జయలలిత ఉండి ఉంటే...
జయలలిత ఉండి ఉంటే...
Published Tue, Feb 14 2017 11:08 AM | Last Updated on Sun, Sep 2 2018 5:43 PM
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూడా దోషిగానే సుప్రీంకోర్టు తీర్పుతో తేలినట్లయింది. కేసులో ఎ1 జయలలిత, ఎ2 వీకే శశికళ, ఎ3 సుధాకరన్, ఎ4 ఇళవరసి.. ఇలా ఈ నలుగురూ కూడా అక్రమాస్తుల కేసులో దోషులుగానే సుప్రీంకోర్టు తీర్పుతో స్పష్టమైంది. వాస్తవానికి ఆమె ప్రస్తుతం జీవించి ఉండకపోవడంతో ఆమెకు ఎలాంటి శిక్ష, జరిమానా పడే అవకాశం లేదుగానీ, మిగిలిన అందరికీ శిక్ష పడింది. అందులో ప్రధానంగా జయలలితకు ముందు నుంచి వెన్నంటి ఉన్న వీకే శశికళ ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది.
మొత్తం తీర్పు వెల్లడించే ప్రక్రియ కేవలం రెండు మూడు నిమిషాలు మాత్రమే జరిగింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ ముందుగా సీల్డ్ కవర్ తెరిచి, ఇది సంక్లిష్టమైన అంశమే అయినా తీర్పు ఇస్తున్నామని చెప్పారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. శశికళ వెంటనే లొంగిపోవాలని అన్నారు. పది కోట్ల జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత తనతో పాటు ఈ కేసును విచారించిన అమితవ్ రాయ్ కూడా తీర్పు చెబుతారని అన్నారు. అవినీతి విషయంలో కఠినాతి కఠినంగా వ్యవహరించాలని జస్టిస్ అమితవ్ రాయ్ తెలిపారు. సుప్రీంకోర్టులో కూడా తీర్పు వచ్చేయడంతో.. దాన్ని సవాలు చేయాలంటే రివ్యూ పిటిషన్ దాఖలు చేయాల్సిందే తప్ప మరో మార్గం లేదు.
Advertisement