అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కాశినాయన : మండలంలోని నరసన్నపల్లె గ్రామానికి చెందిన కనగాని రమణ (35) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో బుధవారం మృతి చెందాడు. ఎస్‌ఐ యోగేంద్ర తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు రమణ మద్యానికి బానిస అయ్యాడని, గత నాలుగు రోజులుగా ఇంటికి కూడా వెళ్లలేదని ఎస్‌ఐ పేర్కొన్నారు. గ్రామ సమీపంలోని తెలుగుగంగ కాలువ దగ్గర మృతదేహం ఉన్నట్లు బుధవారం స్థానికులు గుర్తించారని తెలిపారు. మృతదేహం సమీపంలో విషద్రావణం డబ్బా గుర్తించామని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతునికి భార్య రామసుధతోపాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ప్రైవేట్ మెడికల్ స్టోర్‌లో ప్రభుత్వ ఆసుపత్రి మందులు
మదనపల్లె రూరల్ : ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలోని మందులు ప్రైవేట్ మెడికల్ స్టోర్‌లో ప్రత్యక్షమయ్యాయి. బుధవారం రాత్రి జిల్లా ఆసుపత్రి అత్యవసర విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ సయ్యద్ హదీద్ ఈ విషయాన్ని గుర్తించి, రెడ్ హ్యాండెడ్‌గా మీడియాను తీసుకెళ్లి చూపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అతిసార వ్యాధిగ్రస్తులకు అందించే మెట్రోజెల్ ఐవి ఫ్యూజన్ సైలెన్ మందు ఆసుపత్రికి ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ మెడికల్ స్టోర్‌లో ఉన్నట్లు రోగి ద్వారా తెలుసుకున్నారు. వెంటనే అందుబాటులో ఉన్న విలేకరులను వెంట తీసుకొని ప్రైవేట్ మెడికల్ స్టోర్‌కు వెళ్లారు. ప్రైవేటు ఆసుపత్రిలో విక్రయిస్తున్న పారాసెటమాల్ ఐవి ఫ్యూజన్ సైలెన్ మందు డబ్బాలో, జిల్లా ఆస్పత్రిలో వినియోగిస్తున్న మెట్రోజల్ ఐవి సైలెన్ మందు బాటిల్‌ను ప్రత్యక్షంగా చూపించారు. ఈ విషయంపై ప్రైవేట్ మెడికల్ స్టోర్ సిబ్బందిని విలేకరులు ప్రశ్నించగా, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులు మందు వెనక్కి తీసుకొచ్చి ఇస్తే తాము చూసుకోకుండా ఉంచుకున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని మందులు ఈ విధంగా ప్రైవేట్ మైకల్ స్టోర్‌లో ఎలా ప్రత్యక్షమవుతున్నాయో అధికారులే సమాధానం చెప్పాల్సి ఉంది.


