పేద దేశాల వలసలే కొంప ముంచాయి | How will Brexit affect your finances? | Sakshi
Sakshi News home page

పేద దేశాల వలసలే కొంప ముంచాయి

Published Fri, Jun 24 2016 3:48 PM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM

పేద దేశాల వలసలే కొంప ముంచాయి

పేద దేశాల వలసలే కొంప ముంచాయి

లండన్: ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ యూరప్ కూటమి నుంచి బ్రిటన్ తప్పుకోవడమే ఉత్తమమని బ్రిటన్ వాసులు తీర్పు ఇవ్వడం స్థానికత వాదానికి బలం చేకూర్చింది. యూరప్ కూటమికి చెందిన పేద దేశాల నుంచి పెరిగిన ప్రజల వలసల కారణంగా తమ ఉపాధి అవకాశాలు మృగ్యమవుతున్నాయని భావించిన శ్వేత జాతీయులు విడిపోవడానికే ఓటు వేశారు. ‘మా ఉద్యోగాలు, మా స్థలం, మా ఆర్థిక వ్యవస్థ మాకే కావాలి’ అన్న డిమాండ్‌కే స్థానికులు, ముఖ్యంగా శ్వేతజాతి కార్మికులు పట్టం గట్టారు.

‘ఇది మాకు స్వాతంత్య్రం వచ్చిన రోజు, ప్రజలకు నిజమైన విముక్తి రోజు’ అంటూ అటు బ్రిటన్ ప్రతిపక్ష పార్టీలు, శ్వేతజాతీయులు అభివర్ణించారంటే వలసల పట్ల వారికున్న  వ్యతరేకత ఎంతో స్పష్టమవుతోంది. ఓటింగ్ సరళిని పరిశీలించినట్లయితే ఒకటి, రెండు మినహాయింపులు మినహా వలసప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ‘బ్రెక్జిట్’కు వ్యతిరేకంగా ఓటు వేశారు. స్థానికులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అనుకూలంగా ఓటు వేశారు. యూరప్ యూనియన్ నుంచి విడిపోవాల్సిందేనంటూ ఇంగ్లండ్‌లో 73శాతం, వేల్స్‌లో 72 శాతం మంది తీర్పు చెప్పారు. కలిసే ఉండాలంటూ స్కాట్‌లాండ్ లాంటి దేశాలు 67 శాతం మంది ఓట్లు వేసినా ఆశించిన ఫలితాలు రాలేదు. 1975లోనూ, ఇప్పుడు కూడా ‘బ్రెక్జిట్’కు వ్యతిరేకంగానే అక్కడి మెజారిటీ ప్రజలు ఓటు వేశారు.

బ్రిటన్‌లో విద్యతోపాటు, నేషనల్ హెల్త్ స్కీమ్ కింద వైద్య సేవలు ఉచితం అవడం వల్ల యూరప్‌కు చెందిన పేద దేశాల నుంచి గత రెండు,మూడు ఏళ్లుగా భారీగా పెరిగాయి. దీనికి తోడి ఆర్థిక సంస్కరణల పేరిట ప్రధాన మంత్రి కేమరాన్ నిరుద్యోగ భృతిని, పిల్లల పెంపక భృతిని బాగా తగ్గించడంతో స్థానికుల్లో ఆగ్రహం పెరిగింది. దానికి తోడు సిరియా నుంచి వలసలు భారీగా పెరగడం కూడా వారి ఆగ్రహాన్ని రెట్టింపు చేసింది.

ఇక టర్కీలాంటి దేశాలను యూరోపియన్ కూటమిలో చేర్చుకోవాలనే ప్రతిపాదన ముందుకు రావడం కూడా వారి ఆగ్రహానికి ఆజ్యం పోసింది. బ్రిటన్‌లో నిరుద్యోగికి భృతి కల్పించడంతోపాటు అనువైన నివాసం, పిల్లలుంటే వారి పోషణ భారాన్ని కూడా భరించడం బ్రిటన్ ప్రభుత్వం బాధ్యత. ఇప్పటికీ ఈ దేశంలో ఉద్యోగం, సద్యోగం లేకుండా ప్రభుత్వ భృతి కోసం పిల్లలను కనడమే పనిగా పెట్టుకున్న వాళ్లు కూడా లేకపోలేదు.

ఇలాంటి భృతులను వ్యతిరేకిస్తున్న పన్ను చెల్లింపుదారులు వలసలను మరింత పెద్ద సమస్యగా భావించారు. యూరోపియన్ కూటిమిలో ఉంటే వ్యాపారవేత్తలకు లాభంగానీ, పన్ను చెల్లించే తమలాంటి వారికి కాదని శ్వేతజాతి కార్మికులు భావిస్తూ వచ్చారు. అలా ప్రజల నుంచి, ప్రతిపక్ష పార్టీల నుంచి ప్రధాన మంత్రి కేమరాన్‌పై ఒత్తిడి పెరిగింది. యూరోపియన్ కూటమి నుంచి విడిపోవాలంటూ  2014 సంవత్సరంలో ఈ ఒత్తిడి మరింత తీవ్రమైంది.

2015లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తమ కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధించినట్లయితే తప్పకుండా రిఫరెండమ్ పెట్టి నిర్ణయం తీసుకుంటానని అప్పుడు కేమరాన్ హామీ ఇచ్చారు. ఎవరూ ఉహించని విధంగా పార్లమెంట్‌లో కన్జర్వేటివ్ పార్టీకి భారీ విజయం దక్కడంతో ఆయన ఇప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అయితే వ్యక్తిగతంగా ఆయనకు కూటమి నుంచి విడిపోవడం ఇష్టం లేదు. అందుకని కలిసి  ఉండేందుకే ప్రచారం చేసి ఇప్పుడు పదవీ త్యాగానికి సిద్దపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement