బడి బస్సులు భద్రమేనా?
నిబంధనలు పాటించాలి
ప్రత్యేకంగా దృష్టి
హిరమండలం:
జిల్లాలో బడి బస్సుల భద్రతపై అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి విద్యాసంవత్సరంలో సామర్థ్య పరీక్షలు, త్రైమాసిక తనిఖీలు చేపడుతున్నామని చెబుతున్నా ఎక్కడో ఓ చోట ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. ఈ విషయంలో రవాణా శాఖ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి కాలం చెల్లిన బస్సులు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలకు దిగితేనే ప్రమాదాలు అరికట్టవచ్చని తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 398 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ప్రైవేటు జూనియర్ కాలేజీలు 71, డిగ్రీ కాలేజీలు 85, ఇంజినీరింగ్ కాలేజీలు 3 ఉన్నాయి. వీటికి సంబంధించి 580 బస్సులు ఉన్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభంలో మే నెలలో సామర్థ్యం పరీక్షలు నిర్వహించారు. గతంలో రవాణా శాఖ అధికారులు ఈ ప్రక్రియ చేపట్టేవారు. ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. దీంతో తనిఖీలు నామమాత్రంగా జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అదునుగా పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. శ్రీకాకుళం, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో రవాణా శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి పాఠశాల, కాలేజీ బస్సుల్లో ఇటీవల తనిఖీలు చేశారు. చాలా వాటిలో అగ్నిమాపక పరికరాలు లేవు. కొన్నిచోట్ల ఉన్నా పనిచేయట్లేదు. ప్రథమ చికిత్స కిట్లలో మందులు కాలం చెల్లినని ఉన్నుట్ల గుర్తించారు. స్పీడ్ గవర్నెన్స్‌లోనూ లోపాలు బయటపడ్డాయి. ఇటువంటి లోపాలు బయటపడిన 208 బస్సులకు నోటీసులు జారీచేశారు. మరోవైపు చాలా బస్సుల్లో వయసుకు మించిన వారు, డ్రైవింగ్ లైసెన్స్‌లు లేని వారు డ్రైవర్లుగా నియమించినట్టు ఆరోపణలున్నాయి. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
●గత ఏడాది ఫిబ్రవరిలో మందస
మండలం ఉమాగిరి సమీపంలో
చెరువులో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు పడిపోయింది. ఆ సమయంలో ఐదుగురు విద్యార్థులు బస్సులో ఉన్నారు.
సమీపంలో ఉన్నవారు హుటాహుటిన చెరువులో దిగి విద్యార్థులను రక్షించారు.
స్కూల్ బస్సులకు సంబంధించి యాజమాన్యాలు నిబంధనలు పాటించాలి. ఎప్పటికప్పుడు వాహన సామర్థ్య పరీక్షలు చేసుకోవాలి. ఎటువంటి లోపాలు ఉన్నా సరి చేసుకో వాలి. అనుభవం ఉన్న డ్రైవర్లను నియమించుకోవాలి. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు.
– కె.వెంకటేష్ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ, హిరమండలం
పాఠశాల బస్సుల విషయంలో యంత్రాంగం ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఫీజు లు వసూలు చేస్తున్నవారు అందుకు తగ్గట్టు పాఠశాల బస్సుల నిర్వహణ చేపట్టడం లేదు. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే బస్సు సామర్థ్యంగా ఉండాలి. నిపుణులైన డ్రైవర్ ఉండాలి. ఈ విషయంలో అధికారు లు జాగ్రత్తలు తీసుకోవాలి.
– కె.చిన్నారావు విద్యార్థి తండ్రి,
ఎల్‌ఎన్‌పేట
బడి బస్సులు భద్రమేనా?


