ఢిల్లీని ఢీ కొడతా | Sasikala setback, says will fight with Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీని ఢీ కొడతా

Published Mon, Feb 13 2017 1:51 AM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM

ఢిల్లీని ఢీ కొడతా

ఢిల్లీని ఢీ కొడతా

ఎన్నో కష్టాలు అనుభవించా... నాకు జైళ్లు కొత్త కాదు: శశికళ
- ఢిల్లీ వరకూ చెబుతున్నా నన్నెవరూ ఏమీ చేయలేరన్న చిన్నమ్మ
- ఆడదాన్నని అణగదొక్కాలనుకుంటే ‘అమ్మ’లా గర్జిస్తా..
- సమస్యలు జటిలమైతే ఎదుర్కొనేందుకు ప్రాణత్యాగానికైనా సిద్ధం
- అసెంబ్లీలో జయలలిత ఫొటో పెడదాం.. ఇది ఖాయం  
- మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో సమావేశమైన శశికళ


కువత్తూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
‘‘జయలలితతో కలిసి ఎన్నో కష్టాలు అనుభవించాను. చెన్నై జైలు కొత్తకాదు.. బెంగళూరు జైలు కొత్త కాదు. జైలు నుంచి బయటకు వచ్చాం. మళ్లీ అధికారం చేజిక్కించు కున్నాం. మహిళ అనుకుని భయపెట్టి, అణగ దొక్కాలని చూస్తే ‘అమ్మ’లాగే నేను కూడా ఢిల్లీని ఢీ కొట్టేందుకు రెడీ. ఢిల్లీ వరకూ చెబుతున్నా.. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ఎదుర్కొనే దమ్మూ «ధైర్యం నాకున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు’’ అని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ తేల్చిచెప్పారు. ఆమె ఆదివారం రాత్రి మహాబలిపురం సమీపంలోని కువత్తూరు గోల్డెన్‌ బే రిసార్ట్‌లో తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఎరుపెక్కిన కళ్లతో విలపిస్తూ గంటసేపు మాట్లాడారు. శశికళ ప్రసంగం ఆమె మాటల్లోనే..

‘‘అమ్మ(జయలలిత) చేతుల మీదుగా మహాశక్తిగా అవతరించి అన్నాడీఎంకేను కాపాడుకోవాలనే ఒకే ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చాను. కోపం ముఖ్యం కాదు, మన కర్తవ్యం ముఖ్యం. ‘అమ్మ’ సమాధి వద్దకు వెళ్లినప్పుడు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాను. అక్కడి నుంచి బయటకు రాలేకపోయాను. ఇక్కడికొచ్చాక ఆ భారం కొంత దిగింది. ఇక్కడున్న మీరంతా సింహాలే.. మీతో పాటు నేనూ ఒక సింహమే. భయపెట్టడం తప్ప మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు. అయితే, మన జగ్రత్తలో మనం ఉండాలి. మనమంతా ఒకే లక్ష్యంతో ముందుకు సాగాలి.

పార్టీకి పన్నీర్‌ సెల్వం కళంకం తెచ్చారు
తమిళ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ‘అమ్మ’ అధికారాన్ని మనకు అప్పగించి వెళ్లారు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. నేను మాత్రమే కాదు, మీరంతా శ్రమించాలి. వరుసగా మూడోసారి (వచ్చే ఎన్నికల్లో ) మళ్లీ అధికార పగ్గాలు చేపట్టే శక్తిగా ఎదగాలి. బ్రహ్మాండమైన పరిపాలనతో ప్రజల మన్ననలు అందుకుని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 40 స్థానాలు (పుదుచ్చేరితో కలిపి) గెలుచుకుని ‘అమ్మ’ సమాధి వద్ద కానుకగా సమర్పిద్దాం. ఇందుకోసం ‘అమ్మ’ ముందుగానే తగిన పథకాలు రచించారు. అయితే, మన చేతితో మన కళ్లను పొడిచే విధంగా పన్నీర్‌ సెల్వం కుట్రలు పన్ని పార్టీకి కళంకం తెచ్చారు. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. ఆయన(పన్నీర్‌సెల్వం) కూడా వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చారు. నమ్మకం, విధేయత అని చెప్పుకుంటూ ఇప్పుడు ఎందుకోసం తిరుగుబాటు చేశారు?  సమస్యలు జఠిలమైతే ఎదుర్కొనేందుకు ప్రాణాత్యాగానికైనా సిద్ధం.

మీరు నాకు కోటి మందితో సమానం
మనందరి ముందు పెద్ద బాధ్యత ఉంది. ‘అమ్మ’ ఫొటో ముందు ప్రతిజ్ఞ చేద్దాం. 125 మంది నేరుగా ‘అమ్మ’ సమాధి వద్దకు వెళదాం. అక్కడి నుంచి నేరుగా సచివాలయంలో అడుగుపెడదాం. అసెంబ్లీ లోపల జయలలిత ఫొటో పెట్టబోతున్నాం.. ఇది ఖాయం. మీరంతా నా వెంట ఉంటే నాకు కోటి మందితో సమానం. ఇక్కడున్న వారంతా సంపన్నులు కాదు. పేదవాళ్లూ ఎమ్మెల్యేలు అయ్యారు. ఇది ‘అమ్మ’ దయ. కిందిస్థాయి కార్యకర్త కూడా ఉన్నత స్థానంలో ఉండాలన్నదే ‘అమ్మ’ ఆకాంక్ష.. ఇది కొనసాగుతుంది. ప్రతిపక్ష డీఎంకే గురించి మీకెవరికీ తెలియదు. అక్కడ ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో అవన్నీ నాకు తెలుస్తాయి. అక్కడ(డీఎంకేలో) నావాళ్లు ఉన్నారు. వాళ్లు గానీ (డీఎంకే), ఇంకెవరైనా గానీ ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొందాం. అమ్మ ఫొటో అసెంబ్లీలో ఉండాల్సిందే.. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు.. మనమంతా ఒకటిగా ఉందాం’’ అని శశికళ పిలుపునిచ్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement