రజనీకాంత్ కుటుంబానికి ఎదురుదెబ్బ!
చెన్నై : దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబానికి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నైలోని ఆశ్రమ్ మెట్రిక్యులేషన్ స్కూల్ రజనీ సతీమణి లత నేతృత్వంలో నడుస్తున్న విషయం తెలిసిందే. గిండీలోని పాఠశాల భవనానికి పెద్ద మొత్తంలో అద్దె బకాయిలు పడటంతో బుధవారం ఉదయం సీజ్ చేసినట్లు సమాచారం. దీంతో ఈ స్కూల్‌లో చదువుతున్న 300మంది విద్యార్థులను వెలచెరిలోని ఐసీఎస్‌ఈ స్కూల్ (ఆశ్రమ్ మెట్రిక్యులేషన్ స్కూల్ అనుబంధ సంస్థ)కు తరలించారు. కాగా భవనం యజమాని వెంకటేశ్వర్లు మంగళవారం రాత్రే స్కూల్‌కు తాళం వేసినట్లు తెలుస్తోంది.
2002లో భవనాన్ని అద్దెకు ఇచ్చామని, అయితే సకాలంలో అద్దె చెల్లించకపోవడంతో 2013లోనూ ఖాళీ చేయాలని స్కూల్ మేనేజ్‌మెంట్‌ను కోరినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పదికోట్లు చెల్లించాలంటూ బిల్డింగ్ యజమాని కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే అంత మొత్తాన్ని ఒకేసారి చెల్లించలేమంటూ స్కూల్ యాజమాన్యం తరఫు న్యాయవాది కేవలం రూ.2కోట్లు మాత్రమే చెల్లించినట్లు తెలుస్తుంది. అప్పటి నుంచి మిగతా బకాయిలు చెల్లించెకపోవడమే కాకుండా, లతా రజనీకాంత్ నుంచి కూడా ఎలాంటి సమాధానం రాకపోవడంతో స్కూల్‌కు తాళం వేసినట్లు సమాచారం.