ఎమ్మెల్యేకు కేసీఆర్ సీరియస్ వార్నింగ్
హైదరాబాద్ : జిల్లా కలెక్టర్ పట్ల మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన కేసీఆర్... ప్రవర్తన సరిగా లేదంటూ ఎమ్మెల్యేను తీవ్రస్థాయిలో మందలించారు. కలెక్టర్‌ను వ్యక్తిగతంగా కలిసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను సీఎం ఆదేశించారు.
ప్రవర్తన మార్చుకోకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వస్తుందని కేసీఆర్ హెచ్చిరించారు. మహిళల పట్ల ఎవరు దురుసుగా ప్రవర్తించినా సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. అలాగే కలెక్టర్ ప్రీతిమీనాతో... ప్రభుత్వం తరఫున మాట్లాడి సముదాయించాలని కేసీఆర్ ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ సీతారాం నాయక్‌లను సూచించారు.
CM KCR strongly admonished Mahbubabad MLA Shankar Naik's improper behaviour with District Collector. Expressed regret over the incident
— Telangana CMO (@TelanganaCMO) 12 July 2017
Hon'ble CM has asked the MLA to tender an unconditional apology to the District Collector in person
— Telangana CMO (@TelanganaCMO) 12 July 2017
కాగా ఎమ్మెల్యే తనతో అసభ్యంగా ప్రవర్తించారని కలెక్టర్ ప్రీతి మీనా .. ఐఏఎస్‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్‌లో ఇవాళ చేపట్టిన మూడో విడత హరితహారం కార్యక్రమంలో ఇద్దరి మధ్య వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే తనతో దురుసుగా ప్రవర్తించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు అమర్యాదగా ప్రవర్తించిన ఎమ్మెల్యే తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ నల్లబ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ కార్యాలయ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకుంటే తాము గురువారం విధులకు హాజరు అయ్యేది లేదని హెచ్చరించారు.