కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్
ఆరెస్సెస్ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు
ఉజ్జయిని/కొచ్చి: కేరళ ముఖ్యమంత్రి తల నరికి తెచ్చిన ఉజ్జయిని వాసులకు కోటి రూపాయలు విలువ చేసే తన ఇంటిని బహుమతిగా ఇస్తానని మధ్యప్రదేశ్‌లో ఓ ఆరెస్సెస్ నాయకుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఈ వ్యాఖ్యలను ఆరెస్సెస్ సహా సీపీఎం, కాంగ్రెస్ ఖండించాయి. ఇలాంటి బెదిరింపులకు భయపడి తన పర్యటనలకు దూరంగా ఉండనని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. ఉజ్జయినికి చెందిన కుందన్ చంద్రావత్ అనే ఆరెస్సెస్ నాయకుడు ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘కేరళ ముఖ్యమంత్రి మన ఆరెస్సెస్ కార్యకర్తలను చంపుతున్నాడు.
ఇప్పటికి 300 మంది కార్యకర్తలు చనిపోయారు. ఆ సీఎం తల నరికి తెచ్చిన ఉజ్జయిని వాసులకు నా ఇంటిని రాసిస్తా’ అని కుందన్ చెబుతున్నట్లుగా ఉన్న ఒక వీడియో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కుందన్ వ్యాఖ్యలతో ఆరెస్సెస్ వెంటనే విభేదించింది. ‘మేం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సంఘ్ హింసా మార్గంలో నడవదు. అయితే కేరళలో మా కార్యకర్తలు లక్ష్యంగా జరుగుతున్న దాడులపై శాంతియుత మార్గంలోనే మేం నిరసన తెలుపుతాం’ అని ఆరెస్సెస్ జాతీయ నాయకుడు జె.నందకుమార్ ఢిల్లీలో చెప్పారు. అసలు కుందన్ ఎవరో తనకు తెలియదని నంద అన్నారు