భారతీయుల రక్షణకు కట్టుబడి ఉండాలి
⇒ ట్రంప్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి వెంకయ్య
⇒ కూచిభొట్ల శ్రీనివాస్ కుటుంబానికి పరామర్శ
⇒ అలోక్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన దత్తాత్రేయ
హైదరాబాద్/దుండిగల్: అమెరికాలో ఉన్న భారతీయుల రక్షణకు ట్రంప్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. అమెరికాలో జాతి వివక్షకు బలైన కూచిభొట్ల శ్రీనివాస్ కుటుంబాన్ని కేంద్రమంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్యే కిషన్ రెడ్డితో కలసి ఆయన పరామర్శించారు. మృతుని కుటుంబానికి కావల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెంకయ్య చెప్పారు. శ్రీనివాస్ మృతదేహాన్ని తీసుకొ చ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ట్రంప్ ప్రభుత్వం ఇలాంటి దాడులను వ్యతిరేకించకపోతే అమెరికానే తీవ్రంగా నష్ట పోతుందని స్పష్టం చేశారు. అగ్రరాజ్యంతో భారత్ మిత్ర దేశంగా ఉందని.. ఆ మైత్రి అలాగే కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ ఘటనపై ఇప్పటికే విదేశాంగ శాఖ నిరసన వ్యక్తం చేసిందని, ఈ విషయమై త్వరలో ఓ బృందం ట్రంప్‌ను కలుస్తుందని వెంకయ్య తెలిపారు.
అమెరికాలో భారతీయులను ఆదుకొంటాం: దత్తాత్రేయ
అమెరికాలోని భారతీయులెవరూ భయపడా ల్సిన అవసరం లేదని దత్తాత్రేయ చెప్పారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన దాడిగానే భావి స్తున్నానన్నారు. అయితే ఈ దాడిని కేంద్రం సీరియస్‌గా తీసుకుంటుందన్నారు. అక్కడ ఉన్న తెలుగువారు ధైర్యంగా ఉండాలని సూచించారు. కాగా, ఇదే దాడిలో గాయపడ్డ అలోక్‌రెడ్డి కుటుంబ సభ్యులను కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య ఆదివారం పరామర్శిం చారు. ఆర్కేపురంలోని అలోక్‌రెడ్డి నివాసానికి వెళ్లిన దత్తాత్రేయ.. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్య పడవద్దని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. కాగా, అలోక్‌రెడ్డి పరిస్థితి తెలుసుకునేందుకు అమెరికా వెళుతున్నట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు.