విద్వేషమే విడదీసింది! కొరియన్‌ యుద్ధానికి కారణమెవరు? చివరకు మిగిలింది!

North Korea and South Korea are separated by hatred - Sakshi

ఉభయ దేశాల యుద్ధంలో లక్షలాది మంది బలి

కిమ్‌ వరుస క్షిపణి ప్రయోగాలతో ఉద్రిక్తతలు

ఉత్తర కొరియా. ప్రపంచంలో దూర్త దేశాల్లో ఒకటిగా అగ్రరాజ్యం అమెరికాతోపాటు యూరప్‌ దేశాలు గుర్తించిన దేశం. అమెరికా హెచ్చరికలను ఖాతరు చేయకుండా వరుస క్షిపణి ప్రయోగాలతో దూకుడు ప్రదర్శిస్తోంది. యథేచ్ఛగా ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. అణ్వాయుధాలకూ పదును పెడుతోంది. తమవైపు కన్నెత్తి చూస్తే ఖబడ్దార్‌ అంటూ ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ హెచ్చరిస్తున్నారు. అమెరికా–దక్షిణ కొరియా కూటమి సంయుక్తంగా సైనిక విన్యాసాలపై మండిపడుతున్నారు. తాజాగా 48 గంటల వ్యవధిలో రెండుసార్లు క్షిపణి ప్రయోగాలు జరిపారు! ఉభయ కొరియాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతుండటం ప్రపంచ దేశాలను ఆందోళన పరుస్తోంది. వీటి మధ్య ఇంతటి విద్వేషానికి కారణమేమిటి...?           
           
ఉత్తర, దక్షిణ కొరియాల శత్రుత్వానిది దశాబ్దాల చరిత్ర. స్వతంత్ర దేశమైన ఉమ్మడి కొరియా ద్వీపకల్పాన్ని 1910లో జపాన్‌ ఆక్రమించుకుంది. 1945 దాకా నిరంకుశ పాలనలో కొరియా మగ్గిపోయింది. జపాన్‌ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ పోరుబాట పట్టింది. కమ్యూనిస్టు నేత కిమ్‌ ఇల్‌–సంగ్‌ కొరియా విముక్తి కోసం మంచూరియా నుంచి జపాన్‌ సైన్యంపై గెరిల్లా యుద్ధం చేశారు. 1945లో రెండో ప్రపంచ యుద్ధం చివర్లో జపాన్‌ అధీనంలో ఉన్న కొరియాలోకి సోవియట్‌ సేనలు అడుగుపెట్టాయి.

38వ ప్యారలెల్‌ లైన్‌ దాకా దూసుకొచ్చాయి. దాని దిగువ ప్రాంతాన్ని అమెరికా స్వాధీనం చేసుకుంది. అలా కొరియా విభజనకు బీజం పడింది. 1945లో ప్యారలెల్‌ లైన్‌కు ఎగువన తమ అధీనంలోని కొరియా ప్రాంతంలో పాంగ్యాంగ్‌ రాజధానిగా సోవియట్‌ సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే ఉత్తర కొరియా. దిగువ ప్రాంతంలో అమెరికా సైనిక ప్రభుత్వాన్ని నెలకొల్పింది. అదే దక్షిణ కొరియా!

ప్రచ్ఛన్నయుద్ధం చిచ్చు
కొరియాకు స్వాతంత్య్రం ఇవ్వడానికి ఉమ్మడి వేదిక ఏర్పాటు చేయాలని సోవియట్‌ యూనియన్, మిత్రదేశాలు భావించాయి. ప్రపంచాధిపత్యం కోసం అమెరికాతో సాగిన ప్రచ్ఛన్న యుద్ధంలో ఉత్తర కొరియా మద్దతు కోసం అక్కడి కమ్యూనిస్టులను సోవియట్‌ ప్రోత్సహించింది. దాని అండతో కిమ్‌ ఇల్‌ సంగ్‌ పెద్ద నేతగా అవతరించాడు. 1948లో ప్రధానిగా పీఠమెక్కాడు. అనంతరం సోవియట్‌ సేనలు ఉత్తర కొరియాను వీడాయి. మరోవైపు దక్షిణ కొరియాలో అమెరికా సైన్యం కమ్యూనిస్టులను కఠినంగా అణచివేసింది. అమెరికాలో చదివిన కమ్యూనిస్టు వ్యతిరేకి సైంగ్‌ మాన్‌ రీ కి మద్దతిచ్చింది.

1948లో జరిగిన ఎన్నికల్లో సైంగ్‌మాన్‌ రీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1949లో అమెరికా సైన్యం దక్షిణ కొరియా వీడింది. అక్కడి నుంచి ఇరు కొరియాల మధ్య కొట్లాటకు బీజం పడింది. కొరియా ద్వీపకల్పం మొత్తాన్ని తామే పాలిస్తున్నామని, ఉభయ ప్రభుత్వాలు వాదించడం మొదలుపెట్టాయి. కిమ్‌ ఇల్‌ సంగ్‌ నాటి సోవియట్, చైనాల్లోని కమ్యూనిస్టు పాలకులు స్టాలిన్, మావోల మద్దతు కోరారు. ఇటు సైంగ్‌ మాన్‌ రీ కూడా ఉత్తర కొరియాను జయించాలన్న ఆకాంక్షలను దాచుకోలేదు. ఇది కొరియన్‌ యుద్ధానికి దారితీసింది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top