చ‌రిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్.. ప్రపంచ క్రికెట్‌లో తొలి ప్లేయర్‌గా | Mitchell Starc Creates History In WTC Final | Sakshi
Sakshi News home page

చ‌రిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్.. ప్రపంచ క్రికెట్‌లో తొలి ప్లేయర్‌గా

Jun 13 2025 5:57 PM | Updated on Jun 13 2025 6:09 PM

Mitchell Starc Creates History In WTC Final

లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో బంతితో మ్యాజిక్ చేసిన స్టార్క్‌.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో తన జట్టును ఆదుకున్నాడు. 77 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆసీస్‌ను స్టార్క్ తన విరోచిత పోరాటంతో గట్టెక్కించాడు. 

హెడ్‌, స్మిత్‌, లబుషేన్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట.. స్టార్క్ తన విలువను మరోసారి చాటుకున్నాడు. తొమ్మిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ స్పీడ్ స్టార్‌.. ప్రోటీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. 136 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 58 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో స్టార్క్  ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఓ ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో తొమ్మిది లేదా అంతకంటే తక్కువ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు వెస్టిండీస్ మాజీ ఆటగాడు కోర్ట్నీ బ్రౌన్ పేరిట ఉండేది. 2004 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై తొమ్మిదో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రౌన్‌.. 35 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో బ్రౌన్ ఆల్‌టైమ్ రికార్డును స్టార్క్ బ్రేక్ చేశాడు.

సౌతాఫ్రికా టార్గెట్ 282..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 207 ప‌రుగుల‌కు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ల‌భించిన ఆధిక్యాన్ని జోడించి సౌతాఫ్రికా ముందు 282 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆసీస్ ఉంచింది. ఆసీస్ బ్యాటర్లలో స్టార్క్‌తో పాటు అలెక్స్ క్యారీ(43) ప‌రుగుల‌తో రాణించాడు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో ర‌బాడ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. లుంగీ ఎంగిడీ మూడు, జానెస‌న్‌,మార్‌క్ర‌మ్ త‌లా వికెట్ సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement