కోట్లు దోచుకుంటే ఏం చేస్తున్నారు? | CM KCR fires on Bodhan Scam | Sakshi
Sakshi News home page

కోట్లు దోచుకుంటే ఏం చేస్తున్నారు?

Published Tue, Feb 21 2017 12:34 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

కోట్లు దోచుకుంటే ఏం చేస్తున్నారు? - Sakshi

కోట్లు దోచుకుంటే ఏం చేస్తున్నారు?

‘కమర్షియల్‌’ స్కాంపై సీఎం కేసీఆర్‌ సీరియస్‌
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిఘా పెంచాలని ఆదేశం
సీఐడీ విచారణపై ఆరా..ఆరోపణలెదుర్కొంటున్న అధికారులపై విచారణ


సాక్షి, హైదరాబాద్‌: బోధన్‌ వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన కుంభకోణంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సీరియస్‌ అయ్యారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ రాబడికి గండి కొడుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారంటూ సంబంధిత విభాగ ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత కేవలం రూ.60 కోట్ల వరకే స్కాం జరిగినట్లు నివేదికిచ్చారని, కానీ సీఐడీ విచారణలో వందల కోట్లు పక్కదారి పట్టినట్లు తేలడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

ఇక నుంచి ప్రతి సర్కిల్‌ కార్యాలయ పరిధిలోని ఆడిటింగ్‌ను తప్పనిసరిగా కేంద్ర కార్యాలయాల్లో పర్యవేక్షించాలని, అధికారులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిఘాను పెంచాలని ఆదేశించారు. సీఐడీ చేస్తున్న దర్యాప్తు తీరుపై డీజీపీ అనురాగ్‌ శర్మతో సీఎం వాకబు చేశారు. కేసు విచారణలో బయటపడుతున్న సంచలనాత్మక అంశాలపై లోతుగా దర్యాప్తు చేపట్టాలని, మరిన్ని బృందాలను రంగంలోకి దించి నిందితులను పట్టుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది.

(చదవండి: బో‘ధన్‌’ దొంగలెందరో?)


క్రిమినల్‌ కేసులకు రంగం సిద్ధం
బోధన్‌ స్కాం అక్రమాల్లో పాలుపంచుకున్న కమర్షియల్‌ ట్యాక్స్‌ సీటీవోలు, ఏసీటీవోలు, సూపరింటెండెంట్లు, డీసీటీవోలు, జాయింట్‌ కమిషనర్ల విచారణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ స్కాంలో ఆరోపణలెదుర్కొంటున్న 18 మంది అధికారుల పాత్రపై సీఐడీ ఆరా తీయనుంది. ప్రైవేట్‌ ఆడిటర్‌ శివరాజ్, అతడి కుమారుడు సునీల్‌తో పదే పదే సంభాషణలు కొనసాగించిన ఈ అధికారులపై కూడా క్రిమినల్‌ కేసులు నమోదు చేసేందుకు దర్యాప్తు అధికారులు రంగం సిద్ధం చేశారు. వీరిని విచారించేందుకు సీఐడీకి అనుమతి లభించడంతో నోటీసులు జారీ చేసి విచారణకు హాజరవ్వాలని కోరే అవకాశం ఉన్నట్లు సీఐడీ వర్గాలు తెలిపాయి.

నీకింత.. నాకింత
వాటాలు పంచుకున్న 18 మంది అధికారులు
బోధన్‌ స్కాం తవ్వుతున్న సీఐడీకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నెట్‌వర్క్‌ బయటపడింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన ఉన్నతాధికారుల జాబితా వెలుగులోకి వచ్చింది.  ఏకంగా 18 మంది ఉన్నతాధికారుల పాత్రపై సీఐడీ దృష్టి సారించింది. బోధన్‌లో గతంలో పనిచేసిన ఏసీటీవో, సీటీవోల దగ్గరి నుంచి డివిజన్‌ కార్యాలయాలు, జాయింట్‌ కమిషనర్ల వరకు ఈ స్కాంలో పాత్రదారులుగా ఉన్నారని సీఐడీ ఆధారా లు సేకరించింది. ప్రైవేట్‌ ఆడిటర్‌గా ఉం టూ ట్యాక్స్‌ చెక్కులు వసూలు చేసిన శివరాజుతో కలసి ఈ 18 మంది వాటాలు పంచుకున్నారని విచారణలో తేలినట్టు అధికారులు తెలిపారు. వీరంతా ప్రస్తుతం వివిధ హోదాల్లో పలు చోట్ల పనిచేస్తున్నారు.

వీరు పనిచేస్తున్న ప్రాంతాల్లోనూ శివరాజుతో కలసి ఇలాంటి వ్యవహారాలు సాగిస్తున్నట్టు సీఐడీ గుర్తించింది. అయితే వీరు పనిచేస్తున్న ప్రాంతాలను తెలిపేందుకు అధికారులు నిరాకరించారు. బోధన్‌లో రూ.25 లక్షలకు పైగా ట్యాక్స్‌ చెల్లించాల్సిన 100 మంది వ్యాపారుల వాంగ్మూలాలు సేకరించాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. వీరిలో ట్యాక్స్‌ కట్టిన వారు, ట్యాక్స్‌ కట్టకుండా శివరాజుతో కలసి పన్ను కట్టినట్టు నకిలీ చలాన్లు పెట్టుకున్న వారిని విచారించాలని భావిస్తున్నారు. దీంతో పాత నిజామాబాద్‌ జిల్లాలో కలవరం మొదలైంది. ఎప్పుడు ఏ సీఐడీ అధికారులు వచ్చి విచారిస్తారో తెలియక సతమవుతున్నట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement