ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు
వాషింగ్టన్/డమస్కస్: ఇస్లామిక్ దేశాల పౌరులను అమెరికాలోకి రాకుండా నిషేధం విధించిన డొనాల్డ్ ట్రంప్‌ను ఐసిస్ సహా పలు జిహాదీ గ్రూపులు వేయినోళ్లా పొగుడుతున్నాయి. ట్రంప్ నిర్ణయం వెలువడగానే విజయోత్సవాలు జరుపుకున్నాయి. ‘ముస్లింలు ఒక్కతాటికి వచ్చేలా చేసిన గొప్ప వ్యక్తి’ అని ట్రంప్‌ను కీర్తించాయి.
సిరియా శరణార్థుల వలసపై నిరవధిక నిషేధంతోపాటు ఇస్లామిక్ దేశాలైన ఇరాక్, సిరియా, ఇరాన్ , సూడాన్ , లిబియా, సోమాలియా, యెమెన్ పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేస్తూ ట్రంప్ ఫర్మానా జారీచేసిన మరుసటి రోజు నుంచి ఉగ్రవాదులు పండుగ చేసుకుంటున్నారని ఐసిస్ అధికారిక వార్తాపత్రిక, అనధికారిక వెబ్‌సైట్‌లో వార్తలు కనిపించాయి.
ట్రంప్ విధానాలతో విదేశాల నుంచి వచ్చే ముస్లింలేకాక, అక్కడే పుట్టిపెరిగిన అమెరికన్ ముస్లింలను కూడా ఒత్తిడికి గురిచేస్తుందని, దీంతో మరో మార్గంలేని అమెరికన్ ముస్లింలు.. జిహాదీలకు మద్దతుపలుకుతారని ఐసిస్ అనుబంధ వెబ్‌సైట్ పేర్కొంది. ట్రంప్ అతి త్వరలోనే మధ్యప్రాచ్య(మిడిల్ ఈస్ట్) దేశాలపై యుద్ధానికి దిగుతారని కూడా అభిప్రాయపడింది. సిరియా కేంద్రంగా నడుస్తోన్న ఈ వెబ్‌సైట్‌లో వచ్చే వార్తలు, వెల్లడయ్యే అభిప్రాయాలను అమెరికా రక్షణశాఖ కూడా ప్రామాణికంగా తీసుకుంటుండటం గమనార్హం. (ముస్లింలపై నిషేధం: గొంతుమార్చిన ట్రంప్)
ట్రంప్ నిర్ణయం వెలువడిన తర్వాత, ఇక ఐసిస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్ధాదీ అజ్ఞాతంలో దాక్కోవాల్సిన అవసరం లేదని, ధైర్యంగా బయటికి వచ్చి, ట్రంప్‌కు థ్యాంక్స్ చెప్పాలని వెబ్‌సైట్‌లో కొందరు కామెంట్లు చేయగా, పశ్చిమదేశాలు ముస్లింల వెంటపడతాయంటూ అవ్లాకీ(ఇరాకీ మాజీనేత) చెప్పిన జోస్యాన్ని ఇంకొందరు గుర్తుచేసుకున్నారు. అమెరికాపై, యూరప్ దేశాలపై దాడులు చేయాలనే తమ లక్ష్యం ఇప్పుడు మరింత సులువు కానుందని జిహాదీలు భావిస్తున్నట్లు షియా ఇంటెలిజెన్స్ గ్రూప్ వెబ్‌సైట్ పేర్కొంది.
అమెరికాకే చెందిన మాజీ అధికారులు సైతం జిహాదీ వెబ్‌సైట్లలో వ్యక్తమైన అభిప్రాయాలతో ఏకీభవించారు. ఐసిస్ తన ప్రభావాన్ని మరింత బలంగా చాటుకునేందుకు ట్రంప్ నిర్ణయం సహకరిస్తుందని సెనేట్ ఆర్మడ్ సర్వీస్ కమిటీ మాజీ చైర్మన్ జాన్ మెక్‌కెయిన్ అన్నారు. సీఐఏ మాజీ ఏజెంట్ రాబర్ట్ రిచర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఏడుదేశాలపై నిషేధం వ్యూహాత్మక తప్పిదమని అన్నారు.
‘టెర్రరిస్ట్ గ్రూపుల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మేం ఏజెంట్లను నియమిస్తాం. తద్వారా దాడులకు సంబంధించిన కొంత సమాచారమైనా మాకు తెలుస్తుంది. అలా అమెరికాకు అనుకూలంగా పనిచేసే గూఢచారులంతా స్థానికులే ఉంటారు. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో గూఢచారులను తయారుచేయడం అసాధ్యం’అని రాబర్ట్ అన్నారు.