మన సంపాదనలో సర్కారు వాటా 30 శాతం! | we pay 30% to govt in our income | Sakshi
Sakshi News home page

మన సంపాదనలో సర్కారు వాటా 30 శాతం!

Published Sat, Apr 8 2017 7:30 PM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

మన సంపాదనలో సర్కారు వాటా 30 శాతం! - Sakshi

మన సంపాదనలో సర్కారు వాటా 30 శాతం!

  • ప్రతి వందలో రూ. 30 పన్నుల కింద వసూలు
  • మనం ఏటా ఆదాయ పన్ను, ఆస్తి పన్ను, సంపద పన్ను వంటి ప్రత్యక్ష పన్నులతో పాటు.. నిత్యం కేంద్ర అమ్మకం పన్ను, రాష్ట్రంలో విలువ ఆధారిత పన్ను, సేవా పన్నులే కాకుండా సెస్సులు, సర్చార్జీల రూపంలో పరోక్ష పన్నులు కడుతున్నాం. సంపాదించే ఆదాయానికి పన్ను కడతాం. పన్ను కట్టగా మిగిలిన సొమ్ముతో కొనుగోలు చేసే ప్రతి వస్తువుకూ, ప్రతి సేవకూ పన్ను కడుతున్నాం. విందు, వినోదాలకీ పన్ను కడతాం. ఒక సగటు మధ్య తరగతి భారత పౌరుడు, అతడి సగటు కుటుంబం ఏటా ఎన్ని పన్నులు కడుతుంది? మనకు తలసరి ఆదాయం తెలుసు. తలసరి అప్పు ఎంత ఉందో లెక్కకట్టడం కద్దు. అలాగే తలసరి పన్ను ఎంతకడుతున్నాం? ఇది అంచనా వేయడానికి వివిధ మార్గాల ద్వారా చేసిన ప్రయత్నం ఇది. మన దేశంలో అందరి ఆదాయాలూ ఒకేలా లేవు. అందరి అవసరాలూ ఒకేలా ఉండవు. అందరు చెల్లించే పన్నులకూ పొంతన ఉండదు. అయినా.. ప్రస్తుతం అమలులో ఉన్న పన్నులు, ఒక మధ్యతరగతి వేతన జీవి నిత్యావసరాలు లెక్కగట్టి.. అతడి ఆదాయ, వ్యయాలపై చెల్లించే పన్నులు లెక్కగట్టే ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే.. కేంద్ర ప్రభుత్వ పన్ను ఆదాయం ప్రాతిపదికగా కూడా తలసరి పన్ను అంచనా వేయడానికి ప్రయత్నించాం. అంచనాల ప్రకారం దేశ ప్రజల తలసరి పన్ను దాదాపు 30 శాతంగా ఉంది. ఒక వ్యక్తి సంవత్సర కాలపు ఆదాయ వ్యయాలను సుమారుగా లెక్కగట్టినా దాదాపు అంతే మొత్తం పన్ను చెల్లిస్తున్నట్లు అవగతమవుతోంది. వివరాలివీ...

    వేతనజీవి పన్నుల వెతలు..: రమేశ్‌ ఒక ఉద్యోగి. అతని నెలసరి వేతనం రూ. 40 వేలు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడికి హైదరాబాద్‌లో ఒక చిన్న అపార్ట్‌మెంట్‌ ఉంది. దానికి ఆస్తి పన్ను కడతాడు. తాగే నీటికి పన్ను కడతాడు. వాడే కరెంటుకు సేవా పన్ను కడతాడు.

    - నిద్ర లేచాక పళ్లు తోమడానికి ఉపయోగించే బ్రష్‌, టూత్‌పేస్ట్‌లను కొన్నపుడు అమ్మకం పన్ను కడతాడు. ఇంట్లో వాడే పాలు, టీ, టిఫిన్‌, భోజనం తయారు చేయడానికి కొనే అన్ని వస్తువుల మీదా పరోక్షంగా పన్ను కడతాడు.

    - ఆఫీసుకు వెళ్లడానికి మోటార్‌సైకిల్‌ లేదా కారు కొన్నపుడు.. దానికోసం అమ్మకం పన్నుతో పాటు రోడ్డు పన్ను, జీవిత పన్ను కడతాడు. ఆ వాహనానికి చేయించే బీమా మీద సేవా పన్ను కడతాడు.

    - ఆ వాహనం నడపడానికి రోజూ ఉపయోగించే పెట్రోల్‌, డీజిల్‌లకు అమ్మకం పన్ను కడతాడు. ఈ పన్నును కేంద్ర, రాష్ట్రాలు రెండూ వసూలు చేస్తాయి. ఆ పన్నుల మీద వివిధ సెస్సులు కూడా కడతాడు.

    - తను చేసే ఉద్యోగానికి వృత్తి పన్ను కడతాడు. ఆర్జించిన ఆదాయానికి ఆదాయ పన్ను కడతాడు. కొంచెం జాగ్రత్త పడితే ఆ ఆదాయ పన్నులో కొంత మినహాయింపు పొందుతాడు.

    - అత్యవసరానికో, ఆటవిడుపుకో కుటుంబంతో కలిసి హోటల్‌లో భోజనం చేస్తే.. అమ్మకం పన్నుతో పాటు సేవా పన్ను కూడా కడతాడు. సినిమాకు వెళ్లినపుడు వినోద పన్ను కడతాడు.

    - భార్యాభర్తలు ఇద్దరికి సెల్‌ఫోన్లు కొన్నపుడు అమ్మకం పన్ను కడతాడు. అందులో వాడే నెట్‌వర్క్‌కి పన్నులు, సేవా పన్నులు కడతారు. ఇంట్లో ఇంటర్నెట్‌ కనెక్షన్‌, కేబుల్‌ టీవీ కనెక్షన్‌ ఉంటాయి. వాటికి సేవా పన్ను, వినోద పన్ను కడతారు.

    - స్కూల్‌లో చదువుకునే ఇద్దరు పిల్లలకు ఫీజుల మీద పన్నులు లేకున్నా.. పుస్తకాలు, పెన్నులు, యూనిఫామ్‌లు, షూలు తదితరాల మీద అమ్మకం పన్ను కడతాడు.  

    - పండగలకు, పుట్టినరోజులకు కొనే దస్తుల మీద అమ్మకం పన్ను కడతాడు. సెలవులకు, ఫంక్షన్లకు ఊరికి వెళ్లిరావడానికి సొంత వాహనమైనా, ప్రభుత్వ వాహనమైనా మధ్యలో టోల్‌ ట్యాక్స్‌ కడతాడు. సొంత వాహనంలో ఇంధనానికి పన్నులు, సుంకాలు కడతాడు. ప్రభుత్వ బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తే సేవా పన్నూ కడతాడు.

    - భవిష్యత్తుపై జాగ్రత్త కోసం తీసుకునే జీవిత బీమా పాలసీలు, ఆరోగ్య బీమా పథకాలకూ పన్ను కడతాడు. ఆస్పత్రిలో చేరినపుడు, మందులు కొన్నపుడు అమ్మకం పన్ను కడతాడు. ఖర్చు చేయగా మిగిలిన కాస్తో కూస్తో మొత్తాన్ని షేర్లలో మదుపు చేసినందుకూ పన్ను కడతాడు.

    ఎంత పన్ను కడుతున్నాం?

    కేంద్ర పన్నులు, రాష్ట్ర పన్నులు కలిపి సగటున 20 శాతం నుంచి 25 శాతం వరకూ పరోక్ష పన్నుల రేట్లు ఉంటాయని అంచనా. ఇక పెట్రోల్‌ మీద ఇరు ప్రభుత్వాలూ కలిసి అసలు ధర కంటే ఎక్కువ సుంకాలు వసూలు చేస్తున్నాయి. మద్యం విషయంలో ధరకన్నా ఒకటిన్నర రెట్ల పైనే సుంకం పిండుతున్నాయి. ఈ ప్రకారం.. మొత్తంగా హైదరాబాద్‌లో రూ. 5 లక్షల వార్షిక వేతనం గల ఒక మధ్యతరగతి కుటుంబం చేసే ఖర్చులో చెల్లించే పన్నులు సుమారుగా అంచనా వేస్తే...



    ఏటాదిలో ప్రత్యక్ష పన్నులు

    ఆదాయపన్ను                   : 15,000 (రూ. 2.5 లక్షలకు  రూ. 25,000 పన్నులో రూ. 10 వేలు మినహాయింపులు)

    వృత్తి పన్ను                      : 2,400 (నెలకు రూ. 200 చొప్పున)

    ఆస్తి పన్ను                       : 3,000 (1,000 చ.గ. అపార్ట్‌మెంట్‌కి)

    మొత్తం ప్రత్యక్ష పన్నులు          : 20,400

     

    ఏటా కట్టే పన్ను ఇదీ...

    మొత్తం ప్రత్యక్ష పన్నులు                   : 20,400

    నెల ఖర్చుల్లో మొత్తం పన్ను              : 48,000 (నెలకు 4,000 చొప్పున 12 నెలలు)

    ఏడాది ఖర్చుల్లో పన్ను                    : 65,700

    మొత్తం ఏడాదికి చెల్లించే పన్ను : 1,34,100
     

    మొత్తంగా చూస్తే.. ఏడాదికి రూ. 5 లక్షలు ఆదాయం ఆర్జించే సగటు ఉద్యోగి అందులో దాదాపు 30 శాతం – అంటే సుమారు రూ. 1.5 లక్షలు వివిధ పన్నుల కింద ప్రభుత్వాలకు కడుతున్నారని అంచనా వేయొచ్చు. ఇందులో ఇల్లు కొన్నపుడు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులు, కారు లేదా బైక్‌ కొన్నపుడు జీవిత పన్ను, వ్యాట్‌, వాటి బీమాలపై సేవా పన్ను, పిల్లలకు ప్రత్యేక కోచింగ్‌లు ఇప్పిస్తే సేవా పన్నలు వంటివన్నీ కలుపుకుంటే.. ఏటా కట్టే పన్ను ఇంకా పెరుగుతుంది కూడా.

    పన్ను ఆదాయం ప్రకారం తలసరి పన్ను లెక్క ఇదీ..: మనం ఒక్కొక్కరం ఎంత పన్ను కడుతున్నామనేది తెలుసుకోవడానికి.. తలసరి ఆదాయం తరహాలో తలసరి పన్నును లెక్కించి చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షల కోట్లు పన్ను ఆదాయం వస్తుందని అంచనాగా తాజా బడ్జెట్‌లో ప్రకటించింది. ప్రస్తుత భారతదేశ జనాభా దాదాపు 133 కోట్లు. మొత్తం పన్ను ఆదాయాన్ని జనాభా సంఖ్యతో భాగిస్తే.. కేంద్ర ప్రభుత్వానికి ఒక్కొక్కరు సగటున రూ. 15,000 పన్ను కడుతున్నట్లు లెక్క వస్తుంది. అలాగే.. రాష్ట్ర ప్రభుత్వానికీ అంతే స్థాయిలో మరో రూ. 15,000 పన్ను కడతారు. అంటే.. భారతీయులు కట్టే సగటు తలసరి పన్ను రూ. 30 వేలు. నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఒక కుటుంబం ఏడాదికి సగటున రూ. 1,20,000 పన్ను కడుతున్నట్లు అనుకోవచ్చు. భారతీయుల తలసరి ఆదాయం రూ. 1,00,000 దాటబోతోందని ఇటీవలి సామాజిక సర్వేలో ప్రకటించారు. అంటే.. రూ. 1 లక్ష తలసరి ఆదాయంలో రూ. 30 వేలు.. ఆదాయంలో 30 శాతం మొత్తాన్ని తలసరి పన్ను చెల్లిస్తున్నట్లు అనుకోవచ్చు.

    -పృథ్వీరాజ్‌, సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

    తప్పక చదవండి: ఈ ఆదాయాలకు పన్ను లేదు...

    ఏమేం పన్నులు కడుతున్నాం? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement