సారీతో సరి | Assaults on IPS officer subramanyam:TDP lawmakers apologize | Sakshi
Sakshi News home page

సారీతో సరి

Published Mon, Mar 27 2017 1:05 AM | Last Updated on Tue, Oct 30 2018 4:47 PM

సారీతో సరి - Sakshi

సారీతో సరి

‘దేశం’ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గూండాగిరీ..
సర్కారు తీరుపై అంతా విస్మయం
ఇదేం ప్రజాస్వామ్యం అంటూ అధికార వర్గాల మండిపాటు
దోషులను కాపాడటానికి స్వయంగా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి
‘సారీ’తో వివాదం ముగిసిందని కమిషనర్‌తో చెప్పించిన వైనం


సాక్షి, అమరావతి: నడి రోడ్డులో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి బాలసుబ్రహ్మణ్యంను నిర్బంధించి.. ఆయనపై గూండాగిరీకి ప్రయత్నించి, అడ్డొచ్చిన ఆయన గన్‌మెన్‌పై దాడికి దిగిన  టీడీపీ ఎంపీ కేశినేని  బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనకేసుకొచ్చింది. అధికారం అండ చూసుకుని నడిబజారులో పేట్రేగిన కేశినేని ట్రావెల్స్‌ అధినేత, టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి సింపుల్‌గా ‘సారీ’తో సరి పెట్టించింది. విజయవాడ వీధుల్లో ఒక ఐపీఎస్‌ అధికారిని పట్టుకుని నోటికొచ్చినట్లు దుర్భాషలాడితే కేసు కూడా పెట్టకపోవడం విస్మయం కలిగిస్తోంది.

ఇదేం ప్రజాస్వామ్యమని, ఇలాగైతే రాష్ట్రంలో ఉద్యోగాలు చేయలేమంటూ అధికార వర్గాలు మండిపడుతున్నాయి. దౌర్జన్యం, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు, ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. దాడులకు పాల్పడిన వారిని ఉపేక్షించడం భవిష్యత్‌లో ఏ పరిణామాలకు దారి తీస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇసుక మాఫియాను అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దాడి చేస్తే ఇప్పటికీ న్యాయం చేయలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా చంద్రబాబు వనజాక్షినే తప్పు పట్టారని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ తీరు పట్ల ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ నేతలు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా పౌర సమాజం ప్రభుత్వ తీరును ఎండగడుతోంది.

ఆదివారం ఆద్యంతం హై డ్రామా
టీడీపీ నేతలు దాడికి పాల్పడి అత్యంత హేయంగా కమిషనర్‌ను దూషించిన సంఘటనపై ఆదివారం ఆద్యంతం పెద్ద హై డ్రామానే నడిచింది. దాడికి పాల్పడిన వారు ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన తర్వాత.. స్వయంగా ఆయనే రంగంలోకి దిగి వివాదాన్ని పూర్తిగా పక్కదారి పట్టించారు. దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంపై ప్రశ్నించిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసులు పెట్టించిన చంద్రబాబు.. తమ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఏకంగా ఐపీఎస్‌ అధికారిపై తిట్ల దండకం ప్రారంభించి గన్‌మెన్‌పై ఏకంగా దాడి చేసినా ‘సారీ’తో దారి మళ్లించారు.

ఈ ఘటనపై ఆదివారం ఉదయం 11 గంటలకు ఆర్టీసీ భవన్‌లో ఉన్న రవాణా శాఖ కార్యాలయంలో ఉద్యోగుల జేఏసీ సమావేశమైంది. కేశినేని నాని, బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గన్‌మెన్‌పై దాడి ఘటనలో ఎమ్మెల్యే బొండా ఉమ, ఎంపీ కేశినేని నానిలపై కేసులు నమోదు చేయాలని, లేకుంటే పెన్‌డౌన్‌కు సిద్ధమన్నారు.  

ప్రభుత్వమంటే ఇదేనా?
ప్రభుత్వం అంటే గూండాల్లా వ్యవహరించడమా? అని ఉద్యోగుల జేఏసీ ప్రశ్నించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? ఉద్యోగులు ప్రశాంతంగా విధులకు హాజరు కావాలా? వద్దా? అని నిలదీసింది. ఓ సీనియర్‌ ఐపీఎస్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే పోలీస్‌ అధికారులు, వారి సంఘం ఏం చేస్తున్నారని మండిపడింది. సాయంత్రంలోగా కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. ఆ తర్వాత రవాణా ఉద్యోగులు, అధికారులతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్‌ కల్లాంను కలిసేందుకు బయలుదేరారు. సీఎస్‌ను కలిసేందుకు వెళుతుండగా, రవాణా శాఖ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంకు నేరుగా సీఎం చంద్రబాబు ఫోన్‌ చేశారు. తన పట్ల ఎమ్మెల్యే బొండా ఉమ, కేశినేని వ్యవహరించిన తీరును కమిషనర్‌.. చంద్రబాబు దృష్టికి తెచ్చారు.

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో వివాదాలు మంచిది కాదని ముఖ్యమంత్రి.. కమిషనర్‌కు సూచించినట్లు తెలిసింది. కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యం తన కార్యాలయంలో కూర్చొంటే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ముగ్గురు వచ్చి క్షమాపణలు చెబుతారని సీఎం చంద్రబాబు తెలిపారు. దీంతో రవాణా ఉద్యోగులు, కమిషనర్‌ వెనుదిరిగి రవాణా కార్యాలయానికి చేరుకున్నారు. కొద్ది సేపటికే  కేశినేని నాని,  బొండా ఉమ, బుద్దా వెంకన్నలు ఆర్టీసీ హౌస్‌కు చేరుకుని కమిషనర్‌ బాలసుబ్రమణ్యంకు క్షమాపణలు చెప్పారు.

వివాదం ముగిసినట్లే: బాలసుబ్రహ్మణ్యం
కేశినేని నాని, బొండా ఉమ, బుద్దా వెంకన్నలు వచ్చి క్షమాపణలు చెప్పారని, అవగాహనా రాహిత్యంతోనే వారు అలా వ్యవహరించారని రవాణా శాఖ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆవేశంగా ఉన్నప్పుడు ఎవరైనా అలానే వ్యవహరిస్తారని, తన సెక్యూరిటీ సిబ్బంది, రవాణా శాఖ అధికారుల నిబద్దతకు గర్వపడుతున్నాన న్నారు. ఒక ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం విషయంలో వివాదం రేగిందని, బస్సులో సాంకేతిక లోపం ఉందని నివేదిక ఇవ్వాలని ఎంపీ కేశినేని నాని అనుచరుడు పట్టాభి అనే వ్యక్తి ఒత్తిడి చేశారన్నారు. తాము రూల్స్‌ ప్రకారం నడుచుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

క్షమాపణలు చెప్పిన తర్వాత వివాదాన్ని ముందుకు తీసుకెళ్లడం సరికాదని, ఇంతటితో వివాదం ముగిసినట్లేనన్నారు. మీ గన్‌మెన్‌పై ఎమ్మెల్యే బొండా ఉమా చేయి చేసుకున్నందున చట్టపరమైన చర్యలు ఏమీ ఉండవా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తనకు రక్షణగా నిలిచిన గన్‌మెన్‌కు న్యాయం చేస్తానని, చర్యలు ఎలా ఉంటాయో మీరే చూస్తారంటూ ముక్తాయించారు. తనపై ఇంతలా, ఇలా దాడి జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు.  

ఐపీఎస్‌ అధికారుల్లో తీవ్ర చర్చ
సీనియర్‌ ఐపీఎస్‌  బాలసుబ్రమణ్యం ప్రకాశం జిల్లాతోపాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పని చేశారు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా, ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా చక్కదిద్దగల దిట్టగా ఆయనకు పేరుంది. మావోయిస్టులు, సెటిల్మెంట్‌ గ్యాంగ్, అరాచక శక్తులకు టెర్రర్‌ పుట్టించే ట్రాక్‌ రికార్డు ఉన్న పోలీస్‌ అధికారి బాలసుబ్రమణ్యంనే  కేశినేని నాని, బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నలు టార్గెట్‌ చేయడం పోలీస్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement