'జయ వారసుడు' హీరో అజిత్‌ ఎక్కడ? | Where is Thala Ajith Kumar? | Sakshi
Sakshi News home page

'జయ వారసుడు' హీరో అజిత్‌ ఎక్కడ?

Published Thu, Feb 9 2017 4:21 PM | Last Updated on Tue, Sep 5 2017 3:18 AM

'జయ వారసుడు' హీరో అజిత్‌ ఎక్కడ?

'జయ వారసుడు' హీరో అజిత్‌ ఎక్కడ?

భారీ రాజకీయ సంక్షోభం ఇప్పుడు తమిళనాడును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అన్నాడీఎంకే అధినేత్రి, జయలలిత నెచ్చెలి వీకే శశికళ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు సిద్ధమవుతుండగా.. చివరిక్షణంలో పన్నీర్‌ సెల్వం తిరుగుబాటు చేయడంతో తమిళనాట రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

జయలలిత మృతి తర్వాత తమిళనాట రాజకీయ శూన్యత ఏర్పడింది. ఇప్పుడు ఆమె రాజకీయ వారసత్వం కోసం శశికళ, పన్నీర్‌ సెల్వం హోరాహోరీగా తలపడుతున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఈ ఇద్దరు నేతలు ఎత్తులు-పైఎత్తులు వేస్తుండటంతో తమిళనాట సామాన్యులు బిత్తరపోతున్నారు. ఏ క్షణంలో ఏం జరగుతుందో తెలియక తికమక పడుతున్నారు.

ఈ సమయంలో పలువురు సినీ ప్రముఖులు సైతం మీడియా ముందుకొచ్చి తమ అభిప్రాయాన్ని చెప్పారు. ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ సైతం మౌనాన్ని వీడారు. ఆపద్ధర్మ సీఎం ఓపీఎస్‌కు మద్దతు పలికారు. కొందరి అధికార దాహం వల్లే ప్రస్తుత పరిస్థితి తలెత్తిందంటూ పరోక్షంగా శశికళను తప్పుబట్టారు.

కానీ జయలలిత మానసపుత్రుడిగా, రాజకీయ వారసుడిగా మీడియాలో ప్రచారమైన ప్రముఖ హీరో అజిత్‌ కుమార్‌ మాత్రం ఇంతవరకు పెదవి విప్పలేదు. జయలలిత మృతి తర్వాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నా.. ప్రస్తుతం రాజకీయ సంక్షోభం తారస్థాయికి చేరినా అజిత్‌ మాత్రం మౌనాన్ని ఆశ్రయించారు. జయలలిత తనను కొడుకులా చూసుకునేవారని గతంలో చెప్పిన అజిత్‌.. ఇప్పుడెందుకు మౌనాన్ని ఆశ్రయించారనే వాదన వినిపిస్తోంది. ఆయన మౌనంపై కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 'జయలలిత అతన్ని కన్నకొడుకులా చూసుకున్నది' అని సినీ వర్గాలు అంటున్నాయి.

గత ఏడాది సెప్టెంబర్‌లో జయలలిత ఆస్పత్రిపాలైనప్పుడు మొదట ఆమెను ఆస్పత్రిలో పరామర్శించింది అజితే. ఆయనను తన వారసుడిగా ప్రకటిస్తూ జయలలిత విలునామా కూడా రాశారని అప్పట్లో కథనాలు వచ్చాయి. జయ మరణం తర్వాత అజిత్‌ తెరముందుకు రాకుండా శశికళ అడ్డుకున్నదన్న కథనాలూ లేకపోలేదు. పన్నీర్‌ సెల్వం ముఖ్యమంత్రి అయితే.. ఆయన అజిత్‌ను ఆదరించే అవకాశముందన్న ప్రచారమూ జరిగింది.

అమ్మకు మద్దతుగా డీఎంకేను ఢీకొట్టిన అజిత్‌..!
ద్రావిడ రాజకీయాలంటే అన్నాడీఎంకే-డీఎంకే మధ్య బద్ధవైరమే గుర్తొస్తుంది. ఈ క్రమంలో అజిత్‌ ఓ అవార్డుల వేడుకలో నేరుగా డీఎంకేకు వ్యతిరేకంగా మాట్లాడటం గమనార్హం. సినిమాల్లో రాజకీయాలు తీసుకురావద్దంటూ డీఎంకే దిగ్గజం కరుణానిధిని ఉద్దేశించి ఆయన చేసిన ఈ ప్రసంగానికి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ లేచినిలబడి మరీ మద్దతు ప్రకటించారు.

జయలలిత స్ఫూర్తితోనే అజిత్‌ సిక్స్‌ప్యాక్..!
దివంగత నేత జయలలిత స్ఫూర్తితోనే అజిత్‌ మళ్లీ జిమ్‌కు వెళ్లడం ప్రారంభించాడట. 2015లో వేదాలం సినిమా విడుదల సందర్భంగా అమ్మను అజిత్‌ కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి జయలలిత వాకబు చేశారట. ఆమె ఇచ్చిన స్ఫూర్తితోనే జిమ్‌కు వెళ్లడం మొదలుపెట్టిన అజిత్‌.. తాజా సినిమా 'వివేకం' కోసం అందరూ ఆశ్చర్యపోయేలా సిక్స్‌ప్యాక్‌తో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement