మామూలుగా పిలిస్తే ఆవిడ రాదు కదా!
న్యూయార్క్: 'ఫ్రెండ్స్.. ఇక్కడ 1000 మంది ప్రముఖులున్నారు. బహుశా హిల్లరీ క్లింటన్ పాల్గొన్న అన్ని సభల్లోకి ఎక్కువ జనం మంది వచ్చింది ఇక్కడికేకావచ్చు! ఇంతకీ ఆమెను ఈ డిన్నర్ కు ఎలా ఆహ్వానించారు? ఈ-మెయిల్ కబురు పెడితేనే తప్ప, మామూలుగా పిలిస్తే ఆవిడ రారు కదా! చివరికి ఆ మెయిల్ కూడా ఏ వికీలీక్స్ లోనో కనబడితే తప్ప ఆమె స్పందించరు కదా!' అని 'హిల్లరీ ఈ మెయిల్స్' ఉదంతాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు హిల్లరీ సైతం నవ్వులు చిందించారు.
ఎన్నికల సమయం దగ్గర పడుతున్నకొద్దీ రాజకీయ వేడిని రగల్చడంలో ముందున్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్.. మూడో డిబేట్ లో డెమోక్రాట్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ ను అబద్దాల కోరుగా విమర్శించిన సంగతి తెలిసింది. డిబేట్ తర్వాతి రోజు గురువారం రాత్రి న్యూయార్క్ లో జరిగిన ప్రతిష్టాత్మక విందు కార్యక్రమంలో ఆ ఇద్దరూ మళ్లీ ఎదురుపడ్డారు. అక్కడ కూడా ఒకరినొకరు విమర్శించుకునే ప్రయత్నం చేశారు.. చివరికి మాత్రం కరచాలనం చేసుకున్నారు. అమెరికాలోని క్యాథలిక్ ప్రముఖులు ప్రతి ఏడాది అక్టోబర్ మూడో గురువారం న్యూయార్క్ లో నిర్వహించే ఆల్ఫ్రెడ్ స్మిత్ మెమోరియల్ ఫౌండేషన్ డిన్నర్ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు హాజరుకావడం ఆనవాయితి. ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నందున రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీల అభ్యర్థులు ట్రంప్, హిల్లరీలు ఆ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
'హిల్లరీ నన్ను ఇరాక్ లేదా అఫ్ఘానిస్థాన్ అంబాసిడర్(రాబయారి)గా నియమించాలనుకుంటున్నారు' అని చెప్పిన ట్రంప్.. ఆ పదవి స్వీకరించాలా వద్దా అనేది తన ఇష్టమని పేర్కొన్నారు. వికీలీక్స్ వ్యవహారం వల్ల దేశానికి మంచి జరిగిందని, పౌరులకు ఒకనీతి, ప్రముఖులకు ఒకనీతి ఉండకూడదన్న విషయం తెలిసి వచ్చిందని ట్రంప్ అన్నారు. వివాదాస్పద గర్భస్త్రావాల చట్టం గురించి కూడా ట్రంప్ తన ప్రసంగంలో ఉటంకించారు.