నన్ను చూసి నవ్వొద్దు
సీఎం పళనికి ప్రతిపక్షనేత స్టాలిన్ హితవు
సాక్షి, చెన్నై: అసెంబ్లీలో అడుగు పెట్టే సమయంలో తనను చూసి నవ్వొద్దని సీఎం పళనిస్వామికి డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ హితవు పలికారు. శుక్రవారం మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ... గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించిన దృష్ట్యా సీఎంకు తన శుభాకాంక్షలు అని వ్యాఖ్యానించారు.
సభకు వచ్చే సమయంలో ఆయన తనను చూసి నవ్వకుండా, చిరునవ్వులు చిందించ కుండా ఉంటే మంచిదన్నారు. స్టాలిన్‌ను చూసి పన్నీరు సెల్వం చిరునవ్వుతో పలకరిస్తున్నారన్న ఆగ్రహంతోనే ఆయన్ను పదవి నుంచి చిన్నమ్మ శశికళ తప్పించిన విషయం తెలిసిందే.
ప్రధాని మోదీకి పళనిస్వామి కృతజ్ఞతలు: తనకు శుభాకాంక్షలు అందించిన ప్రధాని మోదీకి సీఎం పళనిస్వామి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం పదవి చేపట్టిన పళనిస్వామికి ప్రధాని మోదీ ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం లేఖ రాశారు. రాష్ట్రాభివృద్ధి కోసం పురట్చితలైవి అమ్మ దూరదృష్టితో ఏర్పాటు చేసిన పథకాలకు సహకారం అందించాలని కోరారు.
ఉత్సాహంగా కనిపించిన శశికళ
బొమ్మనహళ్లి (కర్ణాటక): అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ శుక్రవారం కాస్త ఉత్సాహంగా కనిపించారు. ఇళవరసి, సుధాకరన్‌లతో మాట్లాడటమే కాకుండా తోటి ఖైదీల క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మొదటి రెండు రోజులు కాస్త ముభావంగా కనిపించిన ఆమె శుక్రవారం జైలు నిబంధనలను అనుసరించి ఆహారం తీసుకున్నారు. పత్రికలు చదివారు. టీవీ చూశారు.
ఫ్లోర్ లీడర్‌గా సెంగోట్టయన్: తమిళనాడు శాసనసభ ఫ్లోర్ లీడర్‌గా కేఏ సెంగోట్టయన్ నియమితులయ్యారు. తమిళనాడు అసెంబ్లీలో శనివారం సీఎం పళనిస్వామి బలపరీక్ష జరగనుంది. ఈ వ్యవహారాల పర్యవేక్షణకు అసెంబ్లీ ఫ్లోర్ లీడర్‌గా కేఏ సెంగోట్టయన్‌ను నియమించారు.