వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
భద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ పరిధి విద్యాసంస్థల్లో పదో తరగతి విద్యార్థులపై ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్ట్ ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సూచించారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్లు, హెచ్‌ఎంలు, వార్డెన్లతో శుక్రవారం సమావేశమైన ఆయన మాట్లాడుతూ వెనకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు. స్పెషల్ ఆఫీసర్లు, హెచ్‌ఎంలు కేటాయించిన పాఠశాలల్లో వారానికి రెండుసార్లు తనిఖీ చేస్తూ ఫొటోలు అప్‌లోడ్ చేయాలని పేర్కొన్నారు. అలాగే, ఉద్దీపకం వర్క్‌బుక్ నిర్వహణ, కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అమలుపై సూచనలు చేశారు. కాగా, సర్వారం, ఎలిసిరెడ్డిపల్లి, కమలాపూర్, రేగళ్ల తండా, బొజ్జాయిగూడెం, పాల్వంచ, పాత ఇల్లెందు, గొందిగూడెంతో పాటు ఖమ్మంలోని కొన్ని పాఠశాలల్లో గత ఏడాది పదో తరగతి ఫలితాలు ఆశించిన స్థాయిలో రానందున ఈసారి ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పీఓ స్పష్టం చేశారు. తొలుత పీఓ కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో ఏపీఓ(జనరల్) డేవిడ్‌రాజ్, వివిధ విభాగాల అధికారులు మధుకర్, అశోక్, విజయలక్ష్మి, రమేష్, శ్రీరాములు, సత్యవతి, రాధమ్మ, భారతీదేవి, అలివేలు మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్


