తుమకూరు: తుమకూరు నగర నియోజకవర్గం బీజేపీకి భద్ర కోటె అయినా కూడా ఇప్పుడు కష్టకాలం ఎదురైంది. మూడు ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కానీ ఇద్దరు బలమైన నాయకులు రెబెల్స్‌గా బరిలోకి దిగడంతో పోటీ ఉత్కంఠగా మారింది. తుమకూరు అనగానే గుర్తుకొచ్చేది ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, సిద్దగంగ మఠం. విద్యా, ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ నగరం విలసిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు దగ్గరగా ఉండడంతో తెలుగువారి జనాభా, ఆ సంస్కృతి ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటోంది.
అభ్యర్థులు వీరే
తుమకూరు నగర నియోజకవర్గంలో ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే జ్యోతి గణేష్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్లీ ఆయనకే టికెట్ దక్కింది. జేడీఎస్ నుంచి గత 2018లో పోటీ చేసిన ఓడిన గోవిందరాజు, కాంగ్రెస్ నుంచి ఇక్బాల్ అహ్మద్‌లకు టికెట్లు వచ్చాయి. బీజేపీ రెబెల్ అభ్యర్థిగా మాజీ మంత్రి సొగడు శివణ్న, మరో సీనియర్ నేత నరసెగౌడతో పాటు సుమారు 14 మంది ఈ ఎన్నికల్లో ఉన్నారు.
ఆది నుంచి బీజేపీ ఆధిక్యం
తుమకూరు నగర నియోజకవర్గం 1994 నుంచి 2014 వరకు కూడా సుమారు 20 సంవత్సరాల పాటు బీజేపి ఆధీనంలో ఉంది. ఒకసారి కాంగ్రెస్ గెలుపొందగా, 2018లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ బీజేపీ చేజిక్కించుకుంది. 2018లో బీజేపీ అభ్యర్థి జ్యోతి గణేష్ జేడీఎస్‌పైన గెలిచారు, కాంగ్రెస్ పార్టి మూడవ స్థానంలో నిలిచింది. ఈ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. గత శాసనసభ ఎన్నికల్లో రెండవ స్థానంలో నిలిచిన జేడీఎస్ అభ్యర్థి గోవిందరాజు మళ్లీ పోటీకి వచ్చారు. నియోజకర్గంలో చేసిన అభివృద్ధి పనులు గెలిపిస్తాయని ఎమ్మెల్యే జ్యోతిగణేష్ చెబుతున్నారు.
కాషాయానికి సొగడు సెగ
ఇక రెబెల్ సొగడు శివన్న సుమారు 20 సంవత్సరాల పాటు ఇక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. 2018లో హైకమాండ్ వినతి మేరకు టికెట్ వదులుకున్నారు, ఈసారి వస్తుందనుకుంటే రాలేదు. ప్రజలు తనకు న్యాయం చేయాలని ఆయన ఇంటింటికీ వెళ్లి ఓట్లు ఆడుగుతున్నారు. జేడీఎస్ సీనియర్ నేత నరసెగౌడ కూడా టికెట్ లభించక తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ అహ్మద్ పార్టీకి పాత అయినా కూడా నియోజకవర్గానికి కొత్త ముఖం కావడంతో ఎంతమాత్రం ఓట్లు పడతాయి అనే అనుమానం ఉంది. పైగా స్థానిక నేతలు చాలామంది ఆయనకు సహకరించడం లేదు. రెబెల్స్ వల్ల ఏ పార్టీ పుట్టి మునుగుతుందోనని ఆందోళన నెలకొంది.
ఓటర్లు 2.55 లక్షలు
నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,55,018 మంది కాగా, ఇందులో 1,25,169 మంది పురుషులు, 1,29,823 మంది సీ్త్రలు, 26 మంది ఇతరులు ఉన్నారు. లింగాయత, ఒక్కలిగ, కురుబ, మైనారిటీల ఓట్లు అధికం.
Comments
Please login to add a commentAdd a comment