రాహుల్‌తో చాయ్.. మోదీతో డిన్నర్!
న్యూఢిల్లీ: సాయంత్రం రాహుల్‌గాంధీతో చాయ్‌పే చర్చ.. రాత్రి ప్రధాని నరేంద్రమోదీతో డిన్నర్ మంతనాలు. ఇది బిహార్ సీఎం నితీశ్‌కుమార్ శనివారం చేపడుతున్న ఢిల్లీ పర్యటన షెడ్యూల్.. సాయంత్రం నాలుగు గంటలకు రాహుల్‌తో నితీశ్ భేటీ అయ్యారు. రాత్రి రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీకి వీడ్కోలు పలికేందుకు హైదరాబాద్ హౌస్‌లో ఏర్పాటుచేసిన విందులో నితీశ్ పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీతో మాట్లాడే అవకాశముంది. బిహార్‌లో అధికార సంకీర్ణ కూటమి భాగస్వామ్యపక్షాలైన నితీశ్‌కుమార్ జేడీయూ, లాలూ ఆర్జేడీ మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ తనయుడు, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ దిగిపోవాల్సిందేనని జేడీయూ ఒత్తిడి తేస్తుండగా.. అందుకు లాలూ ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార కూటమి మనుగడ ప్రశ్నార్థకమైంది. ఈ కూటమిలో మైనర్ పార్ట్‌నర్‌గా ఉన్న కాంగ్రెస్ జేడీయూ-ఆర్జేడీ మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తుండగా.. ఒకవేళ నితీశ్ సర్కారుకు ఆర్జేడీ మద్దతు ఉపసంహరించుకుంటే.. తాము మద్దతిస్తామని బీజేపీ ఊరిస్తోంది. ఈ నేపథ్యంలో నితీశ్ తాజా ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.