కేజ్రీవాల్ అష్టాదశ షరతులు
ఢిల్లీ రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి కావాలంటే ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇస్తామంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి అరవింద్ కేజ్రీవాల్ విషమ పరీక్షే పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎంతగానో ముందుకు తీసుకొచ్చిన 'రీటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ)' సహా పలు అంశాల్లో భారీగా షరతులు విధిస్తూ వాళ్ల ముందరి కాళ్లకు బంధాలు వేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 18 షరతులు పెట్టిన కేజ్రీవాల్, వాటన్నింటికీ ఒప్పుకొంటేనే ప్రభుత్వం ఏర్పాటుకు అంగీకరిస్తానన్నారు. దీంతో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీ.. రెండింటికీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఆ షరతులేంటో చూద్దాం..
- వీఐపీ సంస్కృతి ముగింపు: మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు ఎర్రబుగ్గ కార్లు ఉండకూడదు. వారు ప్రభుత్వ బంగళాల్లో నివసించరాదు. ప్రత్యేక భద్రతను స్వీకరించకూడదు.
- జన్‌లోక్‌పాల్ బిల్లు: హజారే ప్రతిపాదించిన బిల్లును ఆమోదించి అమలుచేయాలి.
- స్వపరిపాలన: ప్రతి కాలనీలో నిర్వహించే సభల్లో ప్రజలే నేరుగా నిర్ణయం తీసుకుంటారు.
- సంపూర్ణ రాష్ట్ర హోదా: ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కల్పించాలి. డీడీఏ. ఢిల్లీ పోలీసులను కేంద్రం అజమాయిషీ నుంచి తప్పించాలి.
- ఢిల్లీలోని ప్రైవేటు విద్యుత్ కంపెనీలన్నింటికీ ప్రత్యేక ఆడిట్ జరపాలి. ఆడిట్‌లో పాల్గొనడానికి నిరాకరించే కంపెనీల లెసైన్సులను రద్దు చేయాలి.
- విద్యుత్తు మీటర్లను తనిఖీ చేయాలి.
- నీటి మాఫియా ఆట కట్టించాలి: ఢిల్లీలో వాటర్ మాఫియా ఆటకట్టించి ప్రతి ఇంటికి 700 లీటర్ల నీటిని ఉచితంగా అందజేయాలి.
- అనధికార కాలనీల క్రమబద్ధీకరణ: 30 శాతం ఢిల్లీ జనాభా అనధికార కాలనీలలో నివసిస్తోంది. కాబట్టి వాటిని క్రమబద్ధీకరించాలి.
- జుగ్గీ జోపిడీవాసులకు పక్కా ఇళ్లు: మురికివాడల్లో నివసించేవారికి పక్కా ఇళ్లను అందుబాటు ధరలకు ఇవ్వాలి, అంతవరకు వారి ఇళ్లను కూల్చకూడదు. వారికి మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పించాలి.
- కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి.
- చిన్న వ్యాపారులకు మద్దతు: రోడ్లు, విద్యుత్తు, నీరు వంటి కనీస వసతులను సాధారణ వ్యాపారికి కల్పించాలి.
- రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐ వద్దు
- రాజధాని దగ్గరలోని గ్రామాలలో నివసించే రైతులకు సదుపాయాలు, సబ్సిడీ ఇవ్వాలి.
- 500 ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించాలి. ప్రైవేటు పాఠశాలల్లో డొనేషన్లను రద్దు చేసి వ్యవస్థను పారదర్శకంగా మార్చాలి.
- ఆరోగ్యం: మెరుగైన వసతులతో కొత్త ప్రభుత్వ ఆసుపత్రులను ఏర్పాటుచేయాలి.
- మహిళల కోసం ప్రత్యేక భద్రతా యూనిట్లు ఏర్పాటుచేయడం, అన్ని వేధింపుల కేసులను మూడు నెలలలో పరిష్కరించడం వంటివి చేయాలి.
- ఆరు నెలల్లో అన్ని కేసులను పరిష్కరించేందుకు వీలుగా జడ్జీలను నియమించాలి.
- ఈ అంశాలపై అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు ఆప్‌కు సహకరిస్తాయా? అనే విషయంలో స్పష్టత ఉండాలి.