నా భర్త మరణానికి సమాధానం చెప్పాలి
► ట్రంప్ సర్కారును ప్రశ్నించిన మృతుడు శ్రీనివాస్ భార్య
► మైనారిటీల భద్రతకు ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్
► విచారణ వేగవంతానికి భారత దౌత్య కార్యాలయం డిమాండ్
► ఆసుపత్రినుంచి అలోక్ రెడ్డి డిశ్చార్జ్
► కోలుకుంటున్న మరో బాధితుడు
హూస్టన్ : అమెరికాలోని కాన్సస్‌లో బుధవారం రాత్రి జరిగిన కాల్పుల ఘటనకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలని ఈ ఘటనలో మృతిచెందిన కూచిభొట్ల శ్రీనివాస్ భార్య సునయన డిమాండ్ చేశారు. అమెరికాలో మైనారిటీలపై వివక్షాపూరితమైన దాడులు ఆపేందుకు సర్కార్ ఏం చేస్తుందో చెప్పాలన్నారు. ‘కొంతకాలంగా అమెరికాలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే మేం ఇక్కడి వారమా? కాదా? అని ఆశ్చర్యం కలుగుతోంది’ అని సునయన తెలిపారు.
శ్రీనివాస్ ఉద్యోగం చేస్తున్న గార్మిన్ కంపెనీ శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సునయన మాట్లాడుతూ.. ‘ఇక్కడుండే ప్రతి ఒక్కరూ దేశానికి చెడు తలపెట్టరు. ఇక్కడ మా కుటుంబం బతకాలా? వద్దా? అనే అనుమానం వస్తోంది. విదేశీయులపై అమెరికాలో దాడుల వార్తలను చూసి బాధకలిగేది. మనం అమెరికాలో భద్రంగానే ఉంటామా? అనే అనుమానం వచ్చేది. కానీ మంచోళ్లకు మంచే జరుగుతుందని నా భర్త చెప్పేవారు. మంచిగా ఆలోచించాలి. మంచి పనులే చేయాలి. అప్పుడు మంచే జరుగుతుందని చెప్పేవారు. పని ఒత్తిడి నుంచి కాస్త రిలాక్స్ అవుదామని ఆయన బార్‌కు వెళ్లారు. అక్కడికొచ్చిన వ్యక్తి జాత్యహంకారంగా మాట్లాడుతున్నా.. శ్రీనివాస్ పట్టించుకోలేదు. బయటకు వెళ్లొచ్చిన ఆ వ్యక్తి ఓ మంచి మనిషిని, అందరినీ ప్రేమించే వ్యక్తిని పొట్టన పెట్టుకున్నాడు. మా ఇద్దరి కుటుంబాల్లో విషాదం నింపాడు. శ్రీనివాస్ వాళ్ల అమ్మకు ఇప్పుడేమని సమాధానం చెప్పాలి’ అని సునయన ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఆయనకు ఇలాంటి చావొస్తుందనుకోలేదు. మరో రెండు వారాల్లో ఆయన 33వ పుట్టినరోజు జరుపుకోవాలి. ఆయన అమెరికాను బాగా ప్రేమించారు. చాలా సార్లు వేరే దేశానికి వెళ్లిపోదామా అని అడిగాను. కానీ వేచి చూద్దామనే ఆయన సమాధానమిచ్చారు. ఇప్పుడాయన మృతికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలని’ అని సునయన డిమాండ్ చేశారు. ‘మా ఆయన్ను పొట్టన పెట్టుకున్న వ్యక్తి వేరే బార్‌కు వెళ్లి ఇద్దరు ముస్లిం యువకులను చంపానని గర్వంగా చెప్పుకున్నాడని తెలిసింది. శరీరం రంగు చూసి ఓ వ్యక్తి ముస్లిమా? హిందువా? క్రిస్టియనా అని ఎలా గుర్తిస్తారు?’ అని ఆమె ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో అంత్యక్రియల కోసం భారత్‌కు బయలుదేరనున్న సునయన.. తన భర్త కలలను సాకారం చేసేందుకు కన్సాస్‌కు తిరిగి వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. ‘ఏ రంగంలోనైనా విజయం సాధించగలననే నమ్మకం నాకుంది. అయితే నా నిర్ణయాన్ని చెప్పేముందు అమెరికా ప్రభుత్వాన్ని అడుగుతున్నా.. ఇలాంటి విద్వేషపూరిత ఘటనలను ఆపేందుకు మీరేం చేస్తారో చెప్పండి’ అని ఆమె డిమాండ్ చేశారు.
2005లో కూచిభొట్ల అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్–ఎల్ పాసో (యూటీఈపీ)లో పీజీలో చేరేందుకు వచ్చారు. ఇదే యూనివర్సిటీలో చేరేందుకు ప్రయత్నించిన సునయనకు శ్రీనివాస్‌తో ఆన్ లైన్ లో స్నేహం కుదిరింది. 2007లో అమెరికా వచ్చిన సునయన మినసోటాలోని సెయింట్ క్లౌడ్ స్టేట్ యునివర్సిటీలో చేరారు. ఐదేళ్ల తర్వాత 2012లో వీరిద్దరూ వివాహం చేసుకుని న్యూ ఒలేత్‌లో ఇంటిని కొనుక్కున్నారు. కాగా, గార్మిన్ కంపెనీ ఆవరణలో శ్రీనివాస్‌కు ఉద్యోగులు ఉద్వేగపూరిత వాతావరణంలో ఘనంగా నివాళులర్పించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అలోక్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
రంగంలోకి భారత కాన్సులేట్
కాన్సస్ ఘటనను భారత దౌత్యకార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఈ కేసు విచారణ వేగంగా జరపాలంటూ అమెరికా సర్కారుకు లేఖ రాసింది. హూస్టన్ భారత కాన్సులేట్ జనరల్ అనుపమ్ రాయ్ పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కుటుంబానికి అవసరమైన సాయాన్ని ఆయన అందిస్తున్నారు. డిప్యూటీ కాన్సుల్ ఆర్డీ జోషి, వైస్ కాన్సుల్ హర్పాల్ సింగ్‌లు ఈ ఘటనలో గాయపడ్డ అలోక్ రెడ్డి కుటుంబాన్ని, భయంతో ఉన్న స్థానిక భారత సంతతి ప్రజలను కలిసి ధైర్యాన్నిచ్చారు.
కాగా, శనివారం అలోక్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అమెరికన్ ఇయాన్ గ్రిలాట్ (24) ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని కాన్సస్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్ల కన్సాస్‌లో భారతీయులపై దాడిని ఖండించారు. మతపరమైన దాడులు, హింస సరికాదని బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ట్వీటర్లో పేర్కొన్నారు. విద్వేష రాజకీయాలకు తమ మద్దతుండదని పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ తెలిపారు.
ఖండించిన అమెరికన్ చట్టసభ్యులు
కాన్సస్ కాల్పుల ఘటనను అమెరికన్ చట్టసభ్యులు బహిరంగంగా ఖండించారు. దేశంలో ఇలాంటి హింసకు తావులేదని ముక్తకంఠంతో వెల్లడించారు. ‘విద్వేషాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించం. ఈ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది’ అని కాలిఫోర్నియా సెనేటర్ కమలా హ్యారీస్ తెలిపారు. ‘అమెరికాలో ఇలాంటి హింసను ఒప్పుకోం’ అని కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ అన్నారు. ‘ఇది ఇద్దరు వ్యక్తులపై జరిగిన దాడి మాత్రమే కాదు. భారతీయులు, భారత్–అమెరికన్ల భద్రతను కట్టుదిట్టం చేయాలి’ అని డెమొక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తెలిపారు. పలువురు అమెరికన్ చట్టసభ్యులు దాడులపై నిరసన తెలిపారు.
బార్‌లో ఏం జరిగింది?
అమెరికాలోని కాన్సస్‌లోని ఆస్టిన్ బార్‌లో ఇద్దరు భారతీయులపై కాల్పుల ఘటనను.. బాధితుడు అలోక్ రెడ్డి న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్యూలో వెల్లడించారు. ‘బార్‌లో నేను (అలోక్) కూచిభొట్ల శ్రీనివాస్ కూర్చున్నాం. మాకు సమీపంలోనే పురింటన్ (కాల్పులకు పాల్పడిన వ్యక్తి) కూర్చున్నాడు. ఏ వీసాలపై వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు? అక్రమంగా ఇక్కడ ఉంటున్నారా? అని పురింటన్ అడిగాడు. దీనికి మేం స్పందించలేదు. చాలా మంది ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తుంటారు అని లైట్ తీసుకున్నాం.
కానీ మమ్మల్ని దూషిస్తూ.. వీరు అమెరికన్లు కారు అని గట్టి గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. అంతటితో ఆగకుండా బార్ మేనేజర్‌ను తీసుకొచ్చేందుకు లోపలకు వెళ్లాడు. ఆ తర్వాత ఏమైందేమో బయటకు వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత గన్ పట్టుకుని కోపంగా వచ్చిన పురింటన్ మాపై కాల్పులు జరిపాడు. కూచిభోట్ల అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. నాకు గాయాలయ్యాయి. అక్కడే ఉన్న ఓ 24 ఏళ్ల అమెరికన్ యువకుడు పురింటన్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు.అతన్నీ పురింటన్ కాల్చాడు’ అని అలోక్ రెడ్డి వెల్లడించారు.
ట్రంప్ వ్యాఖ్యలతో సంబంధం లేదు
అమెరికా అధ్యక్షుడు వలసలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే భారతీయ ఇంజనీర్ హత్యకు కారణమని వస్తున్న వార్తలను వైట్‌హౌస్ ఖండించింది. ‘ఇలాంటి ఘటనలు దురదృష్టకరం. మేం దీన్ని ఖండిస్తున్నాం. ట్రంప్ వ్యాఖ్యలకు ఈ ఘటనకు సంబంధమే లేదు’ అని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ వెల్లడించారు. అధ్యక్షుడి వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా లేవని దీన్ని తప్పుగా చూపిస్తున్నారన్నారు.
కాగా, ఈ ఘట నపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ గ్యుటెరస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, కాన్సస్ కాల్పులకు కారకుడు పురింటోన్ పై ఫస్ట్ డిగ్రీ హత్యకేసు నమోదు చేసినట్లు జాన్సన్ కౌంటీ జిల్లా అటార్నీ స్టీఫెన్ హోవే వెల్లడించారు. ఈ ఘటన విద్వేషపూరిత నేరమా? కాదా? అనే విషయంలో ఎఫ్‌బీఐ విచారణ ప్రారంభమైందన్నారు.
కోల్‌కతాలో శ్రీనివాస్‌కు నివాళులు అర్పిస్తున్న మేయర్ సావర్ ఛటర్జీ