నిర్మలా సీతారామన్ (నాడు-నేడు)
- నిర్మలా సీతారామన్ కుటుంబ నేపథ్యం ఏమిటి?
- పరకాల ప్రభాకర్‌ను ఆమె ఎక్కడ కలిశారు?
- ఎకనామిక్స్‌లో దిట్ట.. రక్షణ శాఖ ఎలా?
- కీలక పదవిపై ఆమె స్పందన..
న్యూఢిల్లీ : ఇటీవలే రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకో, కేబినెట్‌లో సీనియర్లలో ఒకరైన నితిన్ గడ్కరీకో లేదా అరుణ్ జైట్లీకో దక్కుతుందనుకున్న కీలకమైన రక్షణ శాఖను నిర్మలా సీతారామన్‌కు కట్టబెట్టి భారతీయ జనతా పార్టీ తన వైవిధ్యాన్ని చాటుకుంది. అయితే, ఈశాన్యంలోని చైనా.. వాయువ్యాన పాకిస్తాన్‌లు గతంలో కంటే తీవ్రంగా భారత్‌ను రెచ్చగొట్టే వైఖరిని ఉధృతం చేస్తున్న తరుణంలో ‘జాతీయ భద్రత’ బాధ్యత మహిళకు దక్కడం విశేషం.
‘ఇందిరా గాంధీ తర్వాత ఆ పదవి చేపట్టిన రెండో మహిళ’ అనడం కంటే, ‘భారత రక్షణ శాఖకు మొట్టమొదటి పూర్తిస్థాయి మహిళా మంత్రి నిర్మలా సీతారామన్’ అనడం సమంజసం. ఇందిర రక్షణ మంత్రి రెండు పర్యాయాలూ (1975, 1980-82) అదనపు బాధ్యతలు నిర్వహించారే తప్ప పూర్తిస్థాయిలోకాదు. నాడు ఇందిర ఆ శాఖను ఎందుకు చేపట్టారనేదానిపై భిన్న వాదనలు ఉన్నాయి. ప్రస్తుత సందర్భంలో నిర్మలకు రక్షణ శాఖ కేటాయింపు విషయంలో బలంగా వినిపిస్తోన్న మాట.. ‘తమిళనాడుపై బీజేపీ పట్టు కోసం’ అని!
త్రివిధ(సైనిక, వాయు, నౌకా)దళాలకు సంబంధించిన విధివిధానాలను పర్యవేక్షిస్తూ, అవసరమైన చేర్పులకు రూపకల్పన చేయడం రక్షణ శాఖ మంత్రి ప్రధాన విధి. పొరుగుదేశాలపై ఎదురుదాడి లేదా యుద్ధం లాంటి కీలక నిర్ణయాలు మాత్రం కేబినెట్ సమిష్టిగా తీసుకుంటుందని తెలిసిందే. నరేంద్ర మోదీ ప్రధాని బాధ్యతలు స్వీకరించిన రోజే(26 మే, 2014) అరుణ్ జైట్లీ రక్షణ శాఖ అదనపు బాధ్యతలు తీసుకున్నారు. ఆరు నెలల తర్వాత గోవా ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పారికర్‌ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుని రక్షణ మంత్రిత్వ శాఖ ఇచ్చారు. 2017 మార్చిలో పారికర్ మళ్లీ గోవా సీఎంగా వెళ్లిపోవడంతో ఖాళీ అయిన శాఖను జైట్లీకి అదనంగా కేటాయించారు. నేటి(సెప్టెంబర్ 3) కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో నిర్మలా సీతారామన్‌కు పూర్తిస్థాయి రక్షణ మంత్రి బాధ్యతలు కట్టబెట్టారు.
తమిళ బీజేపీ ముఖచిత్రం నిర్మల!
‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదంతో ఉత్తర, పశ్చిమ, ఈశాన్య , మధ్య భారత రాష్ట్రాల్లో సత్తా చాటిన మోదీ- షా ద్వయం గడిచిన కొంత కాలంగా దక్షిణ భారతంపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇప్పటికే బీజేపీకి పట్టున్న కర్ణాటకతోపాటు కేరళలోనూ కార్యక్రమాలను విస్తృతం చేశారు. ఇక తమిళనాడులో జయలలిత మరణానంతరం తలెత్తిన పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ వేస్తోన్న ఎత్తుగడలు అన్నీ ఇన్నీకావు. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థల అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. బీజేపీ ఎంత గట్టిగా ప్రయత్నించినా స్థానికంగా పటిష్టంగా ఉన్న నాయకులు లేదా నాయకురాళ్లు మోదీ-షా ఎత్తుగడలను గట్టిగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్న తీరు చూస్తూనే ఉన్నాం. వీటన్నింటి నేపథ్యంలో తమిళనాడుకే చెందిన నిర్మలకు కేంద్రంలో విశేష ప్రాధాన్యం కల్పించడం ద్వారా ఆ రాష్ట్రానికే ఆమెను ముఖచిత్రంగా చూపించే భావనలో బీజేపీ ఉన్నట్లు జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
మధురై.. మధ్యతరగతి కుటుంబం..
తమిళనాడులోని మధురైలో 1959, ఆగస్టు 18న జన్మించారు నిర్మల. తండ్రి నారాయణన్ సీతారామ్ రైల్వే ఉద్యోగి. తల్లి సావిత్రి గృహిణే అయినా మంచి పాఠకురాలు. తండ్రి నుంచి క్రమశిక్షణను, తల్లి నుంచి పుస్తకాలు చదివే అలవాటును అలవర్చుకున్న నిర్మల.. తిరుచిరాపల్లిలోని సీతాలక్ష్మి రామస్వామి కాలేజీలో డిగ్రీ(బీఏ) చదివారు. అటుపై ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో ఎంఏ చేశారు. అదే వర్సిటీ నుంచి (ఇండో-యూరోపియన్ టెక్స్‌టైల్ ట్రేడ్ అంశంలో ) పీహెచ్‌డీ, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారీఫ్స్ అండ్ ట్రేడ్ అంశంలో ఎంఫిల్ పట్టాలు పొందారు.
జేఎన్‌యూలో చదివేటప్పుడే (నరసాపురం)ఏపీకి చెందిన పరకాల ప్రభాకర్‌తో నిర్మలకు పరిచయం ఏర్పడింది. అనంతరం వారు వివాహబంధంతో ఒక్కటయ్యారు. వారికి ఒక కుమార్తె ఉంది. కాంగ్రెస్ నేపథ్యం ఉన్న కుటుంబమే అయినప్పటికీ ప్రభాకర్ బీజేపీలో చేరి 2000లో ఆంధ్రప్రదేశ్ పార్టీ అధికార ప్రతినిధి అయ్యారు. నిర్మలా సీతారామన్ 2006లో అధికారికంగా బీజేపీలో చేరారు. నితిన్ గడ్కరీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆమె పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి బీజేపీ ప్రముఖుల్లో ఒకరిగా కొనసాగుతోన్న నిర్మల.. 2014 ఎన్నికల తర్వాత మోదీ కేబినెట్‌లో సహాయ మంత్రిగా చేరారు. స్వతహాగా ఎకనామిక్ విద్యార్థిని అయిన నిర్మల.. వాణిజ్య, పరిశ్రమల శాఖను సమర్థవంతగా నిర్వహించారు. కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తోన్న నిర్మలా సీతారామన్ తాజాగా రక్షణ శాఖ మంత్రిగా ప్రమాణం చేసి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
మరపురాని రోజు..
‘‘నిజంగా ఇది చాలా పెద్ద బాధ్యత. నా వరకైతే ఇది మరపురాని రోజు. ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి మాటలు రావడంలేదు’’ అని అన్నారు నిర్మలా సీతారామన్. కీలకమైన రక్షణ మంత్రిత్వ శాఖ దక్కడంపై ఆమె పై విధంగా స్పందించారు.