బ్రిటన్లో అల్లకల్లోలం ఖాయం! | Brexit affect: Britain will take long time to survive as an independent economy | Sakshi
Sakshi News home page

బ్రిటన్లో అల్లకల్లోలం ఖాయం!

Published Fri, Jun 24 2016 3:37 PM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM

బ్రిగ్జిట్ పై సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న ఫొటో ఇది.

బ్రిగ్జిట్ పై సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న ఫొటో ఇది.

ఆగస్ట్ 15.. భారత స్వాతంత్ర్య దినోత్సవం. ఆగస్ట్ 14 పాకిస్థాన్ కు. జులై 4 యూఎస్ఏ ఇండిపెండెన్స్ డే. ఈ మూడు దేశాలనేకాక ఒకప్పుడు దాదాపు భూగోళాన్ని ఏలిన బ్రిటన్ కు అసలు స్వాతంత్ర్యదినోత్సవం అనేదే లేదు. కానీ ఇవ్వాళ జరిగిన బ్రెగ్జిట్ (బ్రిటన్+ఎగ్జిట్) రెఫరెండాన్ని ఆ దేశ ముఖ్య నాయకులు 'ఇండిపెండెన్స్ డే'గా అభివర్ణిస్తున్నారు. 52 శాతం బ్రిటిషర్లు తమ దేశం యురోపియన్ యూనియన్(ఈయూ) నుంచి వెలుపలికి రావడాన్ని సమర్థించారు. అయితే ఈయూ నుంచి బ్రిటన్ వేర్పాటు.. రెఫరెండం ఫలితాలు వెలువడినంత సులువేమీ కాదు. అనేక ఆర్థిక కష్టాలు, పాత మిత్రుల నుంచి తలపోట్లు ఎదుర్కోవాలి. మరోవైపు స్వదేశంలో తలెతత్తే వేర్పాటువాదాన్ని సమర్థవంతంగా తట్టుకోగలగాలి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యానికి అలవాటుపడిన బ్రిటన్ లో బ్రెగ్జిట్ అల్లకల్లోలం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ(ఈఈసీ) నుంచి విడిపోయిన గ్రీన్ లాండే పైన మనం చెప్పుకున్న సోదాహరణకు ఉదాహరణ. డెన్మార్క్‌లో అంతర్భాగమైన గ్రీన్‌లాండ్‌ 1973లో ఈఈసీలో చేరి తిరిగి 1985లో నిష్ర్కమించింది. కేవలం 50,000 వేల జనాభాతో, పూర్తిగా చేపల వాణిజ్యంపైనే ఆధారపడ్డ గ్రీన్ లాండ్.. ఈఈసీ నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత ఆర్థికంగా(అన్నివిధాలా) కోలుకోవడానికి మూడేళ్ల కాలం పట్టింది. మరి 6.5 కోట్ల జనాభాతో, ఈయూలో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్న బ్రిటన్.. కూటమి నుంచి వేరుపడి కోలుకోవడానికి ఎటులేదన్నా ఆరేళ్లకాలం పడుతుంది. ఈలోగా వేల్స్, స్కాట్ లాండ్, ఐర్లాండ్ లలో వేర్పాటువాదం విజృంభిస్తే.. రవి అస్తమించని సామ్రాజ్యపు పునాదులు కూకటివేళ్లతోసహా కదలడం ఖాయం.

బ్రిగ్జిట్ నిర్ణయంతో బ్రిటన్ వ్యాపార, వాణిజ్యానికి సంబంధించి వచ్చే నాలుగైదు నెలల కాలంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. వీటిలో ప్రధానమైనవి ఈయూతో ఆ దేశం కుదుర్చుకున్న 53 ఒప్పందాల రద్దు నిర్ణయం. ఈయూ సభ్యురాలిగా మిగిలిన 27 దేశాలతో ఇన్నాళ్లూ స్వేచ్ఛా వాణిజ్యం చేసిన బ్రిటన్‌ ఇక ముందు ఏదేశానికి ఆ దేశంతో విడివిడిగా ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అంత సులువుగా అయ్యేపనేమీకాదు. ఒప్పందాల పేరుతో జరిగే కాలయాపన బ్రిటన్ ఆర్థిక వెన్ను విరిచినా ఆశ్చర్యంలేదు.

 

జోరుమీదున్న సేవల రంగం ఒక్కసారిగా కుదేలు కానుంది. ఈయూ ఆర్థిక వ్యవస్థలో 80శాతం వాటా సేవల రంగానిదే. అందులోనూ 40 శాతం వాటా బ్రిటన్ దే. ఒక్క లండన్ నగరం కేంద్రంగా లక్షకు పైగా సంస్థలు ఈయూ వ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయి. బ్రిగ్జిట్ నిర్ణయంతో ఈ కంపెనీలన్నీ ఉన్నపళంగా కుప్పకూలే ప్రమాదం ఉంది. తద్వారా బ్రిటన్‌కు లభిస్తోన్న ఆదాయానికి భారీగా గండిపడటమేకాక లక్షల మంది ఉద్యోగులు వీధినపడతారు. ఈ ప్రమాదాన్ని ముందే ఊహిచాయి కాబట్టే ఇంగ్లాండ్ సెంట్రల్ బ్యాంక్ సహా బ్రిటన్ లోని ఇతర బ్యాంకులన్నీ బ్రగ్జిట్ ను తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ ప్రజల నిర్ణయం అందుకు వ్యతిరేకంగా వెల్లడైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement