బిగ్‌ బాస్‌: సెల‌బ్రెటీల‌కు ఒరిగిందేంటి? | Special Story On Bigg Boss Telugu Contestants | Sakshi
Sakshi News home page

బిగ్‌ బాస్‌: సెల‌బ్రెటీల‌కు ఒరిగిందేంటి?

Published Sun, Oct 4 2020 9:06 AM | Last Updated on Sun, Oct 4 2020 5:17 PM

Special Story On Bigg Boss Telugu Contestants - Sakshi

వెబ్‌ ప్రత్యేకం : బిగ్ బాస్‌.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. ప్రపంచ టెలివిజన్ రంగంలో భారీ సక్సెస్ షో గా నిలిచిన ఈ బిగ్ బాస్ షో తెలుగు, తమిళం‌, హిందీ, కన్నడం, మలయాళం.. ఇలా అన్ని భాషల్లోనూ తనదైన మార్క్‌ చూపిస్తోంది. తెలుగులో ఇప్పటికే మూడు సీజ‌న్స్ కంప్లీట్ చేసుకున్న బిగ్‌బాస్ షో.. నాలుగో సీజ‌న్‌ను కూడా విజయవంతంగా కొనసాగిస్తోంది. అయితే బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో అలరించే ఈ రియాల్టీ షో.. విన్నర్స్‌ నుంచి కంటెస్టెంట్స్‌ వరకు ఎంతమందికి, ఎంతవరకు యూజ్‌ అయింది? వారి కెరీర్‌కి ఎంత హెల్ప్‌ అయింది ? ఈ షోలో పాలుపంచుకొన్న సెల‌బ్రెటీల‌కు ఒరిగిందేంటి? వాళ్ల ఇమేజ్‌లు ఏమైనా మారాయా? కొత్త‌గా అవ‌కాశాలు వ‌స్తున్నాయా?లాంటి విషయాల్లోకి వెళ్తే..

బిగ్‌బాస్‌’ ని కెరీర్‌ గ్రోత్‌కి యూజ్‌ చేసుకోవాలి. సహజంగా కంటెస్టెంట్స్‌ ఆలోచన ఇదే. కంటెస్టెంట్స్‌ అంతా సెలబ్రిటీలే కాబట్టి వారి ఇమేజ్‌తో షోని సక్సెస్‌ చేసుకోవాలి. బిగ్‌బాస్‌ స్ట్రాటజీ ఇదే. ఇందులో ఇప్పటి దాకా బిగ్‌బాస్‌ యూనిట్‌ గెలుస్తూ వచ్చింది. ఎందుకంటే మూడు సీజన్స్‌లో విన్నర్స్‌ కానీ, కంటెస్టెంట్స్‌ కానీ హౌస్‌‌ నుంచి బయటకొచ్చిన తర్వాత పెద్దగా సాధించిందేమీ లేదు. వాళ్ల కెరీర్‌కి షో ప్లస్‌ అయిందీ లేదు. 


ఫస్ట్‌ విజేతకే కలిసి రాలేదు
ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌ బాస్‌ సీజన్‌ 1లో కత్తి మహేష్‌, హరితేజ, శివ బాలాజీ,  అర్చన, సమీర్, ముమైత్  ఖాన్, ప్రిన్స్, సింగర్ మధుప్రియ, సంపూర్ణేష్ బాబు, జ్యోతి, సింగర్ కల్పన, కత్తి కార్తీక, ఆదర్శ్, ధనరాజ్, దీక్ష(వైల్డ్ కార్డ్), నవదీప్ (వైల్డ్ కార్డ్) పాల్గొన్నారు. 70 రోజుల పాటు కొనసాగిన ఈ రియాల్టీ షోలో శివ బాలాజీ విజేతగా నిలిచాడు. నిజానికి బిగ్ బాస్‌లో పాల్గొనే నాటికే శివ బాలాజీ హీరోగా ప్రేక్షకులకు సుపరిచితం. బిగ్‌ బాస్‌తో మరింతగా ఆడియన్స్‌కి దగ్గరైయ్యాడు. ఆ సీజన్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. కానీ… ఆ తర్వాత శివ బాలజీ కెరీర్‌ ఏమీ మలుపు తిరిగిపోలేదని ఫిలింనగర్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పెద్ద పెద్ద అవకాశాలతో ఆయనేం బిజీ అయ్యిందీ లేదు.

ఇక ముమైత్‌ ఖాన్‌, ప్రిన్స్‌, నవదీప్‌,సంపూర్ణేష్‌ బాబు, కత్తి మహేష్‌ లాంటి వాళ్లకు బిగ్‌ బాస్‌ కలిసి రాలేదనే చెప్పాలి. కత్తి మహేష్.. బిగ్ బాస్ షో కంటే పవన్‌పై విమర్శల ద్వారానే ఎక్కువ పాపులర్ అయ్యారు. ఇక ఈ సీజన్‌లో కాస్తో కూస్తో లాభ పడింది ఎవరైనా ఉన్నారు అంటే అది హరితేజ అనే చెప్పాలి. మిగతా కంటెస్టెంట్స్‌తో పోల్చుకుంటే హరితేజ తరచూ సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల మహేష్‌ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలోనూ ఆమెకు కీలక పాత్ర దక్కింది. అలాగే  వివిధ సినీ ఫంక్షన్లలోనూ యాంకరింగ్‌తో మెప్పిస్తుంది. 

తేజస్వీ ఇమేజ్‌ డ్యామేజ్‌
బిగ్‌బాస్‌ సీజన్‌2లో గీతా మాధురి, అమిత్ తివారీ, దీప్తి, తనీష్, బాబు గోగినేని, భాను శ్రీ, రోల్ రైడా, యాకర్ శ్యామల, కిరీటి, దీప్తి సునైనా, కౌశల్, తేజస్వి, గణేష్, సంజనా అన్నే, నూతన్ నాయుడు, నందినిలు పాల్గొన్నారు. వీరిలో ఏ ఒక్కరికి కూడా ‘బిగ్‌ బాస్‌’ యూజ్‌ కాలేదు. పైగా ఈ షో వల్ల వారికున్న కాస్త ఇమేజ్‌ కూడా డ్యామేజ్‌ అయింది. ముఖ్యంగా తేజస్వికి అయితే బిగ్‌ బాస్‌ షో కలిసే రాలేదు. ఈ రియాల్టీ షోలో పాల్గొనేకంటే ముందే  చిన్నా చితకా సినిమాల్లో నటించిన ఆమెకి ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. అయితే బిగ్ బాస్ ఎంట్రీ తరువాత ఈ అమ్మడు ఇమేజ్ ఒక్కసారిగా తలక్రిందులు అయ్యింది. కోలుకోలేని డ్యామేజ్ అయ్యింది. ఆ తర్వాత ఏ ఒక్క చాన్స్‌ రాలేదు. యాంకర్‌గా అవతారమెత్తినా సక్సెస్‌ కాలేకపోయింది.


కౌశల్‌కీ కలిసి రాలేదు
 ఇక బిగ్‌ బాస్‌ 2 విన్నర్‌ కౌశల్‌ పరిస్థితి అయితే మరీ దారుణం. షో జరిగినన్ని రోజులు కౌశల్‌ పేరు మారుమోగింది. కౌశల్‌ ఆర్మీ పేరుతో యువత హల్‌చల్‌ చేశారు. బిగ్‌బాస్‌ షోలో ఏ కంటెస్టెంట్‌కు రాన్నంత ఇమేజ్‌ కౌశల్‌కు వచ్చింది. బిగ్‌బాస్ విజేతగా కౌశల్ గెలిచిన తర్వాత అతడికి వరుసగా విలన్ ఆఫర్స్ అంటూ సోషల్ మీడియాలో తెగ పుకార్లు షికార్లు చేసాయి. బోయపాటి శ్రీను, రామ్ చరణ్ సినిమా ‘వినయ విధేయ రామ’లో ముఖ్యపాత్రలో కౌశల్ నటించే ఛాన్స్ కొట్టేసాడాని చెప్పుకున్నారు. అంతేకాదు బోయపాటి శ్రీను,బాలయ్య సినిమాలో ఇంపార్టెంట్ రోల్‌కు కౌశల్‌ను తీసుకున్నారంటూ రకరకాలు వార్తలు పుట్టుకొచ్చాయి. అంతేకాదు అతడిని హీరోగా పెట్టి సినిమాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.  కట్ చేస్తే..బిగ్‌బాస్ 2 విజేతగా నిలిచిన తర్వాత కౌశల్.. ఒకటి రెండు నెలలు మాత్రం కొన్ని షాప్ ఓపెనింగ్స్‌కు రిబ్బన్ కటింగ్‌లు, టీవీ చానెల్స్‌లో ఇంటర్వ్యూలు తప్పించి పెద్దగా కౌశల్ సాధించిదేమి లేదు.  బిగ్‌ బాస్‌ ఇమేజ్‌ కొన్నాళ్ల వరకే ఉంది. ఆ తర్వాత కౌశల్‌ కనుమరుగైపోయాడు. ఇటు బ్రేక్‌ వచ్చేసింది అని చెప్పుకునే స్థాయిలో సినిమా అవకాశాలు కూడా రాలేదు.

ఇక మరో కంటెస్టెంట్‌ దీప్తి సునైనాకు బిగ్ బాస్ హౌస్‌కి రాకముందు యూట్యూబ్ సంచలనంగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. కాని హౌస్‌కి వచ్చిన తరువాత ఆమె తనీష్‌తో ప్రేమ వ్యవహారం, అతడితో రొమాన్స్ కారణంగా ఆమెకు ఉన్న ఇమేజ్‌ మొత్తం డ్యామేజ్‌ అయింది.


మరో కంటెస్టెంట్ బాబు గోగినేని పరిస్థితి కూడా అంతే. హౌస్‌లోకి రాకముందు ప్రముఖ హేతువాదిగా టీవీ కార్యక్రమాల్లో ప్రచారం పొందిన ఆయనకు బిగ్ బాస్‌ చేదు అనుభవాన్నే మిగిల్చాడు. సోషల్ మీడియాలో ఆయనపై నెగెటివ్‌ ట్రోల్స్‌ వచ్చాయి. ఇక ఆయన మీడియాలో కానీ, సోషల్‌ మీడియాలో కనిపించడం అరుదైపోయింది. తనీష్, సామ్రాట్, నందినిలకు కూడా పెద్ద బ్రేక్‌ వచ్చిందేమి లేదు. బిగ్ బాస్ హౌస్‌లో సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు, గణేష్ లాంటి వాళ్లను బిగ్ బాస్ తరువాత జనం గుర్తించడమే మానేశారు. ఇటీవల నూతన్‌ నాయుడు ఓ వివాదం వల్ల కాస్త వార్తల్లో నిలిచాడు. 

రాహుల్‌కు బెంజ్‌ కొన్నాడు కానీ... 
కింగ్‌ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌ బాస్‌ సీజన్‌ 3లో రాహుల్‌ సిప్లిగంజ్‌, యాంకర్‌ శ్రీముఖి, యాంకర్ శివజ్యోతి, టీవీ నటుడు రవికృష్ణ, అశురెడ్డి, జర్నలిస్ట్ జాఫర్,నటి హిమజ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, టీవీ నటి రోహిణి, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, పునర్నవి భూపాలం, నటి హేమ, అలీ రజా, మహేశ్ విట్టా, యాంకర్ శ్రీముఖి, హీరో వరుణ్ సందేశ్, వితికా షెరు, యాంకర్ శిల్పా చక్రవర్తి (వైల్డ్ కార్డ్) పాల్గొన్నారు. వీరిలో బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 టైటిల్‌ని రాహుల్‌ సిప్లిగంజ్‌ గెల్చుకున్నాడు. బిగ్‌ బాస్‌ తర్వాత రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆర్థిక పరిస్థితిలో మార్పు వచ్చింది. బెంజ్‌ కారు కొనేదాకా ఆయన ఆర్థిక స్థాయి వచ్చింది. కానీ  బ్రేక్‌ వచ్చే స్థాయిలో కెరీర్‌ పరంగా అద్భుతాలు ఏం జరగలేదని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఇక  బిగ్ బాస్ 3 రన్నరప్ శ్రీముఖికి కూడా పెద్ద బ్రేక్‌ వచ్చిందేమి లేదు. షోలో పాల్గొనడానికి ముందే ఆమె స్టార్‌ యాంకర్‌. బిగ్‌ బాస్‌ విన్నర్‌ కంటే ఎక్కువే డబ్బులు తీసుకెళ్లింది కానీ, కెరియర్‌ పరంగా ఆమెకు బిగ్‌ బాస్‌ ఏరకంగా ఉపయోగపడలేదు. ఇక శివ జ్యోతి అయితే సొంతింటి కలను నిజం చేసుకుంది కానీ కెరియర్‌ పరంగా మాత్రం అలాగే కొనసాగుతోంది.  సొంతంగా యూట్యూబ్‌ చానెల్‌ను పెట్టుకొని తనకొచ్చిన ఇమేజ్‌ను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. మిగిలిన కంటెస్టెంట్స్‌లో కూడా ఏ ఒక్కరికి బిగ్‌బాస్‌ వల్ల పెద్దగా ఒరిగిందేమి లేదనే చెప్పాలి.  


ఈ సారైనా కలిసొచ్చేనా
బిగ్‌ బాస్‌ షో లో పాల్గొనడం వల్ల అవకాశాలు వచ్చిన వాళ్లు ఉన్నారు. ఇమేజ్‌ని పెంచుకున్న వాళ్లు ఉన్నారు. కానీ కెరీర్‌ని మలుపు తిప్పే స్థాయిలో ఎవరికీ బ్రేక్‌ రాలేదన్నది సినీ పరిశ్రమ వర్గాల మాట. ఓవరాల్‌గా బిగ్ బాస్ వల్ల కంటెస్టెంట్స్‌కి ఒరిగింది ఏదైనా ఉందా అంటే సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్స్, వ్యక్తిగత దూషణలు తప్ప కెరియర్ పరంగా బిగ్ బాస్ హెల్ప్ కావడం లేదనే చెప్పాలి.  మరి బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 నుంచి సీన్‌ మారుతుందా? లేదా గత సీజన్ల మాదిరే కంటెస్టెంట్ల కెరియర్‌ గ్రోత్‌కు ఉపయోగపడకుండా పోతుందా అని తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement