చైనా ముందు భారత తుపాకులు తుస్సు.... | why is the indian army still using outdated assault rifles designed in the 1980s? | Sakshi
Sakshi News home page

చైనా తుపాకులను ఎక్కుపెడితే భారత్‌ ఏం చేస్తుంది?

Published Wed, Jul 5 2017 2:21 PM | Last Updated on Mon, Aug 13 2018 3:45 PM

సిక్కిం సరిహద్దుల్లో భారత్, చైనా దేశాలకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చైనాకు పోటీగా భారత్‌ మాటల తూటాలను పేలుస్తోంది.



న్యూఢిల్లీ: సిక్కిం సరిహద్దుల్లో భారత్, చైనా దేశాలకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చైనాకు పోటీగా భారత్‌ మాటల తూటాలను పేలుస్తోంది. యుద్ధానికి సై అంటే, సై అన్నట్లుగా మాట్లాడుతోంది. అదే చైనా తుపాకులను ఎక్కుపెడితే భారత్‌ ఏం చేస్తుంది ? తిరిగి తుపాకులను ఎక్కుపెడుతుందా? తల తిప్పుకొని పిక్కబలం చూపిస్తుందా? యుద్ధం జరుగుతుందని అనుకోలేముగానీ జరిగితే మాత్రం చైనా సైనికుల తుపాకీల ముందు మన సైనికుల తుపాకులు తుస్సుమనడం ఖాయం. ఎందుకంటే మన సైనికులు వాడుతున్న తుపాకులు ఏనాడో కాలం తీరిపోయినవి.

1988లో ప్రవేశపెట్టిన ఇన్సాస్‌ లేదా ‘ఇండియన్‌ స్మాల్‌ ఆర్మ్స్‌ సిస్టమ్స్‌ రైఫిల్స్‌’నే మన సైనికులు ఇప్పటికీ వాడుతున్నారు. అవి ఎప్పుడో కాలం తీరిపోయాయి. ఈ తుపాకులు తరచుగా జామ్‌ అవుతున్నాయని, తూటాలు పెట్టే మాగజైన్లకు పగుళ్లు పడుతున్నాయని, సియాచిన్‌లో వీటితో ప్రాణాలను పణంగా పెట్టి తంటాలు పడ్డామని భారత సైనికులు తమ పై అ«ధికారులకు ఎన్నోసార్లు  ఫిర్యాదులు చేశారు. చత్తీస్‌గఢ్‌లో ఈ ఇన్సాస్‌ తుపాకులలో మావోయిస్టులను సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నామని, ఆధునిక తుపాకులు కావాలంటూ మొరపెట్టుకున్న పారా మిలటరీ దళాలు ఘోష ఇప్పటికీ అరణ్య రోదనే అయింది. పైగా మావోయిస్టులు మన సైన్యాన్ని ఎదుర్కొనేందుకు ఏకే–47 తుపాకులు వాడుతున్నారు. కశ్మీర్‌లో కూడా ఈ రైఫిళ్లతో మిలిటెంట్లను ఎదుర్కోలేకపోతున్నామంటూ సైనికులు ఇప్పటికీ మొరపెట్టుకుంటూనే ఉంటున్నారు.

ఏకే–47 తుపాకులు
మావోయిస్టుల నుంచి, మిలిటెంట్ల నుంచి స్వాధీనం చేసుకున్న కొద్దిపాటి ఏకే–47 తుపాకులను భారత పారా మిలటరీ దళాలు వారిపైనే ఉపయోగిస్తూ వచ్చాయి. రష్యా తయారుచేసే ఈ తుపాకులను కలష్నికోవ్‌ రైఫిల్స్‌ అని కూడా పిలుస్తారు. ఈ తుపాకుల్లో ఎర్రర్‌ శాతం అతితక్కువగా  0.02 ఉండడంతో భారత సైనిక దళాలు, సైనిక ఉన్నతాధికారులు ఈ తుపాకులే కావాలంటూ ప్రభుత్వం వద్ద చాలాకాలం రొడపెట్టారు. తప్పనిసరై స్పందించిన భారత ప్రభుత్వం 2010 నుంచి 2013 మధ్య 67 వేల ఏకే–47 తుపాకులను దిగుమతి చేసుకొంది. మూడు లక్షల సీఆర్‌పీఎఫ్, 13 లక్షల భారత సైనికులకుగాను 67 వేల తుపాకులను దిగుమతి చేసుకుంటే ఏ బటాలియన్‌కు సరిపోతాయి.



ఇన్సాస్‌ తుపాకుల్లో మూడు శాతం ఎర్రర్‌
భారత సైనికులు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఇన్సాస్‌ తుపాకుల్లో ఎర్రర్‌ మూడు శాతం. అందుకే మన సైనికులు ఏకే 47 తుపాకులను డిమాండ్‌ చేస్తూ వచ్చారు. మన దేశానికి కావాల్సిన తుపాకులను మనమే అభివద్ధి చేసుకోవాలన్న లక్ష్యాన్ని చూపి భారత ప్రభుత్వం ఇన్సాస్‌ తుపాకులను అభివద్ధి చేసింది. దీనికోసం 50 కోట్ల డాలర్లకుపైగా ఖర్చయింది. నిధులు దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. మరోపక్క దేశీయంగా తుపాకులను అభివద్ధి చేయడం అన్న ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగా డీఆర్‌డీవో గతేడాది అభివద్ధి చేసిన ఎక్స్‌కాలిబర్‌ రైఫిళ్లను ఆధునిక అవసరాలకు తగినట్లుగా లేవన్న కారణంగా సైన్యం తిరస్కరించింది. పశ్చిమ బెంగాల్‌లోని ఇషాపూర్‌ రైఫిల్‌ ఫ్యాక్టరీ మరో రకం తుపాకులను కూడా మొన్నటికి మొన్న జూన్‌ నెలలో సైన్యం తిరస్కరించింది.

చైనాతో జరిగిన యుద్ధంలో
1962లో చైనాతో జరిగిన స్వల్పకాలిక యుద్ధంలో భారత సైనికులు ప్రాచీనకాలం నాటి ‘303 బోల్ట్‌ యాక్షన్‌ రైఫిళ్లు’ను ఉపయోగించారు. ఆ తుపాకులు కూడా అప్పటికే కాలం తీరిపోయాయి. అదే చైనా సైనికులు తమ దేశం అభివద్ధి చేసిన ఏకే–47రకం తుపాకులను ఉపయోగించి మన సైనికులను సులభంగా మట్టి కరిపించారు. దాన్ని తొలి గుణపాఠంగా తీసుకున్న భారత ప్రభుత్వం సైన్యం కోసం కొత్త రైఫిళ్లను అభివద్ధి చేయాలని నిర్ణయించి ఆ బాధ్యతను బెంగాల్‌లోని ఇషాపూర్‌ రైఫిల్‌ ఫ్యాక్టరీకి అప్పగించింది. బెల్జియం సైనికులు వాడుతున్న ఎఫ్‌ఎన్‌ ఫాల్‌ రైఫిల్‌ డిజైన్‌ కాపీ కొట్టి 7.62 ఎంఎం సెల్ఫ్‌ లోడింగ్‌ రైఫిళ్లను ఆ ఫ్యాక్టరీ తయారు చేసింది. అవి కూడా ఎంతో కాలం మనుగడ సాగించలేక పోయాయి. 1970 దశకం చివరలో వాటికి కాలం తీరిపోయింది.



శ్రీలంక శాంతిదళంలో
అంతర్యుద్ధంతో రగిలిపోతున్న శ్రీలంకలో శాంతియుత పరిస్థితులను నెలకొల్పే లక్ష్యంతో భారత సైన్యం 1987లో ఆ దేశంలోకి ప్రవేశించిన విషయం తెల్సిందే. రష్యాలో తయారైన ఏకే–47 తుపాకులతో పోరాడున్న ఎల్‌టీటీఈ మిలిటెంట్లను ఎదుర్కొనేందుకు వెళ్లిన భారత సైనికులు ఇషాపూర్‌ రైఫిల్‌ ఫ్యాక్టరీ తయారు చేసిన సెల్ఫ్‌లోడెడ్‌ రైఫిళ్లను ఉపయోగించారు. అప్పటికే దాదాపు 20 ఏళ్ల పాతవైన వాటిని ఉపయోగించడం వల్ల భారత సైనికులు ఎక్కువగా మరణించారు.

ఇన్సాస్‌ రైఫిళ్లు ఎలా వచ్చాయి?
ఇషాపూర్‌ సెల్ఫ్‌లోడెడ్‌ రైఫిళ్లను ఆధునీకరించాలని నిర్ణయించిన డీఆర్‌డీవో ఆ దిశగా కషి చేసింది. కొన్ని రైఫిళ్లను తయారు చేసింది. ఆ రైఫిళ్లు ట్రిగ్గర్‌ నొక్కిన వెంటనే వాటి బారెళ్లు ఆటోమేటిక్‌గా ఆకాశపైపు లేచిపోతున్నాయి. ఫీల్డ్‌ ట్రయల్స్‌ విఫలం అవడంతో వెంటనే వాటి తయారీని రద్దు చేశారు. ఆ తర్వాత పుణెలోని ‘ఆర్మామెంట్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌’ 5.56 ఎంఎం సామర్ధ్యంగల రైఫిళ్లను తయారు చేసింది. వాటినే ఇప్పుడు మనం ‘ఇన్సాస్‌’ రైఫిళ్లు అని పిలుస్తున్నాం. భారత సైనిక దళంలో ప్రత్యేక ఆపరేషన్లను నిర్వహించేందుకు మూడు పారా కమాండోల దళాలు ఉన్నాయి. వీటిని ‘స్పెషల్‌ ఫోర్సెస్‌’గా పేరు మార్చాలని నిర్ణయించి కూడా చాలాకాలమే అయినా పేరు మార్చలేక పోయారు. ఈ దళాలు కూడా ఇన్సాస్‌ రైఫిళ్లతోపాటు బ్రిటన్‌లో చౌకగా తయారైన రెండో ప్రపంచ యుద్ధం నాటి స్టెన్‌ గన్లను ఉపయోగిస్తున్నాయి.


ఆది నుంచి పాశ్చాత్య పోకడే
భారత ఆయుధాల తయారీ సంస్థలు ఎప్పుడు కూడా పాశ్చాత్య రైఫిళ్ల మోడళ్లను అనుకరిస్తూనే వచ్చాయి. ఒక్కోదేశ పరిస్థితులు ఒక్కో రకంగా ఉంటాయి. ఆయా దేశాల పరిస్థితులకు అనుగుణంగా ఆయుధాల ఉండడం ఎంతైనా అవసరం. భారత సైనికులు లడక్‌లో ఎల్తైన పర్వతాలపై, ఈశాన్య ప్రాంతాల్లో దట్టమైన అడవుల్లో, రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతాల్లో యుద్ధం చేయాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల స్వల్పదూరం వెళ్లే తేలికపాటి ఆయుధాలు సరిపోతే, కొన్ని చోట్ల సుధూర లక్ష్యాలను ఛేదించే బరువైన ఆయుధాలు అవసరమవుతాయి. యుద్ధ తంత్రంలో ఒక శత్రు సైనికుడిని చంపడం కంటే ఆ సైనికుడిని గాయపర్చడమే అవసరం. అప్పుడు మరో ఇద్దరు శత్రు సైనికులు గాయపడిన తమ సైనికుడిని మోసుకెళ్లాల్సి వస్తుంది. తద్వార యుద్ధ రంగం నుంచి ముగ్గురు శత్రు సైనికులను తప్పించినట్లు అవుతుంది. అందుకు తక్కువ సామర్థ్యం గల ఆయుధాలే అవసరం.

2011నాటి టెండర్లు ఏమయ్యాయి?
సియాచిన్‌ రణ క్షేత్రంలో ఇన్సాస్‌ రైఫిళ్ల వైఫల్యాన్ని ప్రత్యక్షంగా చూసిన భారత లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ ప్రకాష్‌ కటోచ్‌ ఈ విషయమై భారత ప్రభుత్వానికి స్వయంగా లేఖ కూడా రాశారు. ప్రభుత్వం సూచన మేరకు ఆయన ‘డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌’ హోదాలో 2004లో ఇజ్రాయెల్‌లో పర్యటించారు.

అక్కడ ఆయన ఇజ్రాయెల్‌ టవోర్‌ ఆయుధాలను ఎంపిక చేయగా, దశాబ్దం అనంతరం, అవి కూడా తక్కువ సంఖ్యలోనే భారత సైన్యానికి చేరాయి. ఈలోగా, 2011లో ‘మల్టీ కాలిబర్‌ అసాల్ట్‌ రైఫిల్స్‌’ కావాలంటూ భారత సైన్యం టెండర్లు ఆహ్వానించింది. వాటికి ఇప్పటికీ అతీగతీ లేవు. 2014లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి రక్షణ రంగానికి భారీ ఎత్తున బడ్జెట్‌లో నిధులు కేటాయించినా యుద్ధ విమానాలు, డ్రోన్‌ విమానాలపై శ్రద్ధ పెడుతున్నారు తప్ప ఇన్సాస్‌ రైఫిళ్ల ప్రత్యామ్నాయం గురించి ఆలోచించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement