పన్నీర్ శిబిరంలో పదవుల ఆశ
కేంద్రంలో బెర్త్‌లపై ఎంపీల ధీమా.. తంబిదురైకు గండం తప్పదా?
సాక్షి, చెన్నై: ఆలు లేదు... సూలు లేదు కొడుకేమో సోమలింగం అన్నట్టుగా రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకే మెజారిటీ ఎమ్మెల్యేలు లేకపోయినా... కేంద్రంలో తమకు బెర్త్‌లు ఖాయమని ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం శిబిరం ఎంపీలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్‌వేస్ రోడ్డులోని పన్నీర్ శిబిరంలో సాగుతు న్న ఈ చర్చ సర్వత్రా విస్మయానికి గురి చేస్తోంది. అన్నాడీఎంకేకు తమిళనాడులో 37 లోక్‌సభ, 13 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు.
దేశంలోనే మూడో అతిపెద్ద పార్టీగా అన్నాడీ ఎంకే అవతరించడంతో, ఆ సంఖ్య తమకు అవసరం కాబట్టి పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ పదవిని ఆ పార్టీకి కేంద్రం కట్టబెట్టింది. ఈ పదవిలో సీనియర్ ఎంపీ తంబిదురై కొనసాగు తున్నారు. ప్రస్తుతం అన్నాడీఎంకేలో సాగుతున్న రాజకీయ సమరంలో తంబిదురై శశికళ పక్షాన నిలవగా, 12మంది ఎంపీలు పన్నీర్‌కు మద్దతు పలుకుతున్నారు. మరికొందరు ఆయ న పక్షాన చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. పన్నీర్ చేతికి అధికార పగ్గాలు చిక్కడం ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్న ఆ శిబిరం ఎంపీలు, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే, తక్షణ కర్తవ్యంగా తంబిదురైను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి దించేందుకు వ్యూహాలు రచిస్తు న్నారు. అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో పన్నీర్ భాగస్వామ్యం కావడం ఖాయం అని, దీంతో కేంద్రంలో సహాయ పదవులు తమలో ఒకరి ద్దరికి దక్కే అవకాశాలు ఉండొచ్చని అప్పుడే పదవుల ఆశల్లో తేలియాడుతున్నారు.
పోయెస్ గార్డెన్ దీపక్‌కు!
టీ నగర్ (చెన్నై): ఆళ్వారుపేటలోగల పోయెస్‌గార్డెన్ ఇల్లు ఎవరికి దక్కుతుందన్న విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిని జయలలిత అన్న కుమారుడు దీపక్‌కు శశికళ అప్పగించనున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దీపక్ ప్రస్తుతం శశికళకు మద్దతుగానే ఉన్నారు. ఆయన సోదరి దీపతో సన్నిహితంగా లేరు. జయలలిత అంత్యక్రియల్లో పాల్గొనడం ద్వారానే దీపక్ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ జైలుకు వెళుతున్నందున పోయెస్‌గార్డెన్‌లో ఉన్న పోలీసులందరిని ఉపసంహరించుకు న్నారు. దీంతో పోయెస్ గార్డెన్ ఇల్లు ఎవరి ఆధీనంలోకి వస్తుందనే ప్రశ్న ఉదయించింది. దీపక్ మంగళవారం మధ్యాహ్నం కువత్తూరులోగల రిసార్ట్‌కు వెళ్లారు. అన్నాడీఎంకేలో ముఖ్యమైన పదవి అందజేసేందుకు, పోయెస్ గార్డెన్ ఇంటి నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నట్లు శశికళ పిలిపించినట్లు తెలుస్తోంది. మరోవైపు పోయెస్ గార్డెన్ ఇంటిని జయలలిత స్మారక భవనంగా మార్చేందుకు పన్నీర్ వర్గం సంతకాల సేకరణ చేపట్టింది.