ము‘క్యాష్‌’ రిటైల్‌ స్వారీ..! | KKR to follow Silver Lake | Sakshi
Sakshi News home page

ము‘క్యాష్‌’ రిటైల్‌ స్వారీ..!

Sep 10 2020 5:20 AM | Updated on Sep 10 2020 5:21 AM

KKR to follow Silver Lake - Sakshi

న్యూఢిల్లీ:  ఇప్పటిదాకా పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ గ్రూప్‌లోని డిజిటల్‌ వ్యాపార విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు ఇప్పుడు రిలయన్స్‌ రిటైల్‌లోనూ ఇన్వెస్ట్‌ చేసేందుకు లైను కడుతున్నారు. తాజాగా రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌)లో అమెరికాకు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ సిల్వర్‌లేక్‌ పార్ట్‌నర్స్‌ 1.75 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ. 7,500 కోట్లు వెచ్చించనుంది.

ఆర్‌ఆర్‌వీఎల్‌ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయాలు వెల్లడించింది. ‘ఈ పెట్టుబడుల ప్రకారం ఆర్‌ఆర్‌వీఎల్‌ విలువ సుమారు రూ. 4.21 లక్షల కోట్లుగా ఉంటుంది‘ అని పేర్కొంది. సిల్వర్‌లేక్‌ ఇప్పటికే జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1.35 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేసింది. రిలయన్స్‌ గ్రూప్‌ కంపెనీల్లో ఇది రెండో ఇన్వెస్ట్‌మెంట్‌.  ఈ డీల్‌కు నియంత్రణ సంస్థపరమైన అనుమతులు రావాల్సి ఉంది. రిలయన్స్‌ రిటైల్‌కు మోర్గాన్‌ స్టాన్లీ ఆర్థిక సలహాదారుగా ఉండగా .. సిరిల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్, డేవిస్‌ పోక్‌ అండ్‌ వార్డ్‌వెల్‌ న్యాయ సలహదార్లుగా ఉన్నారు. సిల్వర్‌ లేక్‌కు శార్దూల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ అండ్‌ కో, లాథామ్‌ అండ్‌ వాట్కిన్స్‌ లీగల్‌ అడ్వైజర్లుగా ఉన్నారు.  

12 వేల పైచిలుకు స్టోర్స్‌..
ఆర్‌ఆర్‌వీఎల్‌లో భాగమైన రిలయన్స్‌ రిటైల్‌ .. దేశవ్యాప్తంగా సూపర్‌మార్కెట్లు, కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ చెయిన్‌ స్టోర్స్, హోల్‌సేల్‌ వ్యాపారం, ఫ్యాషన్‌ అవుట్‌లెట్స్, ఆన్‌లైన్‌ నిత్యావసరాల స్టోర్‌ జియోమార్ట్‌ మొదలైన వాటిని నిర్వహిస్తోంది. సుమారు 7,000 పట్టణాల్లో 12,000 పైచిలుకు స్టోర్స్‌ ఉన్నాయి. రిటైల్‌ విభాగంపై ఆధిపత్యం సాధించే క్రమంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో తలపడేందుకు రిలయన్స్‌కు ఈ పెట్టుబడులు ఉపకరించనున్నాయి. ‘నికర రుణ రహిత సంస్థగా మారిన రిలయన్స్‌ గ్రూప్‌ అధిక వృద్ధి సాధించేందుకు ఈ వాటాల విక్రయం తోడ్పడగలదు. ఇదే సెగ్మెంట్‌లో మరిన్ని వాటాల విక్రయానికి దోహదపడగలదు‘ అని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ అనలిస్ట్‌ శ్వేతా పటోడియా అభిప్రాయపడ్డారు. రిటైల్‌ విభాగంలో వాటాల విక్రయం ఊహించిన దానికన్నా ముందుగానే చోటు చేసుకుంటోందని క్రెడిట్‌ సూసీ తెలిపింది. పెట్టుబడుల సమీకరణ మొదలైన నేపథ్యంలో ప్రణాళికల అమలుపై.. ముఖ్యంగా జియోమార్ట్‌పై ప్రధానంగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఫైనాన్షియల్‌ సేవల సంస్థ సిటీ ఒక నివేదికలో పేర్కొంది.

జియోలో సిల్వర్‌లేక్‌..
ఫేస్‌బుక్‌ తర్వాత జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన తొలి అమెరికన్‌ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ సిల్వర్‌లేక్‌. సుమారు రూ. 10,203 కోట్లతో రెండు విడతల్లో 2.08 శాతం వాటా కొనుగోలు చేసింది. ఆ తర్వాత కేకేఆర్, విస్టా, జనరల్‌ అట్లాంటిక్, గూగుల్‌ మొదలైనవి జియోలో ఇన్వెస్ట్‌ చేశాయి. ట్విట్టర్, ఎయిర్‌బీఎన్‌బీ, ఆలీబాబా, డెల్‌ టెక్నాలజీస్‌ వంటి పలు టెక్‌ దిగ్గజాల్లో సిల్వర్‌ లేక్‌ పెట్టుబడులు పెట్టింది.

కేకేఆర్‌కు కూడా రిలయన్స్‌ ఆఫర్‌...
జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టిన వారికి .. తమ రిటైల్‌ విభాగంలో కూడా ఇన్వెస్ట్‌ చేసేందుకు రిలయన్స్‌ ఆఫర్‌ ఇచ్చింది. దీనికి అనుగుణంగానే సిల్వర్‌లేక్‌ ఇన్వెస్ట్‌ చేస్తోంది. జియోలో ఇన్వెస్ట్‌ చేసిన మరో ఈక్విటీ సంస్థ కేకేఆర్‌ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 1.5 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.11,100 కోట్లు) పెట్టుబడులు పెట్టొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పెట్టుబడులతో రిలయన్స్‌ మార్కెట్‌ వేల్యుయేషన్‌లో (సుమారు రూ. 14 లక్షల కోట్లు) జియో ప్లాట్‌ఫామ్స్, రిలయన్స్‌ రిటైల్‌ వాటా ఏకంగా రూ. 9 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

లక్షల కొద్దీ చిన్న వర్తకులతో భాగస్వామ్యం ఏర్పర్చుకోవడంతో పాటు వినియోగదారులకు మరింత విలువైన సేవలు అందించే మా ప్రయత్నాల్లో సిల్వ ర్‌లేక్‌ కూడా భాగస్వామి కానుండటం సంతోషకర విషయం. ఈ రంగంలో టెక్నాలజీతో పెను మార్పులు తేవచ్చని విశ్వసిస్తున్నాం. భారతీయ రిటైల్‌ రంగానికి సంబంధించి మా ప్రణాళికలు అమలు చేయడంలో సిల్వర్‌లేక్‌ విలువైన భాగస్వామి కాగలదు‘.
– ముకేశ్‌ అంబానీ. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సీఎండీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement