ఏపీ స్పీకర్ కోడెల సంచలన వ్యాఖ్యలు | ap Speaker sivaprasadarao sensational comments | Sakshi
Sakshi News home page

ఏపీ స్పీకర్ కోడెల సంచలన వ్యాఖ్యలు

Published Tue, Jun 21 2016 3:14 AM | Last Updated on Sat, Aug 18 2018 8:25 PM

ఏపీ స్పీకర్ కోడెల సంచలన వ్యాఖ్యలు - Sakshi

ఏపీ స్పీకర్ కోడెల సంచలన వ్యాఖ్యలు

మొన్న ఎన్నికల్లో రూ. 11.50 కోట్లు ఖర్చు చేశా!
నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే అభ్యర్థి వ్యయం
రూ.28 లక్షలు మించరాదు
అఫిడవిట్ ప్రకారం ఆయన స్థిరచరాస్తులు రూ. 5.3 కోట్లే..
కోడెల వ్యాఖ్యలపై రాజకీయవర్గాల విస్మయం..
చర్యకు అర్హమైన వ్యాఖ్యలే.. న్యాయవాదుల అభిప్రాయం

 
 సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల్లో రూ.11.50 కోట్లు ఖర్చు చేశానని గుంటూరు జిల్లా సత్తెనపల్లి శాసనసభ్యుడు, ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచ లనం సృష్టించాయి. వీటిపై అటు రాజకీయవర్గాలలోనూ, న్యాయవర్గాలలోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. కోడెల ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ‘నేను మొదట రాజకీయాల్లోకి వచ్చి 1983 ఎన్నికల్లో పోటీ చేసినపుడు రూ. 30 వేలు ఖర్చయ్యింది. ఆ 30 వేలల్లో కూడా గ్రామాలు, ప్రజల నుంచి చందాలు వచ్చాయి.  
 
 అలాంటిది మొన్నటి ఎన్నికల్లో రూ.11.50 కోట్లు ఖర్చయ్యింది. ఈ విధంగా డబ్బు ఖర్చు చేయాలంటే అవినీతి చేసే వారు కొంత మంది, ఆస్తులు అమ్మేవారు కొంత మంది, రెండూ కలిపి చేసేవారు కొంతమంది ఉన్నారు. పార్లమెంటు సభ్యుడి దగ్గర తీసుకునే వారు కూడా కొంతమంది ఉన్నారు. రాజకీయాల్లో డబ్బుకు ప్రాధాన్యత పెరిగింది. ఇది ఆరోగ్యకర పరిణామం కాదు. ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రజాప్రతినిధులు సంపాదిం చారు కాబట్టి వారి దగ్గర డబ్బులు తీసుకోవటం సరైందేనని ప్రజలు అనుకుంటున్నారు. మా దగ్గర ప్రజలు డబ్బులు తీసుకున్నారు కా బట్టి సంపాదించుకోవాలని వారు (ప్రజాప్రతినిధులు) అనుకుంటున్నారు‘ అని అన్నారు.
 
 ఎన్నికల నిబంధనల ప్రకారం...
 శాసనసభ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి వ్యయం పరిమితి ఉంది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని  శాసనసభ స్థానానికి పోటీచేసే అభ్యర్థి వ్యయం రూ.28 లక్షలు, లోక్‌సభ స్థానానికి పోటీచేసే అభ్యర్థి వ్యయం రూ.70 లక్షలకు మించకూడదు. హర్యాణా, మేఘాలయ తదితర చిన్న రాష్ట్రాల నుంచి పోటీచేసే ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.22 లక్షలు, ఎంపీ అభ్యర్థికి రూ.54 లక్షలు వ్యయం మించకూడదు.
 
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే..
 సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాదరావు ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేశారు. ఆయన నిజాయితీగా లెక్కలు చెప్పాలని అనుకుంటున్నా అందులో ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. ఏ కోర్టుకూ ఆయన్ను ప్రశ్నించే హక్కు లేకున్నా.. ఆయన నైతిక తప్పిదానికి పాల్పడినట్టే. తానే తప్పుచేశానని చెప్పడం, విలువలను దారుణంగా వంచించడమే.
- సీహెచ్.బుచ్చిరాజు, బీజేపీ రాష్ట్ర నేత
 
 సుమోటోగా చర్యలు తీసుకోవాలి
 స్వయానా తన నోటి నుంచే ఎన్నికల్లో రూ. 11.50 కోట్లు ఖర్చు చేశానని కోడెల శివప్రసాదరావు చెప్పినందున ఎన్నికల సంఘం సుమోటోగా చర్యలు తీసుకోవాలి. ఎన్నికల సంఘం నిర్ణయించిన వాటి కంటే ఎక్కువ ఖర్చు చేస్తే అది అవినీతి కిందకే వస్తుంది. విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే.
 - ఎన్.తులసిరెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి
 
 రాజకీయాలు భ్రష్టు  పట్టిపోయాయి..
 రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయనడానికి ఇంత కన్నా నిదర్శనం లేదు. ఎన్నికల సంస్కరణలకు ఇది సరైన సమయం. రాజకీయాలు పూర్తిగా డబ్బుమయం అయ్యాయి. కోట్లు ఉన్నవాడు తప్ప నీతి నిజాయితీ కలిగిన సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. ఎన్ని కోట్లు ఖర్చుపెడితే అంత గొప్ప అనే పరిస్థితి ఏర్పడింది. కోడెల శివప్రసాదరావు స్వయంగా పదకొండున్నర కోట్లు ఖర్చు పెట్టానని చెప్పడం నేటి రాజకీయ దురవస్ధకు తార్కాణం. దీనిపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి.
- కె. రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ
 
 తీవ్రంగా పరిగణించాలి
రూ.11.50 కోట్లు ఎన్నికల ఖర్చు చేశారంటే దానిని తీవ్రంగానే పరిగణించాలి. ఓ ఎమ్మెల్యే స్థానానికి అంత మొత్తం ఖర్చు చేశారంటే ఆలోచించాలి. ఆయనపై అనర్హత వేటు వేసేందుకు ఆయన స్వయంగా చెప్పిన విషయాలే సరిపోతాయి. ఎన్నికల్లో ఎంత ఖర్చు చేయాలన్నది నిబంధనల్లో స్పష్టంగా ఉంది. దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఖర్చు చేసినట్లు కోడెల వ్యాఖ్యలతోనే తేటతెల్లమవుతోంది. ఈ స్థాయిలో ఖర్చు ఎన్నికల నియమావళికి విరుద్ధం. దీనిపై ఎన్నికల సంఘం సుమోటోగా విచారణ ప్రారంభించవచ్చు. ఎవరైనా ఫిర్యాదు చేసినా స్పందించి విచారణ జరపాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఎవరైనా కోరవచ్చు.
 - ఎ.సత్యప్రసాద్, సీనియర్ న్యాయవాది
 
 ప్రజల్లో చైతన్యం వచ్చినపుడే అడ్డుకట్ట
ఓ ప్రజా ప్రతినిధి ఎన్నికల్లో ఖర్చు ఎలా తగ్గించాలో చెప్పడంతో పాటు చేతల్లో చూపించాల్సింది పోయి ఈ విధంగా రూ.11.50 కోట్లు ఖర్చు పెట్టడం ఎంత వరకు సమంజసమో ఆలోచించాలి. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే ఇటువంటి ఖర్చులకు అడ్డుకట్టపడుతుంది. ఎన్నికల కమిషన్ సుమోటోగా స్పందించి విచారణ ప్రారంభించవచ్చు. ఫిర్యాదు చేసినా కూడా ఎన్నికల సంఘం స్పందించాల్సిందే.
 - ఎస్. సత్యంరెడ్డి, సీనియర్ న్యాయవాది
 
  బాధ్యతారాహిత్యం...
ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం నిబంధనలకు విరుద్ధం. తప్పు చేసి పెపైచ్చు దానిని ఘనంగా చెప్పుకోవడం, అదీ ఓ గౌరవప్రదమైన పదవిలో ఉండి చెప్పుకోవడం అత్యంత బాధ్యతారాహిత్యం. దీనిపై ఎన్నికల సంఘం సుమెటోగా చర్యలు చేపట్టవచ్చు. ఫిర్యాదు చేసినా స్పందించి తీరాలి. ఆయనపై పోటీ చేసిన ఓడిపోయిన వ్యక్తి న్యాయపరంగా పోరాటం కూడా చేయవచ్చు.     
- పి.గంగయ్య   నాయుడు, సీనియర్ న్యాయవాది
 
  శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలి
 సీనియర్ నాయకుడైన డాక్టర్ కోడెల శివప్రసాదరావు రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చినట్లు ఆయన చెప్పిన మాటలను బట్టి నిరూపితమైంది. ఎన్నికల సంఘం అనుమతికి మించి వ్యయం చేసినట్లు ఆయనే చెప్పినందున ఆయన శాసనసభ సభ్యత్వాన్ని ఎన్నికల సంఘం  రద్దు చేయాలి.  కోడెల మాట లపై ఎన్నికల సంఘం  సుమోటోగా విచారణ జరిపించా లి. కేంద్ర ఎన్నికల సంఘం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి.     
 - డా. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి,
ఎమ్మెల్యే, నరసరావుపేట

 
 అఫిడవిట్‌లో అన్ని ఆస్తులు లేవు..
 కోడెల శివప్రసాదరావు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తన స్థిర చరాస్తుల వివరాలన్నీ ఇచ్చారు. తనపై ఉన్న కేసుల వివరాలతో పాటు చేతిలో ఉన్న నగదు గురించీ వివరించారు. ఆ అఫిడవిట్ ప్రకారం స్థిర చరాస్తులు, చేతిలో ఉన్న నగదు, ఇంకా ఇతర అన్ని రకాల ఆదాయ వివరాలన్నీ కలుపుకున్నా రూ. 5.29 కోట్లు మాత్రమే. అలాంటపుడు ఆయన ఈ రూ. 11.50 కోట్లు ఎలా ఖర్చు చేశారని విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
 
ఎన్నికల సంస్కరణలు రావాలి..
ఎన్నికల్లో  నిబంధనల ప్రకారం చేయాల్సిన ఖర్చుకు, వాస్తవిక వ్యయానికి మధ్య భారీ వ్యత్యాసం ఉంటోంది. దీన్ని నివారించి సక్రమమైన పద్ధతుల్లో వ్యవస్థ నడవాలంటే ఎన్నికల సంస్కరణలు రావలసిన అవసరముంది. ఎన్నికల వ్యయ పరిమితికి, వాస్తవిక ఖర్చుకు భారీ వ్యత్యాసం ఉంటున్న విషయం బహిరంగ రహస్యం. కోడెల శివప్రసాదరావు చెప్పిన మాట వాస్తవమే. దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉంది. పీవీ నరసింహరావు హయాంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన మాదిరిగా ఎన్నికల సంస్కరణలు తేవలసి ఉంది.
 
 పార్లమెంటు దీనిపై దృష్టి సారించాలి. ఎన్నికల సంస్కరణలకు సంబంధించి పలు రకాల నివేదికలు అందుబాటులో ఉన్నాయి. పార్లమెంటులో దీనిపై కూలంకషంగా చర్చించి ఆచరణాత్మక రీతిలో, నిర్దేశిత సమయం నుంచి అమల్లోకి వచ్చేలా ఎన్నికల సంస్కరణల చట్టాన్ని చేయాలి. చర్చించి వదిలేయడం కాకుండా ఫలవంతమైన ముగింపు ఉండాలి. ఎన్నికల సంస్కరణలను అమలు చేయడం ద్వారానే  ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.  ఆర్థిక స్థోమత లేకపోయినా సేవాభావం ఉన్న వారికి, మంచివారికి అపుడే ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.
 - మాజీ స్పీకర్ కెఆర్ సురేష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement