Sakshi News home page

Atiq Ahmed Murder:ఫేమస్ కావాలనే అతీక్‌ను కాల్చి చంపాం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు..

Published Sun, Apr 16 2023 9:20 AM

Atiq Ahmed Murder Case Accused Killed Him To Become Famous - Sakshi

లక్నో: యూపీ గ్యాంగ్‌స్టర్‌, పొలిటీషియన్‌ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లను  మీడియా, పోలీసుల సాక్షిగా ముగ్గురు యువకులు శనివారం రాత్రి పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చిచంపిన విషయం తెలిసిందే. వీరిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నిందితులను బాందాకు చెందిన లవ్లేశ్‌ తివారీ(22), హమీర్‌పూర్‌కు చెందిన మోహిత్‌ అలియాస్‌ సన్నీ(23), కాస్‌గంజ్‌కు చెందిన అరుణ్‌ మౌర్య(18)గా గుర్తించారు.

ఈ ముగ్గురిని అరెస్టు చేసి  విచారించగా.. ఫేమస్ కావాలనే అతీక్ అహ్మద్‌ను షూట్ చేసినట్లు వీరు పోలీసులకు తెలిపారు. అందుకే పక్కా ప్లాన్ ప్రకారం పిస్టళ్లలో వెళ్లి కాల్చి చంపినట్లు పేర్కొన్నారు. కాల్పుల అనంతరం ముగ్గురు యువకులు ఘటనా స్థలంలో జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు.

అతీక్‌పై 100కు పైగా క్రిమినల్‌ కేసులున్నాయి. 2005 నాటి బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్‌ హత్యకు ప్రధాన సాక్షి ఉమేశ్‌పాల్‌ను హత్య చేసిన కేసులో విచారణ నిమిత్తం అతీక్‌ సోదరులను పోలీసులు ఇటీవలే అహ్మదాబాద్‌ సెంట్రల్‌ జైలు నుంచి ప్రయాగ్‌రాజ్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 

14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి నిందితులు 
గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌ హత్య కేసులో ముగ్గురు నిందితులను 14 రోజులపాటు జ్యుడీíÙయల్‌ కస్టడీకి తరలిస్తూ ప్రయాగ్‌రాజ్‌ కోర్టు ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. అతీక్‌ అహ్మద్, అష్రాఫ్‌ అహ్మద్‌ హత్య ఘటనపై దర్యాప్తు కోసం ప్రభుత్వం కమిషన్‌ ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేసింది.  

చట్ట ప్రకారమే శిక్షించాలి: కాంగ్రెస్‌ 
నేరగాళ్లకు కఠిన శిక్షలు విధించాలని, కానీ, అది చట్టప్రకారమే జరగాలని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది. దేశంలో అమల్లో ఉన్న చట్టాలకు లోబడే శిక్షలు ఉండాలని పేర్కొంది. రాజకీయ లబ్ధి కోసం చట్టాన్ని అతిక్రమించడం ప్రజాస్వామ్యానికి ముప్పేనని తేలి్చచెప్పింది. అతీక్‌ అహ్మద్, అష్రాఫ్‌ హత్యల నేపథ్యంలో కాంగ్రెస్‌ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. నేరస్థులకు శిక్షలు విధించడానికి న్యాయస్థానాలు ఉన్నాయని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గుర్తుచేశారు. 

మన్మోహన్‌ ప్రభుత్వాన్ని కాపాడినవారిలో అతీక్‌ 
అమెరికాతో అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ 2008లో అప్పటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించాయి. లోక్‌సభలో యూపీఏ సర్కారు సంఖ్యాబలం 228కి పడిపోయింది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో గట్టెక్కాలంటే మరో 44 మంది ఎంపీల మద్దతు అవసరం. ప్రభుత్వాన్ని కాపాడడానికి సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్, జేడీ(యూ) తదితర పారీ్టలు ముందుకొచ్చాయి. గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ అప్పట్లో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ. కానీ, జైలులో ఉన్నాడు. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి మొత్తం ఆరుగురు ఎంపీలను జైళ్ల నుంచి తాత్కాలికంగా బయటకు తీసుకొచ్చారు. వారిలో అతీక్‌ అహ్మద్‌ కూడా ఉన్నాడు.

వైద్య పరీక్షల నిమిత్తం శనివారం రాత్రి దాదాపు 10 గంటల ప్రాంతంలో పోలీసులు అతీక్ సోదరులను ఎంఎల్‌ఎన్‌ వైద్య కళాశాలకు తరలించారు. చేతులకు బేడీలతో ఉన్న సోదరులిద్దరూ అక్కడికి చేరుకున్న మీడియాతో మాట్లాడుతూ ముందుకు నడుస్తుండగా.. రెప్పపాటులో నాటకీయ పరిణామాలు జరిగిపోయాయి. మీడియా ముసుగులో వారితో పాటు నడుస్తున్న ముగ్గురు యువకులు ఉన్నట్టుండి పిస్టళ్లు తీశారు. నేరుగా వారిపైకి కాల్పులకు దిగారు. ఒకడు ముందు అతీక్‌ తలపై కాల్చాడు. విస్మయంతో చూస్తున్న అఫ్రష్‌ తలపైకి మరో తూటా దూసుకెళ్లింది.

దాంతో సోదరులిద్దరూ మీడియాతో మాట్లాడుతున్న వాళ్లు మాట్లాడుతున్నట్టుగానే కుప్పకూలిపోయారు. వారితో పాటున్న పోలీసులు కాల్పులు జరుగుతుంటే తలోవైపు చెదిరిపోయారు. ఆ వెంటనే హంతకులు ముగ్గురూ కుప్పకూలిన అతీక్‌ సోదరుల దగ్గరికి వెళ్లి వారిపై తూటాల వర్షం కురిపించారు. అంతలో తేరుకున్న పోలీసులు వారివైపు దూసుకొచ్చారు. హంతకుల్లో ఇద్దరు చేతులు పైకెత్తి వారికి లొంగిపోయారు. మూడో వ్యక్తి కొద్ది దూరం పరిగెత్తినా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: పోలీసు వలయం మధ్య, మీడియా సాక్షిగా... అతీక్‌ సోదరుల హత్య

Advertisement

What’s your opinion

Advertisement