వీడిన మలేషియా విమానం మిస్టరీ
కౌలాలంపూర్ : గత కొన్నిరోజులుగా ఉత్కంఠం రేపిన మలేషియన్ విమానం అదృశ్యం మిస్టరీ వీడింది. గాల్లో ప్రయాణించిన కొద్ది సేపటికే ఆ విమానం కూలినట్లు తాజాగా మలేషియన్ ప్రధాని నజీబ్ రజాక్ ప్రకటించారు. హిందూ మహా సముద్రానికి నైరుతి దిశగా 2500 కిలోమీటర్లు దూరంలో శకలాలు లభించడంతో విమానం కూలినట్లు నిర్దారించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన నజీబ్.. విమాన ఘటనకు సంబంధించిన వివరాలను రేపు ప్రకటిస్తామన్నారు. అత్యధునిక సాంకేతిక పరిజ్ఞానం కల్గిన బ్రిటన్ ఉపగ్రహం అందజేసిన ఛాయాచిత్రాల ఆధారంగా చర్యలు చేపట్టిన ఆస్ట్రేలియా ఆ విమాన శకలాలను కనుగొంది. దక్షిణ హిందూ మహాసముద్రంలో తాము ఓ చెక్క కార్గో ప్యాలెట్ను గుర్తించిన అనంతరం విమాన ఘటనపై తుది నిర్దారణకు వచ్చారు. ఉపగ్రహం గుర్తించిన శిథిలాల వద్దకు ఆస్ట్రేలియన్ షిప్ వెళ్లడంతో ఈ విషాదాంత ఉదంతానికి తెరపడింది.
ఇప్పటి వరకూ మలేషియా విమానం అదృశ్యంపై రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తూనే ఉన్నాయి. 16 రోజుల క్రితం కౌలాంపూర్ నుంచి బీజింగ్ కు 239 మంది ప్రయాణికులతో బయలుదేరిన మలేషియన్ విమానం దక్షిణ చైనా సముద్రం మీదుగా మలుపు తీసుకుందని సైనిక రాడార్ సిగ్నళ్ల ద్వారా తెలిసింది. అదృశ్యం అయిపోవడానికి ముందు సముద్ర మట్టానికి కేవలం 12వేల అడుగుల ఎత్తున మాత్రమే అది పయనించిందని, విమానం ఆ మలుపు తీసుకోడానికి సుమారు రెండు నిమిషాల సమయం పట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. అప్పుడే ప్రమాదం సంభవించి, పైలట్ లేదా కో పైలట్ ప్రమాద సంకేతాలు పంపి ఉండొచ్చని అంటున్నారు. ఈ క్రమంలోనే విమానం కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు.