హిందూ మహాసముద్రంలో విమాన శకలాలు?
దక్షిణ హిందూ మహాసముద్రంలో మలేషియన్ విమానానికి సంబంధించిన శకలాల్లాంటి వస్తువులను చైనా విమానాలు గుర్తించాయి. దాంతో ఒక్కసారిగా మళ్లీ దాని గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి. తెల్లగా, నలుచదరంగా ఉన్న కొన్ని శకలాలను చైనాకు చెందిన ఇల్యుషిన్-76 గాలింపు విమానం గుర్తించింది. ఇవి బహుశా మలేషియా విమానం ఎంహెచ్ 370కి చెందినవేనని భావిస్తున్నారు. 95.1113 డిగ్రీల తూర్పు, 42.5453 దక్షిణంగా ఈ విమాన శకలాలు ఉన్నట్లు చైనాకు చెందిన ఐస్ బ్రేకర్ జుయెలాంగ్ నుంచి సమాచారం అందినట్లు చైనా అధికారిక వార్తా సంస్థ సిన్హువా తెలిపింది. ఎంహెచ్ 370 విమానం గాలింపు చర్యల్లో పది విమానాలు ఉన్నట్లు ఆస్ట్రేలియన్ మారిటైం సేఫ్టీ అథారిటీ తెలిపింది. (విమానం ఆచూకీపై మరిన్ని ఆధారాలు)
ఉదయం 8.45, 9.20 గంటల సమయంలో రెండు చైనా సైనిక విమానాలు బయల్దేరాయి. విమాన శకలాలు ఇవేనంటూ ఫ్రాన్సు కొత్తగా ఉపగ్రహ ఛాయాచిత్రాలు అందించడంతో ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేశారు. దక్షిణ హిందూ మహాసముద్రంలో తాము ఓ చెక్క కార్గో ప్యాలెట్ను గుర్తించినట్లు ఆస్ట్రేలియా చెప్పింది. (మలుపు తర్వాతే పడిపోయిన మలేషియా విమానం)
దీంతో ఫ్రెంచి ఉపగ్రహం ఇచ్చినది ఈ విమానానికి సంబంధించిన సమాచారం కాదని స్పష్టమైంది. ప్రస్తుతం విమానం కోసం గాలిస్తున్న ప్రదేశానికి అది 850 కిలోమీటర్ల దూరంలో ఉందని ఆస్ట్రేలియా ఉప ప్రధాని వారెన్ ట్రస్ చెప్పారు. ఏ చిన్న సమాచారం దొరికినా వెంటనే అందులో నిజానిజాలను పూర్తిగా నిర్ధారించుకుంటున్నామని, దానివల్ల తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తామని ఆయన అన్నారు.