లండన్ లో దాడి బాధాకరం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: బ్రిటన్ పార్లమెంట్ పై తీవ్రవాద దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖండించారు. లండన్ లో దాడి గురించి తెలియగానే చాలా బాధ పడ్డానని తెలిపారు. బాధితులు, వారి కుటుంబాల తరపున దేవుడి ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో బ్రిటన్ కు భారత్ బాసటగా నిలుస్తుందని హామీయిచ్చారు. తీవ్రవాదంపై పోరుకు కలిసివస్తామని ట్విటర్ లో ప్రధాని మోదీ పేర్కొన్నారు.
లండన్ లో ఉగ్రదాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా అంతా ఏకంగా కావాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు. ఉగ్రదాడి బాధితులకు ఆయన నివాళి అర్పించారు.
ప్రజాస్వామ్యాల్లో, నాగరిక సమాజాల్లో ఉగ్రవాదానికి తావు లేదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే ట్వీట్ చేశారు. బ్రిడ్జిపై దాడిలో భారతీయులెవరైనా గాయపడి ఉంటే తమ సహాయక బృందాన్ని info.london@hcilondon.in; 020 8629 5950, 020 7632 3035 లను సంప్రదించాలని భారత హైకమిషన్ సూచించింది.