ఇక తప్పుకుంటా: ముకుల్ రోహత్గీ
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయాధికారి ముకుల్ రోహత్గీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక అటార్నీ జనరల్‌గా కొనసాగే ఉద్దేశంకానీ, ఆసక్తిగానీ తనకు లేవని స్పష్టం చేశారు. పదవీకాలాన్ని పొగడించాల్సిందిగా ప్రభుత్వాన్ని తాను కోరలేదని వివరించారు.
ఏజీ ముకుల్ రోహత్గీ, అడిషనల్ సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ సహా ఐదుగురు న్యాయాధికారుల పదవీకాలాన్ని పొగిడిస్తూ జూన్ 3న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహత్గీ ఆదివారం మీడియాతో మాట్లాడారు.
‘వాజపేయి హయాంలో ముఖ్యబాధ్యతలు నిర్వర్తించా. నరేంద్ర మోదీ హయాంలో మూడేళ్లపాటు ఏజీగా కొనసాగా. ఇకపై ఆ పదవిలో కొనసాగాలని లేదు. ప్రైవేటుగా ప్రాక్టీస్ చేసుకోవాలన్నది నా అభిమతం. అందుకే సర్వీస్ ఎక్స్‌టెన్షన్ కోరలేదు. ఇప్పటి ప్రభుత్వంతో నాకు సత్సంబంధాలున్నాయి. అందుకే ఇక తప్పుకుంటానని లేఖరాశా’ అని రోహత్గీ వివరించారు.
2014 జూన్ 19న భారత ప్రధాన న్యాయాధికారి(అడ్వకేట్ జనరల్)గా ముకుల్ రోహత్గీ బాధ్యతలు చేపట్టారు. ఆయన సర్వీసును పొగడిస్తూ గత వారం ఉత్తర్వులు జారీచేసిన కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ.. ఎంత కాలం వరకు రోహత్గీ ఏజీ పదవిలో కొనసాగుతారో మాత్రం పేర్కొనకపోవడం గమనార్హం. రోహత్గీ తాజా లేఖపై కేంద్రం స్పందించాల్సిఉంది.