ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న యుపిఏ:మోడీ | UPA Vote bank politics: Narendra Modi | Sakshi
Sakshi News home page

ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న యుపిఏ:మోడీ

Published Sun, Aug 11 2013 5:47 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో  నవభారత యువభేరీ బహిరంగ సభలో ప్రసంగిస్తున్న మోడీ - Sakshi

హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో నవభారత యువభేరీ బహిరంగ సభలో ప్రసంగిస్తున్న మోడీ

హైదరాబాద్: యుపిఏ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని  బీజేపీ ప్రచార కమిటీ సారధి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. ఎల్బి స్టేడియంలో ఈ సాయంత్రం జరిగిన  నవభారత యువభేరీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గాంధీ, వల్లభాయి పటేల్ పుట్టిన ప్రాంతం నుంచి తాను వచ్చినట్లు తెలిపారు. దేశం ప్రస్తుత పరిస్థితుల నుంచి త్వరలోనే బయటకు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.  కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్కు సద్బుద్ధి ప్రసాదించమని దేవుడిని ప్రార్ధిస్తున్నానన్నారు.  కేంద్ర ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్ నుంచి విముక్తి కోరుకుంటున్నారని చెప్పారు. విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకురావడానికి ఈ ప్రభుత్వానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. సామాన్యుడికి మేలు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైందన్నారు.

గత 15 రోజులుగా జరుగుతున్న సంఘటనలు దేశంలో చర్చనీయాంశమవుతున్నాయి. అయిదుగురు జవాన్లను పాకిస్తాన్ సైన్యం హతమార్చింది. పాకిస్తాన్ పెట్రేగిపోతున్న ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు కూచుంది. ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఎక్కడ ఉందని దేశం మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. జమ్మూలో మత ఘర్షణలు అమానుషం అని పేర్కొన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను అడ్డుకోలేకపోతున్నారని, సరిహద్దు రేఖల వెంట భద్రతాలోపం ఆందోళన కలిగిస్తోందన్నారు. చైనా సరిహద్దుల నుంచి సైన్యాన్ని వెనక్కు రప్పించడం దౌర్బాగ్యస్థితిని తెలియజేస్తుందన్నారు.

ఆంధ్ర, తెలంగాణ ప్రజలు సోదర భావంతో మెలగాలన్నారు. గుజరాత్ మాదిరిగా ఆంధ్ర, తెలంగాణలను అభివృద్ధి చేయాలన్నది తమ లక్ష్యం అన్నారు. అన్నదమ్ముల్లాంటి మీ మధ్య కాంగ్రెస్ మాదిరిగా తాము చిచ్చు పెట్టం అని చెప్పారు. రాష్ట్రంలో ఒకరినొకరు తిట్టుకునే పరిస్థితి కాంగ్రెస్ కల్పించిందన్నారు. విభజించు పాలించు అనేది కాంగ్రెస్ విధానం అన్నారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ ప్రకటించిందన్నారు. 2004లోనే ఎందుకు తెలంగాణ ప్రక్రియ ఎందుకు మొదలుపెట్టలేదని మోడీ అడిగారు. తెలంగాణ ఎంత ముఖ్యమో, సీమాంధ్ర కూడా అంతే ముఖ్యం అన్నారు.

కాంగ్రేసేతర ప్రభుత్వాలు ఏర్పడటానికి ఎన్టీఆరే కారణం అన్నారు. కాంగ్రెస్ నుంచి దేశానికి విముక్తి లభిస్తేనే ఎన్టీఆర్కు నిజమైన నివాళి అన్నారు.

కుటుంబ సభ్యులు వారించినా వినకుండా ఓ స్వాతంత్ర్య సమరయోధుడు ఈ సభకు రావడం ఆనందంగా ఉందన్నారు.  యువతీయువకులతో స్టేడియం కిక్కరిసిపోయింది. ఈ స్టేడియంలో మీకు స్థలం దొరకకపోయినా నా హృదయంలో స్థానం ఉందని చెప్పారు. ఉత్తరాఖండ్ బాధితుల కోసం విరాళం ఇచ్చినవారందరికీ అభినందనలు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement