ఐపీఎస్‌పై టీడీపీ దాష్టీకం | TDP lawmakers assaults officials in vijayawada | Sakshi
Sakshi News home page

ఐపీఎస్‌పై టీడీపీ దాష్టీకం

Published Sun, Mar 26 2017 2:04 AM | Last Updated on Tue, Oct 30 2018 4:47 PM

ఆర్టీఏ కమిషనర్, బాలసుబ్రహ్మణ్యంను దుర్భాషలాడి ఆయన గన్‌మ్యాన్‌పై దాడి చేస్తున్న ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న - Sakshi

ఆర్టీఏ కమిషనర్, బాలసుబ్రహ్మణ్యంను దుర్భాషలాడి ఆయన గన్‌మ్యాన్‌పై దాడి చేస్తున్న ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

‘దేశం’ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్వైర విహారం
రవాణా శాఖ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంపై ఎంపీ కేశినేని బృందం దుర్భాషలు

గడ్డి తింటున్నావు... ఎంపీ అంటే లెక్కలేదా? అంటూ తిట్లదండకం
కొమ్ములొచ్చాయా.. ఏం బతుకు నీదంటూ ఎమ్మెల్యే బొండా చిందులు
ట్రావెల్స్‌ కేసులో తాము చెప్పినట్లు నివేదిక ఇవ్వాలని ఎంపీ హుకుం
కమిషనర్‌ గన్‌మ్యాన్‌పై దాడి చేసిన బొండా


సాక్షి, అమరావతి బ్యూరో / విజయవాడ : ‘నువ్వు గడ్డి తింటున్నావు. గడ్డి తిని ఇతర రాష్ట్రాలకు చెందిన అక్రమ బస్సులను నడిపి స్తున్నావు. ఎంపీని నేను ఆఫీసుకు వస్తుంటే వెళ్లిపోతున్నావా?... ప్రజాప్రతినిధి అంటే నీకు లెక్కలేదా? నీ సంగతి తేలుస్తా’ అని విజయ వాడ టీడీపీ ఎంపీ, కేశినేని ట్రావెల్స్‌ అధినేత కేశినేని శ్రీనివాస్‌(నాని) రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి బాల సుబ్రహ్మణ్యంపై విరుచుకుపడ్డారు. ‘ఏం నీకు కొమ్ములొచ్చాయా...? పై నుంచి దిగివచ్చావా ...? ఏం బతుకు నీది?’ అని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కమిషనర్‌ను తూలనాడుతూ చిందులు తొక్కారు.

కేశినేని నాని, బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పోలీస్‌ హౌసింగ్‌బోర్డు చైర్మన్‌ నాగుల్‌ మీరా, విజయవాడ మేయర్‌ కోనేరు శ్రీధర్‌ దాదాపు 200 మంది కార్యకర్తలతో కలసి శనివారంనాడు కమిషనర్‌ను విజయ వాడ నడిరోడ్డుపై దిగ్బంధించారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన బాలసుబ్రహ్మణ్యం ను దాదాపు రెండుగంటలపాటు నిలబెట్టిమరీ దుర్భాషలాడుతూ తీవ్రంగా అవమానించారు. పైగా కమిషనరే క్షమాపణ చెప్పాలంటూ ఆయన్ని ఘెరావ్‌ చేశారు. పోలీస్‌ డీసీపీ పాల్‌రాజ్, రవాణా శాఖ డీటీసీ మీరా ప్రసాద్‌లతోపాటు పలువురు అధికారులు ఎంతగా ప్రాధేయపడినా  వెనక్కితగ్గలేదు. అధికార టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు రాష్ట్ర రాజధానిలో జరిగిన ఈ  ఘటనతో  ప్రభుత్వ యంత్రాంగం నిర్ఘాంతపోయింది.  

కమిషనర్‌పై ఎంపీ ఒత్తిడి
ఆరెంజ్‌ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు విజయవాడ ఆటోనగర్‌ వద్ద ఈ నెల 22న ఓ వ్యక్తిని ఢీకొనడంతో ఆయన మృతిచెందారు. దీంతో ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సును పోలీసులు సీజ్‌ చేసి విచారణ కోసం విజయవాడ రవాణాశాఖ ఉప కమిషనర్‌(డీటీసీ) కార్యాల యానికి పంపారు. రవాణా శాఖ అధికారులు ఆ బస్సు కండిషన్‌ను పరిశీలించి నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఆ ఫైలును పరిశీలించేందుకు రవాణా శాఖ కమిషనర్‌ శనివారం విజయ వాడ బందరురోడ్డులోని డీటీసీ కార్యాలయా నికి వచ్చారు.  ఇంతలో ఎంపీ కేశినేని నాని ప్రధాన అనుచరుడు పట్టాభి అక్కడకు చేరుకు న్నారు. ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సుపై నివేదికను తాము చెప్పినట్లు రూపొందించాలని పట్టాభి అక్కడి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. అప్పటికే దాదాపు తయారైన నివేదికను మార్చి వేసి తాము సూచించినట్లు తయారు చేయాలని కేశినేని ఆదేశించారని కూడా పట్టాభి చెప్పినట్లు సమాచారం. ‘మాకు నిబంధనలు తెలుసు. నివేదిక ఎలా తయారు చేయాలో అలా చేస్తాం. ఇందులో మీరు ఒత్తిడి తేవడం సరికాదు’అని కమిషనర్‌ తన అభిప్రాయాన్ని అతనికి స్పష్టం చేశారు.

నడిరోడ్డుపై కేశినేని వీరంగం...
ఈ సమాచారం తెలుసుకున్న కేశినేని నాని తానే నేరుగా రంగంలోకి దిగారు. దాదాపు 200మంది టీడీపీ కార్యకర్తలతోసహా డీటీసీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పుడే కమిష నర్‌ తన పని ముగించుకుని వాహనంలో బయలుదేరారు. కేశినేని తన వాహనాన్ని నేరుగా కమిషనర్‌ వాహనానికి ఎదురుగా నిలిపారు. వెంటనే కిందకు దిగి కమిషనర్‌ వాహనాన్ని తన అనుచరులతో చుట్టుముట్టి గట్టిగా కేకలు వేయసాగారు. వాహనం దిగిన కమిషనర్‌ను టీడీపీ కార్యకర్తలు అంతా చుట్టు ముట్టి కదలనీయకుండా చేశారు. ‘నేను వస్తు న్నానని తెలిసి వెళ్లి పోతున్నావా...? ఏం టీడీపీ ఎంపీ అంటే ఆ మాత్రం గౌరవం, భయం లేవా...? అంతా నీ ఇష్టమేనా?’ అని కేశినేని తీవ్రస్థాయిలో కమిషనర్‌పై విరుచుకుపడ్డారు. ఈ హఠాత్పరిణామంతో కమిషనర్‌ నిశ్చేష్టులయ్యారు.

ఆయనకు కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా కేశినేని తీవ్రస్థా యిలో దుర్భాషలాడుతూ విరుచుకుపడ్డారు. ‘నువ్వు గడ్డి తింటున్నావు. నీ సంగతి తేలుస్తా’ అని పెద్ద పెట్టున కేకలు పెట్టారు. అంతలోనే టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగుల్‌ మీరా, విజయవాడ మేయర్‌ కోనేరు శ్రీధర్, టీడీపీ కార్పొరేటర్లు, ఇతర కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వారు కూడా కమిషనర్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలతో విరుచుకుపడ్డారు. కేశినేని నాని అక్కడే మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆరెంజ్‌ ట్రావెల్స్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బంధువు అనిల్‌రెడ్డికి చెందిందంటూ సంబంధంలేని ఆరోపణలు చేస్తూ విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయ త్నం చేయడం విస్మయానికి గురిచేసింది. రాష్ట్రంలో బస్సు ప్రమాదాలు జరుగుతు న్నప్పుడు మాత్రం జగన్‌ తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు.

గన్‌మ్యాన్‌పై ఎమ్మెల్యే బోండా దాడి
తన మాట విననందుకు కమిషనర్‌ తనకు క్షమాపణ చెప్పాలని కేశినేని నాని డిమాండ్‌ చేశారు. లేకపోతే అక్కడి నుంచి కదలనిచ్చేది లేదని తేల్చిచెప్పారు. బొండా ఉమ కూడా తీవ్రస్థాయిలో కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నీకు ఏమైనా కొమ్ములున్నాయా...? నువ్వు ఏమైనా దిగి వచ్చావా? ఏం బతుకు నీది?’ అని విరుచుకుపడ్డారు. అదే ఊపులో బొండా ఉమ.. కమిషనర్‌ మీదకు రాబోయా రు. దీన్ని గమనించిన కమిషనర్‌ గన్‌మ్యాన్‌ ఆయనకు అడ్డంగా వచ్చారు. దీంతో బొండా ఆగ్రహంతో ఆ గన్‌మ్యాన్‌పై దాడి చేశారు. పరిస్థితి దాదాపు అదుపుతప్పి కమిషనర్, ఇతర సిబ్బందిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడికి సిద్ధపడేంతవరకు వచ్చింది.  విజయవాడ రవాణా శాఖ ఉప కమిషనర్‌ మీరా ప్రసాద్‌ దాదాపు ఐదారు సార్లు చేతులు ఎత్తి నమస్కరిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలకు క్షమాపణలు చెబుతూ కమిషనర్‌ను వదిలేయాలని ప్రాధేయపడ్డారు. అధికారుల దుస్థితి చూసి అంతా అవాక్కయ్యారు. విజయవాడ పోలీస్‌ డీసీపీ పాల్‌రాజ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని కేశినేని, టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను శాంతించమని ప్రాధేయపడ్డారు.

సోమవారం విధుల బహిష్కరణ
తమ కమిషనర్‌పైనే టీడీపీ నేతల చౌకబారు విమర్శలు చేయడం, గన్‌మ్యాన్‌పై చేయి చేసుకోవడంపై రవాణా అధికారులు ఆందోళ నకు దిగనున్నారు. ఐజీ స్థాయి అధికారిపైనే ఈ మాదిరిగా వ్యవహరించిన టీడీపీ నేతలు కేశినేని, బొండా ఉమాలపై పోరు బాట పడతామని, ఆదివారం కార్యాచరణ ప్రకటిస్తామని రవాణా అధికారుల సంఘం నేత ఒకరు ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు. ప్రాథమికంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల్లో విధులు బహిష్కరిస్తామని పేర్కొన్నారు.

సొంత వ్యాపారం కోసమే గూండా గిరీ..
ట్రావెల్స్‌ రంగంలో ఉన్న ఎంపీ కేశినేని సొంత వ్యాపారం కోసమే రవాణాశాఖ కమిషనర్‌తో వివాదం పెట్టుకున్నారని రవాణా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణకు చెందిన పోటీ ట్రావెల్స్‌ ఆరెంజ్‌ ట్రావెల్స్‌పై కేసులు నమోదు చేయాలని కేశినేని నాని, అతని అనుచరులు రవాణా శాఖ అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు చేశారు. దీంతో ఆరెంజ్‌ ట్రావెల్స్‌పై కేసులు నమోదు చేశారు. తన వ్యాపారాన్ని పెంచుకునేందుకే కేశినేని దాడులు చేయిస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించి ఆలిండియా పర్మిట్లు పొందిన తమ బస్సులపై దాడులు చేయడం సరికాదని ఆరెంజ్‌ ట్రావెల్స్‌ యాజమాన్యం ఏపీ రవాణా కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యం దృష్టికి తెచ్చింది. తెలంగాణాకు చెందిన తమను ఇలా వేధించడం సరికాదని  వారు అభ్యర్థించారని సమాచారం. దాంతో  ఏకపక్షంగా కేసులు నమోదు చేయవద్దని  అధికారులకు కమిషనర్‌ సూచించినట్లు సమాచారం.

ఈ లోగా విజయవాడలో ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మరణించాడు. ఈ కేసులో తాను చెప్పినట్లు నివేదిక రూపొందించాలని ఎంపీ కేశినేని కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంపై ఒత్తిడి తెచ్చారనేది విశ్వసనీయ సమాచారం. తాను కలిసేందుకు వస్తానని ఎంపీ ఫోన్‌లో కోరగా బాలసుబ్రహ్మణ్యం స్పందించలేదని ఆయన వర్గీయులు చెపుతున్నారు. దీంతో కేశినేని   మందీమార్బలంతో కలిసి కమిషనర్‌ను కలిసేందుకు ఆర్టీసీ భవన్‌కు వెళ్లారు. ఆయన అక్కడ లేకపోవడంతో కృష్ణా డీటీసీ కార్యాలయానికి వెళ్లి అక్కడే ఉన్న బాలసుబ్రహ్మణ్యంపై నోరు పారేసుకున్నారు. గతంలోనూ ఆరెంజ్‌ ట్రావెల్స్‌ వ్యవహారంలో జేసీ ప్రభాకర్, తెలంగాణ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ మధ్య పెద్ద దుమారమే నడిచింది.

నేను నోరు విప్పితే చాలా విషయాలు బయటకు వస్తాయి: కమిషనర్‌
ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. కమిషనర్‌ దగ్గరకు వచ్చి ఎంపీకి క్షమాపణ చెబితే విడిచిపెడతామని చెప్పారు. లేకపోతే పరిస్థితి చెయ్యిదాటిపోతుందని హెచ్చరించారు. దీనిపై కమిషనర్‌ తీవ్రంగా స్పందించారు. ‘నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి? నా డ్యూటీ నేను చేశా. నేను నోరు విప్పితే చాలా విషయాలు బయటకు వస్తా యి. మీడియా ముందు మాట్లాడటం ఇష్టం లేదు’ అని అన్నారు. అనంతరం డీసీపీ పాల్‌రాజ్‌ టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ఒప్పించి.. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ గౌతం సవాంగ్‌ కార్యాల యానికి తీసుకు వెళ్లారు. పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో   చర్చిం చారు. అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ సమస్య పరిష్కారమైందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement