నోట్ల రద్దు ఎఫెక్ట్‌: ఉర్జిత్‌పై మోదీ అసహనం? | Demonetisation effect : PM upset with RBI Governor | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దు ఎఫెక్ట్‌: ఉర్జిత్‌పై మోదీ అసహనం?

Published Sun, Nov 20 2016 11:19 AM | Last Updated on Thu, Sep 27 2018 9:07 PM

నోట్ల రద్దు ఎఫెక్ట్‌: ఉర్జిత్‌పై మోదీ అసహనం? - Sakshi

నోట్ల రద్దు ఎఫెక్ట్‌: ఉర్జిత్‌పై మోదీ అసహనం?

న్యూఢిల్లీ: నోట్ల రద్దు పాపాన్ని తుడుచుకునేందుకు మోదీ సర్కార్‌ కొత్త ఎత్తుగడలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ముందు జాగ్రత్తలు తీసుకోకుండా చెలామణిలో ఉన్న 80 శాతం కరెన్సీని ఒక్కసారిగా రద్దుచేయడంతో దేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు తలెత్తడం, దాదాపు అన్ని రంగాలు కుదేలైపోవడం, 12 రోజులు గడుస్తున్నా కొత్త నోట్లు బ్యాంకులకు చేరకపోవడం, నోటు మరణాలు నానాటికీ పెరుడుతుండటం తదితర పరిణాల నేపథ్యంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తద్వారా ప్రజల్లో నెలకొన్న ఆగ్రహావేశాలను కొద్దిగానైనా చల్లార్చవచ్చని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.
 
ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్ పటేల్‌ పై ప్రధాని మోదీ ఆగ్రహంగా ఉన్నారని అందుకు కారణం నోట్ల రద్దు అనంతరం తలెత్తే పరిస్థితులను సులువుగా నివారించవచ్చని ఉర్జిత్‌ సలహా ఇవ్వడమేనని, రెండు రోజుల వ్యవధిలో దేశంలోని 3 లక్షల ఏటీఎంలను రీక్యాలిబరేట్‌ చేయగలమని ఆర్బీఐ గవర్నర్‌ హామీ ఇచ్చిన తర్వాతే మోదీ నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారని.. శని, ఆదివరాల్లో కొన్ని జాతీయ వార్తా సంస్థలు కథనాలు రాశాయి. ఇటు ఢిల్లీ వేదికగా శనివారం జరిగిన బ్యాంక్‌ ఆఫీసర్ల సదస్సులోనూ ఉర్జిత్‌ రాజీనామాపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
 
అలా చెబితే నమ్మేస్తారా?
ఒక్క ఏటీఎంలో నగదు నింపడానికే అరగంట నుంచి ముప్పావు గంట సమయం పడుతుందని మనందరికీ తెలుసు. అలాంటిది కొత్త నోట్లు వచ్చేలా ఏటీఎంలను పునరుద్ధరించడం, అదికూడా 3లక్షల ఏటీఎంలను రెండు రోజుల్లో సిద్ధం చేయడం అసంభవం. మరి దేశీయ బ్యాంకింగ్‌ రంగానికి బాస్‌ అయిన ఆర్బీఐ గవర్నర్‌ ఇంత దారుణమైన సలహాను ప్రభుత్వానికి ఎలా ఇస్తారు? ఒకవేళ ఇచ్చినా అందుకు ప్రధాని ఎలా అంగీకరిస్తారు? అనే ప్రశ్నలు ఉత్పన్నం కావడం సహజం. సోషల్ మీడియాలో చెలరేగుతోన్న పుకార్లకు కూడా సమాధానం ఇస్తోన్న కేంద్ర ఆర్థిక శాఖ ఈ విషయంలో మాత్రం పెదవివిప్పడంలేదు. 
 
’ఆర్బీఐ గవర్నర్‌ పై వేటు’ అంశంపై స్పందిస్తూ కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌ ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గతంలో ప్రధాని మొరార్జీ దేశాయ్‌ నోట్లు రద్దు చేయాలనుకున్నప్పుడు నాటి ఆర్బీఐ గవర్నర్‌ ఐజీ పటేల్‌ తీవ్రంగా వ్యతిరేకించారని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా నోట్లు రద్దుచేయడాన్ని గవర్నర్‌ నిర్ద్వంద్వంగా తిరస్కరించారని అయ్యర్‌ గుర్తుచేశారు. ‘నాకు తెలిసి ఏ ఆర్బీఐ గవర్నర్‌ కూడా తక్షణం నోట్ల రద్దుకు అంగీకరించరు. బహుశా ఉర్జిత్ పటేల్‌ కూడా మోదీ నిర్ణయాన్ని సమర్థించి ఉండరు’అని అయ్యర్‌ అన్నారు.
 
బ్యాంక్‌ ఆఫీసర్ల సదస్సు
సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్ అకౌంటబులిటీ(సీఎఫ్ఏ), పబ్లిక్‌ ఫైనాన్స్‌ అకౌంటబులిటీ(పీఎఫ్‌ఏ) శనివారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన ప్రత్యేక సదస్సు లోనూ వక్తలు ఆర్బీఐ గవర్నర్‌ పై మండిపడ్డారు. ఆలిండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు థామస్‌ ఫ్రాంకో మాట్లాడుతూ.. ‘పాత నోట్లు రద్దై 12 రోజులు గడుస్తున్నా దక్షిణ భారతదేశం ఇంకా కొత్త రూ.500 నోటును చూడలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించండి’అని అన్నారు.

మొత్తం కరెన్సీలో నగదు రూపంలో ఉండే బ్లాక్‌ మనీ 6 శాతానికి మించి ఉండదని, దానిని నిర్మూలించడానికి ఏకంగా 14 లక్షల కోట్ల విలువైన కరెన్సీని రద్దుచేయడం తెలివైనపని కాదని, నోట్ల రద్దు అనంతరం తలెత్తిన పరిస్థితికి బాధ్యుడిగా ఆర్బీఐ గవర్నర్‌ రాజీనామాను కోరడంలో తప్పులేదని  సదస్సులో మాట్లాడిన ఇతర వక్తలు అభిప్రాయపడ్డారు. ’విదేశాల్లోని నల్లధనం తీసుకొస్తానన్న మోదీ.. ఆ పని చేతకాకే స్వదేశీ నల్లధనం పల్లవి ఎత్తుకున్నారని సీపీఎం ఎంపీ డి.రాజా అన్నారు.
 
ఉర్జిత్ ఎక్కడ?
నవంబర్‌ 8 పెద్దనోట్లు రద్దు నిర్ణయం తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్‌ తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ మళ్లీ ఎక్కడా కనిపించలేదు. మోదీ ఆగ్రహించినందుకు అలిగారో లేక తప్పుచేశాననే పశ్చాత్తాపంలో ఉన్నారో తెలియదుకానీ నోటు కష్టాలపై కనీసం మాటమాత్రమైన స్పందిచడానికి ఉర్జిత్‌ పటేట్ ముందుకు రావడంలేదు. వారం రోజుల్లో పరిష్కారం అవుతాయనుకున్న సమస్యలు కాస్తా 12 రోజులు దాటుతున్నా పెరుగుతున్నాయే తప్ప తగ్గడంలేదు. అటు ఆర్థిక శాఖ అధికారులు కూడా ఆర్బీఐ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 
 
ఏటీఎంల రీక్యాలిబరేషన్‌ కోసం ఏర్పాటైన టాస్క్‌ ఫోర్స్‌ కు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎస్‌ఎస్‌ ముద్రాను నియమించడం, పటేల్‌ ప్రభుత్వానికి సరైన సూచనలు చేయలేదని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ తుషార్‌ధారా చక్రవర్తి వ్యాఖ్యనించడాన్ని చూస్తే తప్పు జరిగిందనే సంగతి అర్థం అవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగరియా ఒక అడుగు ముందుకువేసి.. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం పూర్తిగా రాజకీయ నిర్ణయమని, ఇందులో అధికారుల పాత్ర ఏమీ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement