శశికళ మేనల్లుడికి పెద్ద పోస్టు
శశికళ మేనల్లుడికి పెద్ద పోస్టు
Published Wed, Feb 15 2017 11:24 AM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM
చెన్నై : ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో జైలుకి వెళ్లబోతున్న శశికళ, తన బంధువులే అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు తిప్పేలా ప్లాన్స్ వేస్తున్నారు. తన మేనల్లుడు టీటీవీ దినకరన్కు అన్నాడీఎంకే పార్టీలో పెద్ద పోస్టునే కట్టబెట్టారు. అన్నాడీఎంకేకు ప్రధాన కార్యదర్శిగా ఉన్న తనకు, దినకరన్ను డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. దినకరన్ను తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 2011లో పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ నియామకంతో జైలు నుంచే పార్టీని కంట్రోల్ చేయాలని శశికళ భావిస్తున్నారు. అంతేకాక శశికళ మరో మేనల్లుడు వెంకటేష్ను కూడా తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. అయితే టీటీవీ దినకరన్ను పార్టీలో నేతలెవరూ అంగీకరించడం లేదని తెలుస్తోంది. శశికళ తీసుకునే తప్పుడు నిర్ణయాల్లో ఇది ఒకటిగా పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు.
దినకరన్ ఒకప్పుడు రాజ్యసభ సభ్యుడు. అమ్మ మరణించిన తర్వాత దినకరన్ శశికళ దగ్గరే ఉంటున్నారు. గత రెండు మాసాలుగా శశికళ వెంట దినకరన్ ఉండటం పలువురిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఆయనకు పెద్ద పోస్టునే కట్టబెట్టి, తన కుటుంబ సభ్యుల చేతిలో పార్టీ నడిచేలా ప్లాన్ వేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని ఎలాగైనా చేపట్టాలని ఎత్తుకు పైఎత్తులు వేసిన శశికళకు మంగళవారం సుప్రీంకోర్టులో భారీ షాకెదురైంది. 20 ఏళ్ల కిందటి ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శశికళను దోషిగా నిర్థారిస్తూ సుప్రీం కీలక తీర్పునిచ్చింది. సుప్రీం తీర్పుతో శశికళ 10 ఏళ్ల పాటు రాజకీయ జీవితానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేడు బెంగళూరు కోర్టులో ఆమె సరెండర్ అవ్వాల్సి ఉంది.
చదవండి:
Advertisement
Advertisement