పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ
నకరికల్లు: కేసులు పెండింగ్ లేకుండా పరిష్కరించడంతోపాటు ఫిర్యాదుదారులతో స్నేహభావంతో మెలగాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు అన్నారు. నకరికల్లు పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. రౌడీషీటర్‌ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి అల్లర్లు, కొట్లాటలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామాలవారీగా సిబ్బందిని నియమించి సమాచార సేకరణ వేగవంతం చేశామన్నారు. సైబర్‌నేరాలు అరికట్టేందుకు పటిష్టచర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సత్తెనపల్లి రూరల్ సీఐ పి.కిరణ్, ఎస్‌ఐ కె.సతీష్ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో పాస్టర్ మృతి
అమరావతి: మండల పరిధిలోని ఉంగుటూరు శివారులోని నెమలికల్లు రోడ్డుపై శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో పాస్టర్ మరణించగా అతని భార్యకు తీవ్రగాయాలైన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు, బంధువులు అందించిన వివరాల ప్రకారం.. మండల పరిదిలోని లేమల్లె గ్రామానికి చెందిన హరనాథ్‌బాబు(50) పాస్టర్‌గా పనిచేస్తూ లేమల్లె మండెపూడి గ్రామాలలో చర్చిలు ఏర్పాటు చేసి ప్రార్థనలు చేస్తుంటారు. ఈక్రమంలో ఆదివారం ప్రార్థనలు నిర్వహించటం కోసం శనివారం రాత్రి లేమల్లె గ్రామం నుంచి స్కూటీపై భార్య వెంకటరత్నంతో కలిసి హరనాథ్‌బాబు మండెపూడికి బయలు దేరారు. ఈక్రమంలో ఉంగుటూరు శివారు నెమలికల్లు రోడ్డులో మిరపకాయల బస్తాలు లోడ్ చేయటానికి ఆపి ఉన్న ట్రాక్టర్ ట్రక్ వెనుక భాగాన్ని ప్రమాదవశాత్తు ఢీకొట్టారు. ప్రమాద శబ్ధానికి పొలంలో ఉన్న రైతులు వచ్చి అంబులెన్స్‌కు సమచారమిచ్చి అమరావతి కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌కు తరలించారు. ఈసంఘటనలో పాస్టర్ హరనాథ్‌బాబు మరణించగా ఆయన భార్య వెంకటరత్నంకు తీవ్ర గాయాలు కాగా మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు హరనాథ్‌బాబుకు ఇద్దరు వివాహితులైన కుమారులు ఉన్నారు. అమరావతి పోలీసులు ఈ ప్రమాద సంఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ


