న్యూఢిల్లీ: కేంద్రమంత్రిమండలి పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త మంత్రుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవం రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న నలుగురికి కేబినెట్ హోదా ప్రమోషన్ లభించగా.. తొమ్మిది మంది కొత్త వారు సహాయమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీరితో ప్రమాణస్వీకారం చేయించారు.
ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కేబినెట్ మంత్రులుగా ప్రమోషన్ పొందారు. అనంతరం శివ ప్రతాప్ శుక్లా, అశ్వినీ కుమార్ చౌబే, వీరేంద్ర కుమార్, అనంత్‌కుమార్ హెగ్డే, రాజ్‌కుమార్ సింగ్, హర్‌దీప్ సింగ్ పూరి, గజేంద్ర సింగ్ షెకావత్, సత్యపాల్ సింగ్, ఆల్ఫోన్స్ కణ్ణాంథనంలు సహాయమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు, పలువురు ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. కాగా, బీజేపీ మిత్రపక్షాలైన జేడీయూ, అన్నాడీఎంకేకు కేంద్ర కేబినెట్‌లో చోటు లభిస్తుందని భావించినా వాటికి నిరాశ ఎదురైంది. కేంద్రమంత్రుల ప్రమాణ స్వీకారోత్సానికి బీజేపీ మిత్రపక్షాలు జేడీయూ, శివసేన దూరంగా ఉన్నాయి. కేబినెట్ విస్తరణలో తమకు అవకాశం కల్పించకపోవడంపై శివసేన, జేడీయూ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.
కొత్తగా ప్రమోషన్ పొందిన మంత్రుల్లో పీయూష్ గోయల్‌కు రైల్వేశాఖ లభించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు రైల్వేశాఖ మంత్రిగా ఉన్న సురేశ్ ప్రభుకు కీలకమైన విద్యుత్ లేదా పర్యావరణ శాఖ ఇవ్వవచ్చునని అంటున్నారు. మరికాసేపట్లో మంత్రుల పోర్టుఫోలియో వివరాలు తెలిసే అవకాశముంది.
చదవండి: ప్చ్: తెలుగు రాష్ట్రాలకు నిరాశే!