సీరియస్ సిచ్యువేషన్.. అల్లర్లు చెలరేగొచ్చు!
-
నగదు మార్పిడి లిమిట్ ను ఎందుకు తగ్గించారు?
-
కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: పెద్దనోట్లు విషయంలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పెద్దనోట్ల రద్దుతో దేశంలో పరిస్థితి తీవ్రంగా ఉందని, అల్లర్లు చెలరేగవచ్చునని పేర్కొంది. ఈ నేపథ్యంలో నగదు బదిలీ పరిమితిని రూ. 4,500 నుంచి రూ. 2వేలకు ఎందుకు తగ్గించారని కేంద్రాన్ని ప్రశ్నించింది. పెద్దనోట్ల రద్దు నిర్ణయంలో మోదీ ప్రభుత్వ తీరును తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. ఈ ఆకస్మిక నిర్ణయాన్ని రద్దుచేయాలంటూ పలు హైకోర్టులలో దాఖలైన పిటిషన్లపై విచారణ నిలిపివేయాలన్న కేంద్రం విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
రూ. 500, వెయ్యినోట్లను రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు నగదు మార్చుకోవడానికి బ్యాంకుల ముందు పడిగాపులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్దనోట్ల రద్దును సవాల్ చేస్తూ పలు రాష్ట్రాల హైకోర్టులలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసులకు డబ్బులు తరలించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేంద్రం న్యాయస్థానం ముందు అంగీకరించింది. ఈ పిటిషన్లపై విచారణ నిలిపివేయాలని కోరింది. అయితే, పెద్దసంఖ్యలో దాఖలైన ఈ పిటిషన్లు పరిస్థితి తీవ్రతను చాటుతున్నాయని, వివిధ హైకోర్టుల ముందు దాఖలైన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయించుకొని విచారించాలని సుప్రీంకోర్టు సూచించింది.