అనిల్‌ కపూర్‌ కుమార్తె సొనమ్‌ కిడ్నాప్ | Anil Kapoors Daughter Kidnapped As Part Of AK VS AK Movie | Sakshi
Sakshi News home page

అనిల్‌ కపూర్‌ కుమార్తె సొనమ్‌ కిడ్నాప్

Dec 30 2020 8:23 AM | Updated on Dec 30 2020 11:54 AM

Anil Kapoors Daughter Kidnapped As Part Of AK VS AK  Movie - Sakshi

కుమార్తె కిడ్నాప్‌ అయితే ఏ తండ్రి అయినా చాలా ఆందోళన చెందుతాడు. అనిల్‌ కపూర్‌ మీద కక్షతో దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ అతని కుమార్తె సోనమ్‌ కపూర్‌ను కిడ్నాప్‌ చేశాడు. అతని నుంచి అనిల్‌ కపూర్‌ తన కుమార్తె ను ఎలా రక్షించుకున్నాడు?ఇది నిజంగా జరగలేదు. కాని నిజంలా జరిగింది. దానినే ఇప్పుడు ‘మెటా మూవీ’, ‘ఫిల్మ్‌ వితిన్‌ ఏ ఫిల్మ్‌’, ‘మాక్యుమెంటరీ’ అంటున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్‌గా విడుదలైన ఈ సినిమా తండ్రి అనిల్‌ కపూర్‌ ఎలా ఉంటాడో అన్న ఆనవాలు ఇచ్చి ఆశ్చర్యపరుస్తుంది.‘ఏకె వెర్సెస్‌ ఏకె’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తాజాగా విడుదలైన సినిమా. ఇందులో ఒక ఏకె అనిల్‌ కపూర్‌. మరో ఏకె అనురాగ్‌ కశ్యప్‌. ఒక హీరో ఒక దర్శకుడి మధ్యలో వచ్చిన తగాదా ఆ హీరో కుమార్తెను ఆ దర్శకుడు కిడ్నాప్‌ చేసే వరకూ వెళుతుంది. ఇది సినిమాయే అయినా అందరూ ఇందులో తమలాంటి ఫిక్షనల్‌ పాత్రలనే పోషించారు. 

సినిమాలో అనిల్‌ కపూర్‌ నిజం అనిల్‌ కపూర్‌లా, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ నిజం అనురాగ్‌ కశ్యప్‌లా నటించారు. ఇరువురు వారి వారి ఒరిజినల్‌ కెరీర్‌ల మీద పంచ్‌లు విసురుకుంటారు. ఒకరినొకరు తిట్టుకుంటారు. కొట్టుకుంటారు. అదంతా నిజంగా జరుగుతున్నట్టుగా కెమెరాలో రికార్డు చేసి అనురాగ్‌ కశ్యప్‌ విడుదల చేసినట్టుగా ఉంటుంది ఈ సినిమా. ఇది పూర్తిగా కొత్త నేరేటివ్‌. డాక్యుమెంటరీలా అనిపించే సినిమా. లేదా సినిమాలా అనిపించే డాక్యుమెంటరీ. ఆశ్చర్యం ఏమిటంటే ‘మీ అమ్మాయిని కిడ్నాప్‌ చేశాను’ అని వచ్చి దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ చెప్పినప్పటి నుంచి అంత పెద్ద హీరో అనిల్‌ కపూర్‌ ఒక సగటు తండ్రిలా స్పందిస్తాడు. పోలీస్‌ స్టేషన్‌కు వెళితే అతను చెప్పేది ఎవరూ నమ్మరు. ఇంటికి వచ్చి ఆ విషయం ఎలా చెప్పాలో తెలియదు. కిడ్నాపర్‌ అయిన అనురాగ్‌ కశ్యప్‌ ‘నువ్వొక్కడివే నీ కూతురుని కనుగొనాలి’ అని కండీషన్‌ పెట్టడంతో అనిల్‌ కపూర్‌ ఒక్కడే బయలుదేరుతాడు. అతన్ని నీడలా అనురాగ్‌ కశ్యప్‌ అనుసరిస్తాడు కెమెరాతో. 

కూతురి కోసం కలవరపడిపోయే తండ్రిలా అనిల్‌ కపూర్‌ ఆకట్టుకుంటాడు. అరవై ఏళ్ల వయసులో నిజంగా పరిగెత్తి, కిందపడి, ఒక తండ్రి ఎలా ప్రాధేయపడతాడో అలాగే ప్రాధేయపడతాడు. చివరకు ఏమైందనేది సినిమా చూస్తే తెలుస్తుంది. విక్రమాదిత్య మోత్వానే దీని దర్శకుడు. అనురాగ్‌ కశ్యప్‌ నటించి డైలాగులు కూడా రాశాడు. ‘వీడి హిట్‌ సినిమాలు తెచ్చిన కలెక్షన్లన్నీ కలిపి వీడి తమ్ముడి ఒక్క ఫ్లాప్‌ సినిమా తెచ్చింది’ అని అనిల్‌ కపూర్‌ అనురాగ్‌ కశ్యప్‌ను వెక్కిరిస్తాడు. మన మీద మనం జోక్‌ చేసుకోవడం ఎదగడానికి గుర్తు. అనురాగ్‌ కశ్యప్, అనిల్‌ కపూర్‌ ఎదిగి చేసిన సినిమా ఇది. ప్రయోగాలు నచ్చేవారు చూడాల్సిన సినిమా ఇది. 

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement