమంత్రిగా ఎలా బాధ్యతలు చేపడుతారని డీఎంకే సీనియర్ నేత అన్నారు.
అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా శశికళను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమె ముఖ్యమంత్రి అయ్యేందకు వీలుగా ప్రస్తుతం సీఎం పన్నీరు సెల్వం రాజీనామా చేశారు. అన్నాడీఎంకే నిర్ణయాలను డీఎంకే తప్పుపట్టింది. తమిళనాడుకు ఇది చీకటి దినమని పేర్కొంది. అంతకుముందు ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెండ్ స్టాలిన్ స్పందిస్తూ.. జయలలిత కుటుంబ సభ్యులకు, ఆమె ఇంట్లో ఉన్న వాళ్ల కోసం ప్రజలు ఓట్లు వేయలేదని అన్నారు. ప్రస్తుత అన్నా డీఎంకే ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వర్గాలుగా చీలిపోయారని పేర్కొన్నారు.