డీఎంకే భవిష్యత్‌ కార్యాచరణ.. సర్వత్రా ఉత్కంఠ! | MK Stalin to chair high level action council meeting | Sakshi
Sakshi News home page

డీఎంకే భవిష్యత్‌ కార్యాచరణ.. సర్వత్రా ఉత్కంఠ!

Published Sun, Feb 12 2017 12:57 PM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM

డీఎంకే భవిష్యత్‌ కార్యాచరణ.. సర్వత్రా ఉత్కంఠ!

డీఎంకే భవిష్యత్‌ కార్యాచరణ.. సర్వత్రా ఉత్కంఠ!

చెన్నై: అధికార అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభం తారస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ప్రతిపక్ష డీఎంకే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ముఖ్యమంత్రి పదవి కోసం శశికళ, పన్నీర్‌ సెల్వం హోరాహోరీగా తలపడుతున్న నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై సమాలోచనలు జరుపుతోంది. ఇందులో భాగంగా సోమవారం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంకే స్టాలిన్‌ అధ్యక్షతన డీఎంకే ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారు.

స్టాలిన్‌ వ్యూహాత్మకంగా పన్నీర్‌ సెల్వానికి మద్దతునిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే డీఎంకే అధికారికంగా సెల్వానికి అవసరమైతే మద్దతునిస్తామని ప్రకటించింది. రేపు ఒకవేళ అసెంబ్లీలో పన్నీర్‌ సెల్వానికి బలపరీక్ష ఎదురైతే.. ఎలాంటి వ్యూహం అనుసరించాలి? చిన్నమ్మ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు ఎలాంటి ఎత్తుగడలు వేయాలి? అన్నదానిపై ఈ భేటీలో చర్చించనున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే త్వరలోనే తమిళనాడులో అధికారంలోకి వస్తామంటూ ప్రకటించి స్టాలిన్‌ సంచలనానికి తెరతీసిన సంగతి తెలిసిందే. స్టాలిన్‌- ఓపీఎస్‌ మధ్య అంతర్గత స్నేహబంధాలు ఉన్నాయని అంటున్నారు. చిన్నమ్మను అడ్డుకొని సెల్వాన్ని సీఎం చేయడం ద్వారా తన రాజకీయ ప్రయోజనాలు కూడా నెరవేర్చుకోవాలని స్టాలిన్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం డీఎంకేకు మిత్రపక్షాల మద్దతుతో కలిపి 90కిపైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓపీఎస్‌కు 30 వరకు ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సెల్వం-స్టాలిన్‌ చేయి కలిపితే.. ప్రభుత్వ ఏర్పాటు పెద్ద కష్టం కాబోదు అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. కొంతకాలం సెల్వానికి మద్దతునిచ్చే.. ఆ తర్వాత మధ్యంతర ఎన్నికలకు వెళ్లి.. అందులో ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది స్టాలిన్‌ ఆలోచనగా కనిపిస్తున్నదని అంటున్నారు. అలా కానీ పక్షంలో మొదటి రెండేళ్లు ఓపీఎస్‌ ముఖ్యమంత్రిగా కొనసాగితే.. ఆ తర్వాత స్టాలిన్‌ సీఎం పీఠం చేపట్టవచ్చునని, ఈ మేరకు అధికారాన్ని పంచుకునే అవకాశముందని కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో డీఎంకే ఉన్నతస్థాయి సమావేశం మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement