చైనాలో వ్యాపార వికృతం
కమ్యూనిస్టుల పాలనలోని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో వ్యాపారం వికృతపోకడలు పోతోంది. బహుశా పక్కా క్యాపిటలిస్టులమని చెప్పుకునే దేశాలు సైతం వెనుకడుగు వేసే జుగుప్సాకరమైన ధోరణిని అనుసరిస్తున్న చైనీస్ కంపెనీలపై ఆ దేశ పౌరులేకాక యావత్ ప్రపంచం భగ్గుమంటున్నది. చైనాలో అతిపెద్ద ఆభరణాల కంపెనీ ఏం చేసిందో చదివితే సదరు చర్యను మీరూ అసహ్యించుకుంటారు..
చైనా, హాంకాంగ్ లలో ప్రతి రోజూ కోట్లాది రూపాయల(యాన్ల) విలువైన ఆభరణాలను విక్రయించే 'చావ్ లుక్ ఫొక్' అక్కడ అతిపెద్ద జువెలరీ కంపెనీ. ఇటీవలే కొత్త మోడల్ వజ్రాలను మార్కెట్ లోకి విడుదల చేసిన కంపెనీ.. వాటికి ప్రచారం కల్పించడంలో భాగంగా స్టోర్లలో పనిచేసే అమ్మాయిల చేత చేయించకూడని పనులు చేయించింది. కొత్త డైమండ్లను సూచిస్తూ వాటి ఆకారంలోని రెండు పీలికలు తప్ప ఒంటిపైభాగంలో అచ్ఛాదనలేని అమ్మాయిలను జ్యువెలరీ స్టోర్లలో నిలబెట్టి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
స్టోర్ లోకి ప్రవేశించగానే.. ఇబ్బందికంగా నిల్చున్న అమ్మాయిలను చూసి కొనుగోలుదారులంతా అవాక్కయ్యారు. కొందరైతే కంపెనీ తీరును బాహాటంగానే తప్పుపట్టారు. ఇక ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు సైతం చైనా కంపెనీ తీరును గర్హిస్తున్నారు. ఏ రకంగా చూసినా జువెలరీ కంపెనీ చర్య సమర్థనీయం కాదని, వికృతానికి పాల్పడిన కంపెనీ లైసెస్సులను రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ది గ్రేట్ చైనా ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు.