బో‘ధన్’ దొంగలెందరో?
కమర్షియల్ ట్యాక్స్‌లో బయటపడని తిమింగళాలు మరెన్నో..
- వెయ్యి కోట్ల దాకా స్కాం జరిగి ఉండొచ్చని సీఐడీ అనుమానం
- అన్ని సర్కిళ్లలోనూ బోధన్ తరహా వ్యవహారాలే!
- ఒక్క బోధన్‌లోనే రూ. 200 కోట్లు నొక్కేసిన శివరాజ్ గ్యాంగ్
- ఐదేళ్లుగా అన్నీ దొంగ లెక్కలు.. నకిలీ ఆడిటింగ్‌లు
- బ్యాంకులు, సబ్ ట్రెజరీల్లోనూ అక్రమార్కులు
- అధికారులపై దాడులకు సిద్ధమైన ఏసీబీ
- ఫైలు సీఎంవోకు వెళ్లకుండా ఉన్నతాధికారుల ఒత్తిడి?
సాక్షి, హైదరాబాద్
ప్రభుత్వానికి ప్రతి నెలా వ్యాట్ కింద రావాల్సిన కోట్ల రూపాయలను బినామీ ఖాతాల్లోకి మళ్లించారు.. ఒక వ్యాపారి చెల్లించిన ట్యాక్స్ నగదును మరో ఐదుగురు వ్యాపారుల పేర్ల మీదకు మార్చేశారు.. బోధన్ కమర్షియల్ ట్యాక్స్ స్కాంలో ఇలాంటి ఎన్నో సంచలనాత్మక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి! కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారుల కళ్లు బైర్లు కమ్మే విషయాలు కనిపిస్తున్నాయి.
ఏకంగా రూ.200 కోట్లకు పైగా ట్యాక్స్ వసూలు చేసి కేవలం 25 నుంచి రూ.30 కోట్లు మాత్రమే ప్రభుత్వ ఖజానాలోకి చేరాయంటే ఎంతటి స్థాయిలో స్కాం జరిగిందో తెలుస్తోంది. ఇలా కేవలం బోధన్ మాత్రమే కాదు కమర్షియల్ ట్యాక్స్‌లోని 80 శాతం సర్కిళ్లలో ఇదే పరిస్థితి ఉన్నట్టు సీఐడీ అనుమానిస్తోంది. ఇలా ఏటా ప్రభుత్వానికి వెయ్యి కోట్ల దాకా వ్యాట్ సొమ్ము గల్లంతైనట్టు సీఐడీ అంచనా వేస్తోంది.
కేసు సీఐడీకి బదిలీ వెనుక ఒత్తిడి?
బోధన్ స్కాం వ్యవహారంలో సీఐడీ దర్యాప్తునకు ఆదేశించే ముందు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ప్రాథమిక దర్యాప్తు జరిపింది. ఈ విచారణలో కేవలం బోధన్‌లోనే రూ.200 కోట్లు స్కాం జరిగినట్టు తేలింది. సీటీఓ, ఏసీటీవోతోపాటు మరో నలుగురు కార్యాలయ సిబ్బంది, ఆడిటర్ నేతృత్వంలో స్కాం చేసినట్టు ఏసీబీ ఆధారాలు సేకరించింది. ఇలా రాష్ట్రంలోని 12 డివిజన్లలో 91 సర్కిల్ కార్యాలయాలున్నాయి. ఈ సర్కిళ్లలోని 80 శాతం కార్యాలయాల్లో ఆడిటర్లే వాటిని పరోక్షంగా శాసిస్తున్నారని తేలినట్టు తెలిసింది. ఇలా ఈ సర్కిల్ కార్యాలయాల్లో రూ.1000 కోట్లకు పైగా కుంభకోణం జరిగి ఉంటుందని ఏసీబీ అనుమానించింది. అయితే ఈ కేసును తామే విచారణ చేస్తామని ఉన్నతాధికారులు పట్టుదల చూపించారు. కానీ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చి కేసును కేవలం బోధన్‌కు మాత్రమే పరిమితం చేసి సీఐడీకి బదిలీ చేయించారని విశ్వసనీయంగా తెలిసింది.
అన్ని వారి చేతుల్లోనే..
బోధన్ స్కాంలో ప్రధాన పాత్ర పోషించింది ఆడిటర్ శివరాజ్‌గా సీఐడీ అధికారులు గుర్తించారు. ఇతడి ప్రమేయం లేనిదే ఆ సర్కిల్ పరిధిలో ట్యాక్స్ చెల్లింపులు జరగవని గుర్తించారు. శివరాజ్‌తోపాటు అతడి కుమారుడు సునీల్ కూడా కీలక పాత్ర పోషించాడని దర్యాప్తులో బయటపడింది. శివరాజ్ లాబీయింగ్‌తోనే కమర్షియల్ ట్యాక్స్ అధికారుల బదిలీలు కూడా జరిగాయంటే స్కాంలో అతడి పాత్ర ఎంతటితో అర్థమవుతోంది. ఇలా అతడు ఒక్క బోధన్‌లోనేగాక.. నిజామాబాద్ డివిజన్‌లో నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకొని నకిలీ ట్రెజరీ చలాన్లతో ట్యాక్స్ చెల్లించినట్టు వ్యాట్ వెబ్‌పోర్టల్లో అధికారులు యూజర్ ఐడీ, పాస్‌వర్డులతో వివరాలు అప్‌లోడ్ చేసేవాడని సీఐడీ అధికారుల ద్వారా తెలిసింది. ఇలా ఐదేళ్లలో ఇతడి ద్వారానే దొంగ ఆడిటింగ్‌లు చేయించారని, వాటికి సంబంధించిన ఫైలు కూడా దొరక్కుండా చేశారని తేలింది.
ఒక్క చెక్కు.. ఐదుగురికి ట్యాక్స్...
బోధన్‌లో ప్రముఖ వాహనాల డిస్టిబ్యూటర్ ప్రతి నెలా రూ.25 లక్షల ట్యాక్స్ కడుతుంటాడు. కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు నిత్యం టచ్‌లో ఉండే ఆడిటర్ శివరాజ్‌కు రూ.25 లక్షల చెక్కు ఇచ్చాడు. ఈ చెక్ తీసుకున్న శివరాజ్ ఐదుగురు వ్యాపారుల పేరిట చలాన్లు తీసి సబ్ ట్రెజరీ ఆఫీస్‌లో చెల్లించాడు. వాహనాల డిస్టిబ్యూటర్ పేరిట కేవలం రూ.5 లక్షలు చెల్లించి మిగతా డబ్బును ఇతర వ్యాపారుల పేరిట జమ చేశారు. వారిచ్చిన డబ్బును శివరాజ్‌తో పాటు అధికారులు తమ సొంత జేబుల్లో నింపుకున్నారు. గత అయిదేళ్లలో ఒక వాహనాల డీలర్ రూ.28 కోట్లు ట్యాక్స్ చెల్లించినట్టు చెక్కులున్నాయి. కానీ కమర్షియల్ టాక్స్‌లో ఆయన పేరిట ఇప్పటివరకు రూ.2 కోట్లు మాత్రమే జమ అయినట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది. మిగతా రూ.26 కోట్లు అధికారులే స్వాహా చేశారనే నిర్ధారణకు వచ్చారు. ఇలా బోధన్ పరిధిలో రూ.25 లక్షలకు పైగా ట్యాక్స్ చెల్లించే వారు 150 మంది ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా రైస్‌మిల్లర్లు, కార్ల డిస్టిబ్యూటర్లుండటంతో కమర్షియల్ టాక్స్ అధికారుల పంట పడింది. ఒకరు కట్టిన ట్యాక్స్‌ను ఖజానాకు జమ చేసి.. మిగతా వారు కట్టిన డబ్బును తమ సొంతం చేసుకున్నారు.
బ్యాంకు, సబ్ ట్రెజరీల్లోనూ...
కమర్షియల్ ట్యాక్స్ ప్రభుత్వ ఖాతా ఉన్న బ్యాంకు, చలాన్లు చెల్లించే సబ్ ట్రెజరీ కార్యాలయాలు(ఎస్‌టీవో)ల్లో కూడా శివరాజ్ మనుషులున్నట్టు సీఐడీ గుర్తించింది. ఒకరి పేరుపై ట్యాక్స్ చెల్లించేందుకు ఇచ్చిన చెక్కుతోనే మిగతా వ్యాపారుల పేరిట చలాన్లు స్వీకరించడం ఏంటన్న అంశంపై దృష్టి సారించగా.. ఈ రెండు విభాగాల అధికారుల అక్రమాలు బయటపడినట్టు తెలుస్తోంది.
15 రోజుల్లోనే రూ.20 కోట్లు
బోధన్‌లో ట్యాక్స్ కుంభకోణం బయటపడి 15 రోజులు గడుస్తోంది. ఈ పక్షం రోజుల్లో బోధన్ మిల్లర్లు రూ.20 కోట్ల వరకు పెండింగ్ ట్యాక్సులు చెల్లించినట్టు తెలిసింది. ఇవి కేవలం 20 శాతం మంది మిల్లర్లు మాత్రమే చెల్లించినవి సీఐడీ తన దర్యాప్తులో బయటపెట్టింది.
మొద్దు నిద్రలో వాణిజ్య విభాగం
బోధన్‌లో ఈ స్కాం ఐదేళ్ల నుంచి జరుగుతోందని సీఐడీ దర్యాప్తులో తేలింది. అయితే ఈ ఐదేళ్లకు సంబంధించిన ఏ ఒక్క రికార్డు కూడా దొరక్కుండా కాల్చి బూడిద చేశారు. మరి ఐదేళ్ల నుంచి కమర్షియల్ ట్యాక్స్ విభాగం ఉన్నతాధికారులు, ఆడిటింగ్ విభాగం ఎందుకు పట్టించుకోలేదన్న అంశంపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. వీరి చేతుల్లోకి కూడా వసూళ్ల డబ్బు వచ్చి ఉంటుందని అనుమానిస్తోంది. 2012 నుంచి 2016–17 ఆర్థిక సంవత్సరం వరకు స్కాం జరిగినట్టు విచారణలో వెలుగు చూసింది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ వసూళ్లనే దోచుకుంటే వాణిజ్య విభాగం చూసీచూడకుండా ఉండటంపై విమర్షలు వెలువెత్తుతున్నాయి.
ఆ అధికారులపై నజర్
ప్రభుత్వ ఉద్యోగుల అక్రమాలకు సంబంధించి కేసుల నమోదు, దాడులు చేసే అధికారం కేవలం ఏసీబీకి మాత్రమే ఉంది. బోధన్ స్కాంతో వెలుగులోకి వచ్చిన కమర్షియల్ ట్యాక్స్ అధికారులపై ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. బినామీ పేర్లతో అక్రమాస్తులు కూడబెట్టిన అధికారులపై త్వరలోనే కొరడా ఝళిపించే అవకాశం ఉందని ఏసీబీ అధికారుల ద్వారా తెలిసింది. అయితే అధికారులపై దాడులకు సంబంధించిన ప్రతిపాదన పైలు జీఏడీలో పెండింగ్‌లో ఉందని, ఆ ఫైలును సీఎం కార్యాలయానికి చేరకుండా కమర్షియల్ ట్యాక్స్‌లోని కొందరు ఉన్నతాధికారులు ఒత్తిడి తెచ్చి ఆపించే కుట్ర చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. 10 రోజులుగా ఆ ఫైలు సీఎంవోకు వెళ్లకుండా పక్కనబెట్టడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీబీ జాబితాలో జూనియర్ అసిస్టెంట్ నుంచి జాయింట్ కమిషనర్లకు వరకు ఉన్నట్టు తెలిసింది.