హామీ ఏమైంది.. బాబూ..? | - | Sakshi
Sakshi News home page

హామీ ఏమైంది.. బాబూ..?

Jan 3 2026 7:04 AM | Updated on Jan 3 2026 7:04 AM

హామీ ఏమైంది.. బాబూ..?

హామీ ఏమైంది.. బాబూ..?

జేఏసీ నాయకుల ఆగ్రహం

రాజంపేటను.. రాజమ్మపల్లెగా

మార్చాలంటూ ప్లకార్డులతో నిరసన

రాజంపేట టౌన్‌ : గత సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు రాజంపేటను మండల స్థాయికి తీసుకొచ్చారని....మండల స్థాయికంటే ఓ పల్లె స్థాయికి తీసుకొచ్చి పుణ్యం కట్టుకోవాలంటూ జేఏసీ నాయకులు వ్యంగంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. శుక్రవారం పట్టణంలోని ఎన్‌జీఓ కార్యాలయం ఎదుట రాజంపేటను ‘రాజమ్మపల్లె’గా చేయాలని ప్లకార్డులు చేతపట్టి వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు చేసిన అన్నమయ్య జిల్లా విభజన వల్ల సమీప భవిష్యత్తులోనే రాజంపేటకు డివిజన్‌ స్థాయి కూడా లేకుండా పోయే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజంపేటకు జిల్లా కేంద్రం అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని అందువల్ల 1915వ సంవత్సరంలోనే బ్రిటీష్‌ పాలకులు సబ్‌ కలెక్టర్‌ హోదా కలిగిన రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేశారన్నారు. గతంలో 17 మండలాలతో ఉన్న రాజంపేట రెవెన్యూ డివిజన్‌ ఆ తరువాత 9 మండలాలకు వచ్చిందని, ఇప్పుడు చంద్రబాబు దుర్మార్గంగా చేసిన అన్నమయ్య జిల్లా విభజనతో రాజంపేట రెవెన్యూ డివిజన్‌ కేవలం 4 మండలాలకే పరిమితమైందన్నారు. వీరబల్లి, సుండుపల్లె మండలాలకు చెందిన వారు తమను రాయచోటి లేదా కడప రెవెన్యూ డివిజన్‌లో కలపమంటున్నారని, అదే జరిగితే రాజంపేటకు రెవెన్యూ డివిజన్‌, జిల్లా అటవీ శాఖ కార్యాలయం, జిల్లా కోర్టు, ఎంవీఐ కార్యాలయం, పోలీస్‌ సబ్‌డివిజన్‌ ఇలా పలుశాఖలకు చెందిన కార్యాయాలన్నీ కూడా ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల రాజంపేటలో అన్ని కార్యాలయాలు తీసివేసి ‘రాజంపేటను రాజమ్మపల్లె’గా చేసి చంద్రబాబు పుణ్యం కట్టుకోవాలని జేఏసీ నాయకులు వ్యంగంగా వేడుకున్నారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రవికుమార్‌, ప్రభాకర్‌, నందకిషోర్‌గౌడ్‌, రెడ్డయ్య, అబూబకర్‌, చల్లా సుధాకర్‌, నీలి ఈశ్వరయ్య, రాజశే ఖర్‌నాయక్‌, డిఎస్‌.రావు, రవీంద్రనాయుడు, సిద్దిఖ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement